iDreamPost

KGF Chapter 2 Movie Review : కెజిఎఫ్ చాఫ్టర్ 2 రివ్యూ

KGF Chapter 2 Movie Review : కెజిఎఫ్ చాఫ్టర్ 2 రివ్యూ

పైకి చాలా పరిమితంగా కనిపించే కన్నడ సినిమా స్థాయిని వందల కోట్లకు చేర్చిన ఘనత కెజిఎఫ్ కే దక్కుతుంది. రాజ్ కుమార్ లాంటి లెజెండరీ యాక్టర్స్ ఎందరు ఉన్నప్పటికీ ఇలాంటి ఘనతకు అందుకోలేకపోవడానికి కారణాలు ఎన్నో. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ వల్ల సీన్ మారిపోయింది. అందుకే ఇప్పుడు శాండల్ వుడ్ పరిధి ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అందుకే కెజిఎఫ్ 2 మీద అంచనాలు మాములుగా లేవు. ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ప్రమోషన్లు చేయనప్పటికీ అన్నిరాష్ట్రాల్లో సెకండ్ పార్ట్ కు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం నివ్వెరబోయాయి. మరి ఇంత హైప్ ని మోసుకొచ్చిన చాప్టర్ 2 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

ఇది మొదటి భాగానికి స్పష్టమైన కొనసాగింపు. గరుడను చంపాక రాఖీ భాయ్(యష్)గోల్డ్ మైన్స్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుని బంగారం వెలికి తీసి దాంతో వ్యాపారం చేస్తుంటాడు. కానీ దీని స్థాపనకు కారణమై అందరూ చనిపోయారనుకున్న ఒకప్పటి గరుడ స్నేహితుడు అధీర(సంజయ్ దత్) హఠాత్తుగా వచ్చి రాఖీ మీద దాడి చేసి తరిమేస్తాడు. విదేశాలకు వెళ్లిన రాఖీ తిరిగి వచ్చి అధీరను చావు దెబ్బ తీసి తిరిగి గనులను స్వంతం చేసుకుంటాడు. ఈ క్రమంలో భారతదేశ ప్రధాని రైమిక సేన్(రవీనా టాండన్)కు టార్గెట్ అవుతాడు. ఇంతకీ ఇతని ప్రయాణం ఎలా సాగింది, చివరికి ఏమయ్యాడు ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి

నటీనటులు

టీవీ సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు దేశమంతా గుర్తించే స్టార్ గా ఎదిగిన యష్ ఇప్పుడీ కెజిఎఫ్ 2లోనూ రాఖీ భాయ్ కు తనకంటే బెస్ట్ ఛాయస్ లేరని మరోసారి ఋజువు చేశాడు. ఎమోషనల్ సీన్స్ తగ్గినప్పటికీ యాక్షన్ సన్నివేశాల్లో బాడీ లాంగ్వేజ్ ప్లస్ టైమింగ్ తో బాగా ఆకట్టుకుంటాడు. నాలుగేళ్లకు పైగా బారుడు గెడ్డంతో రాఖీ భాయ్ రూపంలో ఇంతబలంగా రిజిస్టర్ అయ్యాక నెక్స్ట్ చేయబోయే సినిమాలు యావరేజ్ గా ఉన్నా సరే రిసీవ్ చేసుకోవడం కష్టమే. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎదురుకున్న ఇబ్బందులు యష్ కు రాకూడదనుకుంటే సబ్జెక్ట్ సెలక్షన్ లో ఒకటికి పదిసార్లు ఆలోచించి అడుగేయక తప్పదు. రాఖీ భాయ్ ఎఫెక్ట్ అది.

విలన్ గా సంజయ్ దత్ పర్ఫెక్ట్ ఛాయస్. నార్త్ మార్కెట్ కోసం తీసుకున్నప్పటికీ కారెక్టర్ కు తగ్గట్టు క్రూరత్వాన్ని చక్కగా పలికించాడు. కాకపోతే పాత్ర డిజైన్ లోనే లోపం ఉండటంతో ఇంకాస్త బలంగా ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం బంగారు బుల్లోడులో మెరిసిన రవీనాటాండన్ ఈ వయసులోనూ మొహంలో చక్కని కళతో పిఎంగా బాగా చేసింది. రావు రమేష్ కొంత హడావిడి పడ్డారు. అనంత్ నాగ్ స్థానంలో వచ్చిన ప్రకాష్ రాజ్ ఆ లోటు లేకుండా మేనేజ్ చేశారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి పెర్ఫార్మన్స్ పరంగా పెద్దగా స్కోప్ దక్కలేదు. అయ్యప్ప శర్మ, అచ్యుత్ కుమార్, ఈశ్వరిరావు, అర్చన, మాళవిక తదితరులు సరిపోయారు

