iDreamPost

రాజధాని భూ కుంభకోణం – ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్

రాజధాని భూ కుంభకోణం – ఏపీ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధాని పేరిట జరిగిన భూ కుంభకోణంపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే . అయితే రాజధాని పేరిట జరిగిన అక్రమాలను సిట్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. తాజాగా ఈ భూకుంభకోణంలో మొదటిసారిగా ఓ అధికారిని సిట్ బృందం అరెస్టు చేసింది. ఆంద్రప్రదేశ్ సి.ఆర్.డి.ఏ డిప్యుటి కలెక్టర్ గా భాద్యతలు నిర్వహించిన మాధురీని విజయవాడలోని తన నివాసంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని అనంతరం రిమాండుకు తరలించారు.

2016లో రాజధాని ప్రాంతంలో నెక్కళ్లు గ్రామానికి చెందిన రావెల గోపాల కృష్ణ అనే తెలుగుదేశం నేతకి భూమిని అక్రమం గా రిజిస్టర్ చేసినట్టుగా సిట్ దర్యాప్తులో తేలడంతో అధికారులు ఆమెను అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. అమరావతి పరిధిలో టీడీపీ నేత రావెల గోపాల కృష్ణ తప్పుడు పత్రాలతో తమ భూమిని కాజేశారంటూ స్థానిక రైతులు తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన సిట్, గోపాల కృష్ణ తనది కాని భూమిని రాజధానిలో ఉన్నట్టు చూపించి ప్లాట్లు తీసుకుని నిజమైన రైతులకు మాత్రం సీఆర్‌డీఏలో తక్కువ భూమి ఉన్నట్టు రికార్డుల్లో చూపించి మోసం చేసినట్టు గుర్తించిన అధికారులు ఇప్పటికే గోపాల కృష్ణను అరెస్టు చేశారు.

అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో సి.ఆర్.డి.ఏ డిప్యుటీ కలెక్టర్ హస్తం కూడా ఉందని తేలడంతో అమెను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. దీంతో ఈ రాజధాని భూ కుంభకోణంలో తొలిసారి ఓ మహిళా అధికారిని సిట్ బృందం అరెస్టు చేసినట్టు అయింది. ఇలాంటి ఘటనలు అమరావతి ప్రాంతంలో మరిన్ని ఉన్నాయని సిట్ అధికారులు భావిస్తున్న నేపద్యంలో ఈ వ్యవహారంపై సిట్ బృందం దృష్టి సారించి లోతుగా దర్యాప్తు చేయబోతునట్టు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి