టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై విస్పష్ట ప్రకటన చేశారు. బాబుతో ములాఖత్ తర్వాత బయటకు వచ్చిన పవన్.. లోకేష్, బాలకృష్ణతో కలసి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎలక్షన్స్‌లో టీడీపీతో కలసి తాము పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై ఏపీ మంత్రి రోజా సీరియస్ కామెంట్స్ చేశారు. ప్యాకేజీ కోసం పవన్ జనసేన కార్యకర్తల్ని తాకట్టు పెట్టాడని విమర్శించారు.
వార్డు మెంబర్‌గా కూడా గెలవని పవన్ కల్యాణ్.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు మంత్రి రోజా. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో పవన్ కూడా ప్యాకేజీ తీసుకున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబుది అక్రమ కేసు కాదని.. అడ్డంగా దొరికిపోయిన కేసు అని ఆమె చెప్పారు. తన సీట్లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు రంగంలోకి దింపాడన్నారు మంత్రి రోజా. తప్పు చేయకపోతే తన ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేయాలన్నారు. పవన్ కల్యాణ్‌కు కనీస పరిజ్ఞానం కూడా లేదని దుయ్యబట్టారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఐటీ, జీఎస్టీ, ఈడీలు కూడా విచారణ జరిపాయని మంత్రి రోజా గుర్తుచేశారు. 13 చోట్ల సంతకాలు పెట్టి దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని ఆమె విమర్శించారు. తన తండ్రి మీద చెప్పులేసిన చంద్రబాబునే బాలకృష్ణ ఏమీ చేయలేకపోయాడని.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఏం చేయగలడని రోజా చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో నిజంగానే చంద్రబాబు తప్పు చేయకపోతే దీనిపై సీబీఐ, ఈడీ విచారణను కోరాలని పేర్కొన్నారు. అలాగే ఆదాయానికి మించిన ఆస్తులు ఎలా వచ్చాయో వాటిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరాలన్నారు మంత్రి రోజా. అప్పుడు వాళ్లు తప్పు చేశారో లేదో తెలుస్తుందన్నారు.
ఇదీ చదవండి: అప్పుడే తిట్టుకుంటున్న TDP-జనసేన ఫ్యాన్స్!