డైరెక్టర్ & టీమ్

ఒక కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ కథను కోట్లాది మంది ఆరాధిస్తూ చూసేలా చేయడం ఒక్క సినిమా మాధ్యమానికే సాధ్యం. కమల్ హాసన్ నాయకుడుతో మొదలుపెట్టి ఇప్పటి కెజిఎఫ్ దాకా అందరూ ఫాలో అయిన దారే ఇది. కానీ ప్రశాంత్ నీల్ ఆలోచనా ధోరణి ఇప్పటి తరానికి తగ్గట్టు ఉండటంలోనే అతని ప్రత్యేకత దాగుంది. థియేటర్ కు వచ్చే ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా ఏం చేయాలో చాలా బలమైన కసరత్తు చేసినట్టు కీలకమైన సన్నివేశాలను పేర్చుకున్న తీరు స్టన్నింగ్ అనిపిస్తుంది. ఇలా ఎలా ఆలోచిస్తాడాని ప్రశాంత్ సమకాలీకులు కూడా ఆశ్చర్యపోయేలా టేకింగ్ లో చూపించిన నేర్పరితనం యూత్ మాస్ ని కట్టిపడేస్తుంది.

ఈ సీక్వెల్ మొత్తం ఎలివేషన్లే ఎలివేషన్లు. మనం ఎన్నడూ చూడని చూసే అవకాశమే లేని ఒక ప్రపంచంలో తిప్పుతూ రాఖీ భాయ్ అనే నేరస్తుడితో ప్రయాణం చేస్తూ అతను చేసే తప్పులు కూడా ఒప్పే అనిపించడంలో ప్రశాంత్ నీల్ మరోసారి సక్సెస్ అయ్యాడు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో అసలు సింక్ అవ్వడానికి అవకాశమే లేని మదర్ సెంటిమెంట్ ని కూడా బలంగా రిజిస్టర్ అయ్యేలా చేయడం తన పనితనానికి నిదర్శనం. ముఖ్యంగా షాట్ డివిజన్. పాత్రల తాలూకు హావభావాలు ఏ మోతాదులో ఏ యాంగిల్ లో ఎంత సేపు చూపించాలి అనేదాని మీద చాలా హోమ్ వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. పర్ఫెక్షన్ కోసం పడే తాపత్రయం అది.

సరే ఈ హీరోయిజం తాలూకు వైబ్రేషన్స్ ని కాసేపు పక్కనపెడితే చాప్టర్ 2 నుంచి మనం ఏదైతే ఆశించామో దాన్ని ప్రశాంత్ నీల్ దాదాపు అందుకున్నంత పని చేశాడు కానీ ఆ టార్గెట్ కి కొద్దిదూరంలో ఆగిపోయిన మాట వాస్తవం. సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడంలో తప్పు లేదు. అసలు ప్రేక్షకుడు హాలుకు వచ్చేదే దాన్ని ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం. అలా అని చెప్పి మరీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకున్నా ఇబ్బందే. ఒక మైన్ ఓనర్ దేశ ప్రధానిని ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చి అధికారిని కలిసినంత ఈజీగా చూపించడం, సెంటర్ లో పవర్ పొలిటిక్స్ ఇంత సింపుల్ గా ఉంటాయా అనిపించేలా కొన్ని విషయాలు లైట్ తీసుకోవడం అక్కడక్కడా గుచ్చుకుంటాయి.

ఊపులో ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదనే కామెంట్ నిజమే. కాదనలేం. ఈ స్థాయిలో గ్రాండియర్ ని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు రియాలిటీలో ఫాంటసీని ఎక్కువ మిక్స్ చేయకూడదు కదా. ఈ సంగతి వదిలేస్తే ఎంతో ఊహించుకున్న అధీరా-రాఖీల క్లాష్ కూడా ఏమంత స్ట్రాంగ్ గా లేదు.అప్పటిదాకా అడ్రెస్ లేని అధీరా ఉన్నట్టుండి గ్యాంగ్ ని వెంటేసుకుని వస్తే రాఖీ అంత సులభంగా తగ్గడం కొంత మైనస్సే. ఆడియన్స్ ఇలా అనుకుంటారని ముందే పసిగట్టిన ప్రశాంత్ దాని తర్వాత అధీరాని దెబ్బ కొట్టే ఎపిసోడ్ నమ్మశక్యంగా లేకపోయినా మాస్ తో విజిల్స్ వేయించే రేంజ్ లో పండటంతో ఎక్కడిక్కడ తప్పులు కవర్ చేసేశాడు.

