ఇరు తెలుగు రాష్ట్రాలను వాన ముసురు వీడటం లేదు. తెలంగాణలో అయితే గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అంతటా జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పలు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు దాదాపుగా 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అలర్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. బుధవారం, గురువారం తెలంగాణలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది కేసీఆర్ సర్కారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో గత వారం మూడ్రోజులు (గురు, శుక్ర, శనివారాలు) ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వానలు ఆగకపోవడం, మరో మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్ అయిన గవర్నమెంట్ రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
కాగా, ఎడతెరపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు ప్రణాళిక రూపొందించారు. ఐకియా స్టోర్ నుంచి సైబరాబాద్ టవర్స్, బయో డైవర్సిటీ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగౌట్ చేసుకోవాలని తెలిపారు. ఐకియా స్టోర్ నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఆఫీసులను సాయంత్రం 4.30 గంటలకు లాగౌట్ చేసుకోవాలని సూచించారు. అదే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగౌట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.