Dharani
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఆ వివరాఉల..
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఆ వివరాఉల..
Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేశారు. ఈ ఎనిమిది మందిలో అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలుగురు ఉండగా.. టీడీపీ నుంచి మరో నలుగురు శాసనసభ్యులు ఉన్నారు. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదులతో ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. దాంతో శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి సమాచారాన్ని అందించారు.
అనర్హత వేటు విధించిన వారిలో వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వీరిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అలానే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్‌లపై అనర్హత వేటు విధించారు. వీరిపై టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు స్పీకర్. అనంతరం ఈ ఎనిమిది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో శాసనసభ్యులపై అనర్హత వేటు విధించడం ఇదే తొలిసారి అంటున్నారు. దీనికి సంబంధించి ఇవాళ గెజిట్ వెలువడనుంది.
స్పీకర్ తమ్మినేని సీతారాం.. జనవరి 29న తొలిసారి రెబెల్ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పిలిచారు. వైఎస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురూ స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేస్తూ చీఫ్‌విప్ సమర్పించిన ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తమకు ఇవ్వాలని.. వాటిని పరిశీలించి మళ్లీ వివరణ ఇచ్చేందుకు వస్తామని స్పీకర్‌కు తెలిపారు.
ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ మాత్రమే జనవరి 29న జరిగిన విచారణలో స్పీకర్ ముందు హాజరయ్యారు. మిగిలిన ముగ్గురూ స్పీకర్‌ను కలవలేదు. తర్వాత కూడా ఎమ్మెల్యేలకు వ్యక్తిగత విచారణ కోసం స్పీకర్ సమయం ఇచ్చినప్పటికీ వారు హాజరు కాలేదు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. తాజాగా ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీల విప్‌లు చేసిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలను పూర్తిగా పరిశీలించిన స్పీకర్.. ఆ 8 మంది సభ్యులు పార్టీ ఫిరాంయిచినట్లు తేల్చారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు.. ఏపీ లెజిస్టేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.