యాక్షన్ లవర్స్ కు కెజిఎఫ్ 2 ఫుల్ మీల్స్ అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కుటుంబ ప్రేక్షకులు ఎలాగూ టార్గెట్ కాదు కాబట్టి తాను అనుకున్న లక్ష్యాన్ని ప్రశాంత్ నీల్ సాఫీగా చేరుకున్నాడు. కాకపోతే ముందు చెప్పినట్టు లూప్ హొల్స్ ని కప్పలేకపోయాడు. పార్లమెంట్ కు వెళ్ళిపోయి అక్కడే సెంట్రల్ మినిస్టర్ ని చంపాక కూడా రాఖీ భాయ్ తాపీగా సామాన్లు, బంగారం సర్దుకుని షిప్పులో వెళ్ళేదాకా ప్రధాని చూస్తూ కూర్చోవడం, అసలు పోలీస్, సెక్యూరిటీ దరిదాపుల్లో లేకపోవడం వాస్తవానికి దూరంగా ఉంది. ప్రైమ్ మినిస్టర్ కాకుండా కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి అన్నా సరిపోయేది. ఇలా జరిగే ఛాన్స్ ఉంది కదాని సర్దుకునేవాళ్ళం.

సినిమా చూస్తున్న జనాన్ని రాఖీ భాయ్ చేస్తోంది నిజమని నమ్మించే భ్రమ ఇలాంటి సీన్ల వల్ల కొంత తగ్గిపోయింది. కెజిఎఫ్ 2లో గొప్ప కథేమీ లేదు. బలమైన ఎలివేషన్లు నమ్ముకుని దాని చుట్టూ షుగర్ కోటింగ్ లాగా స్టోరీ రాసుకున్నాడు ప్రశాంత్. ఫస్ట్ పార్ట్ లో అభిమానులు మెచ్చింది ఇవే కాబట్టి ఈసారి మరింత స్ట్రాంగ్ గా చూపించాడు. కానీ ఈ పీక్స్ హీరోయిజం తర్వాత చేయబోయే సినిమాల్లోనూ పదే పదే రిపీట్ చేస్తే మాత్రం ఏదో ఒక స్టేజిలో అది సాలార్ ద్వారా కావొచ్చు లేదా మరో సినిమా కావొచ్చు, ప్రశాంత్ కు బ్రేక్ పడటం ఖాయం. కెజిఎఫ్ 2 ప్రపంచం ముమ్మాటికీ సరికొత్త అనుభూతే కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ ని తప్పించుకోలేకపోయింది

సంగీత దర్శకుడు రవి బస్రూర్ మరోసారి నేపధ్య సంగీతంతో కెజిఎఫ్ వరల్డ్ ని నిలబెట్టారు. కొంత రిపీట్ సౌండ్స్ ఉన్నప్పటికీ, కొన్ని శబ్దాలు విపరీతంగా అనిపించినప్పటికీ ఓవరాల్ గా తన పనితనం టాప్ నాచ్ అని చెప్పాలి. భువన్ గౌడ ఛాయాగ్రహణంకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. చాప్టర్ 1 కు మించిన అవుట్ ఫుట్ ఇచ్చారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ ల్యాగ్ కు కారణమా కాదా అని చెప్పలేం.సెకండ్ హాఫ్ కొంత తగ్గించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణ విలువలు మాత్రం వాహ్ అనిపిస్తాయి. కథను దర్శకుడిని నమ్మి మంచినీళ్లలా కోట్లు ఖర్చు పెట్టే ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం

ప్లస్ గా అనిపించేవి

యష్ ఎనర్జీ అండ్ పెర్ఫార్మన్స్
యాక్షన్ ఎపిసోడ్స్
విజువల్స్
క్యాస్టింగ్

మైనస్ గా తోచేవి

బలమైన కంటెంట్ కాకపోవడం
సెకండ్ హాఫ్ నిడివి
వాస్తవానికి మరీ దూరంగా జరగడం
ఎమోషన్లూ వీకే

కంక్లూజన్

హీరోయిజం ఎలివేషన్లకు, కిక్కిచ్చే యాక్షన్ ఎపిసోడ్లకు ఊగిపోయే సగటు మాస్ ప్రేక్షకుడి మనస్తత్వం ఉంటే కనక కెజిఎఫ్ 2 ఖచ్చితంగా నచ్చుతుంది. అలా కాకుండా ఎంత కమర్షియల్ సినిమా అయినా సరే స్ట్రాంగ్ కంటెంట్, హత్తుకునే ఎమోషన్స్ ఉండాలంటే మాత్రం ఇది పూర్తి అంచనాలను చేరుకోలేకపోవచ్చు. ఇందులో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉండవు. కానీ గుడ్లప్పగించి చూడాలనిపించే విజువల్స్ ఉంటాయి. ఇది గొప్ప కథ అనిపించదు. కానీ సింపుల్ లైన్ ని గొప్పగా చెప్పాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఒకటి మాత్రం నిజం. ఒకసారి చూడాలనుకునే వాళ్లకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే బొమ్మ ఇది. కాకపోతే మరీ ఓవర్ గా ఊహించుకోకుంటేనే సుమా

ఒక్క మాటలో : ఎలివేషన్ల మాస్ మసాలా

KGF 3 – నిజంగా ఛాన్సుందా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి