iDreamPost

Review : Ramarao On Duty రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ

Review : Ramarao On Duty రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ

మాస్ మహారాజాగా మినిమమ్ గ్యారెంటీ హీరోగా బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్న రవితేజ కెరీర్ ఈ మధ్య ఎగుడుదిగుడుగా సాగుతోంది. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చినప్పటికీ ఆ వెంటనే ఖిలాడీ డిజాస్టర్ రూపంలో షాక్ ఇచ్చింది. అయినా కూడా తనకంటూ ఉన్న ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు ఇమేజ్ ని కాపాడుతూ వస్తోంది. అయితే రామారావు ఆన్ డ్యూటీకి ఆశించినంత బజ్ లేకపోవడం అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద నెలకొన్న అనూహ్యమైన పరిస్థితులు దీనికి కారణమైనప్పటికీ టాక్ బాగుంటే ఆడియన్స్ థియేటర్లకు వస్తారనడంలో డౌట్ అక్కర్లేదు. మరి రామారావు డ్యూటీ ఎలా చేశాడో రివ్యూలో చూద్దాం

కథ

ఇది 1994లో జరిగే కథ. హార్స్ లీ హిల్స్ లో రెవిన్యూ ఆఫీసర్ గా పనిచేసే రామారావు(రవితేజ)చాలా సిన్సియర్. డ్యూటీ కోసం హద్దులు దాటడానికైనా వెనుకాడడు. ట్రాన్స్ఫర్ మీద భార్య (దివ్యంశ కౌశిక్), కొడుకుతో అక్కడికి వెళ్ళాక ఎర్ర చందనం స్మగ్లింగ్ తాలూకు వ్యవహారంలో తన మాజీ ప్రేయసి మాలిని(రజిషా విజయన్)భర్తతో సహా ఇరవై మంది కనిపించకుండా పోయారని తెలుసుకుంటాడు. ఈ కేసును ఛేదించే బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంటాడు. అడ్డు పడుతున్న మురళీ(వేణు)లాంటి పోలీస్ ఆఫీసర్లను దాటుకుని అసలు హంతకుల కోసం వేట మొదలు పెడతాడు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదురుకున్నాడనేదే మెయిన్ పాయింట్

నటీనటులు

ఎనర్జీనే బలంగా వాడుకుంటూ ఎంత వయసొచ్చినా తన టైమింగ్ తో నెగ్గుకొస్తున్న రవితేజ ఇందులోనూ ఫ్యాన్స్ ఆశించినట్టే వాళ్ళు కోరుకున్నవి ఇచ్చాడు. ఇలాంటి పాత్ర గతంలో చేయనప్పటికీ తాను పోలీసైనా రెవిన్యూ అధికారైనా బాడీ లాంగ్వేజ్ విషయంలో మాత్రం మాస్ ని మెప్పించేలా ఇందులోనూ కొనసాగించాడు. ఏజ్ దృష్ట్యా మొహంలో ఆ ఛాయలు కనిపిస్తున్నా గెడ్డం పెట్టుకుని పెర్ఫార్మన్స్ తో మేనేజ్ చేస్తున్న మాస్ మహారాజాకు రామారావు మరీ స్పెషల్ గా నిలిచిపోయే క్యారెక్టర్ కాదు కానీ రొటీన్ టెంప్లేట్స్ తో పోలిస్తే ఇది బెటర్ అనిపిస్తుంది. తన యాక్టింగ్ డ్యూటీ విషయంలోనూ రవితేజ సిన్సియర్ గా చేశాడు కాబట్టి నో కంప్లయింట్స్

హీరోయిన్లలో దివ్యంష కౌశిక్ ది రొటీన్ గా చూసే వ్యవహారమే. ప్రత్యేకంగా స్కోప్, నటించేందుకు ఛాలెంజ్ అంటూ ఏమీ లేదు. రజిషా విజయన్ గురించి ఎక్కువ ప్రచారం చేశారు కానీ హీరోకి సంబంధించిన లింక్ విషయంలో పెట్టిన ట్విస్టు ఒకటే ఊహించనిది. పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి పోలీస్ గా అంతగా అతకలేదు. తనలో మునుపటి స్పార్క్ తగ్గిందనిపిస్తుంది. క్యాస్టింగ్ చాలా పెద్దది. నాజర్, పవిత్ర లోకేష్, నరేష్, భరణి, రాహుల్ రామకృష్ణ, మధుసూదన్ రావు, జాన్ విజయ్, సురేఖావాణి, చైతన్య కృష్ణ, శ్రీ ఇలా చిన్నా చితకా నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు అందరినీ వాడేశారు. కొందరు మాత్రమే ఓ పరిధి వరకు రిజిస్టర్ అవుతారు

డైరెక్టర్ అండ్ టీమ్

కమర్షియల్ హీరోని డీల్ చేసేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని బ్యాలన్స్ చేయడం అంత సులభం కాదు. బాలకృష్ణని బోయపాటి హ్యాండిల్ చేసినట్టుగా ఇతర దర్శకులు ఆ అంచనాలు అందుకోవడంలో ఫెయిలవుతున్నది ఈ కారణంగానే. శరత్ మండవ రచనకు డైరెక్షన్ కు కొత్త కాదు. ఆల్రెడీ అనుభవం ఉంది. టాలీవుడ్ వరకే ఇది తనకు కొత్త ఎంట్రీ. పెద్ద క్యాస్టింగ్, మంచి బడ్జెట్ చేతిలో ఉన్నపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ శరత్ మాస్ మసాలాకు సీరియస్ ఇష్యూకు మధ్యలో ఎటు బలంగా నిలబడాలో అర్థం కాని కన్ఫ్యూజన్ లో రామారావుని అటుఇటు నలిపేశాడు. రవితేజని ఎలా వాడుకోవాలో అంతుచిక్కక ఒడ్డుని చేరలేకపోయాడు..

ఒక ప్రాంతం నేటివిటీని తీసుకుని పాత కథను చెబుతున్నప్పుడు అక్కడ యాస ఉంటేనే సహజత్వంగా ఉంటుందనుకోవడం తప్పు. అసలు ప్రేక్షకులకు ఈ గోల అవసరం లేదు. మాములు తెలుగులో మాట్లాడించినా సరిపోతుంది. ఏదో పుష్పలో వర్కౌట్ అయ్యింది కదాని ఇందులోనూ మదనపల్లి స్లాంగ్ ని ఇరికించే ప్రయత్నం బెడిసికొట్టింది. పాత్రలు ఒక్కో సీన్ లో ఒక్కోలా మాట్లాడతాయి. ఇంత వృథా ప్రయాస పడే బదులు రెగ్యులర్ ల్యాంగ్వేజ్ లో వెళ్లిపోయినా సరిపోయేది. రామారావు స్క్రిప్ట్ ని ఎప్పుడు రాసుకున్నారో కానీ ఎంత వద్దనుకున్నా పుష్ప వాసనలు కొడుతూనే ఉండటం పెద్ద మైనస్. అది వచ్చి ఎనిమిది నెలలే కావడంతో వద్దన్నా గుర్తొస్తూనే ఉంటుంది

అసలు పాత్రల ఎస్టాబ్లిష్ మెంటే జరిగే చేయలేకపోయారు. పేపర్ మీద పవర్ ఫుల్ గా వినిపించే అవకాశమున్న రామారావు ఎంట్రీ ఎపిసోడ్ స్క్రీన్ మీద చప్పగా అనిపిస్తుంది. రైతుల ప్రయోజనం కోసం తన డ్యూటీని పక్కనపెట్టి మరీ డబుల్ గేమ్ ఆడటం కన్విన్సింగ్ గా చూపించలేదు. దానికి తోడు కేవలం హీరోని ఎలివేట్ చేయడానికి ఇలా చేయడం కరెక్టేనని కోర్టుతో చెప్పించడం మరీ సిల్లీగా ఉంది. ఓ అరగంట సేపు చుట్టూ ఉన్న పాత్రలు రామారావుని అవసరం లేకపోయినా అదే పనిగా పొగడటం ఇబ్బంది పెడుతుంది. ఎంత ప్రభుత్వ అధికారి అయినా రవితేజ కాబట్టి మాస్ ని టార్గెట్ చేయాల్సిందనేలా రాసుకున్న డైలాగులు పేలకపోగా చప్పగా ఉన్నాయి.

సందేశం ఏదైనా సరే ఇలాంటి డ్రామాల్లో మెయిన్ విలన్ ని ఎక్కువ సేపు దాచకూడదు. ఏదో బ్లాక్ బస్టర్ అయిపోతుందన్న నమ్మకంతోనో లేక ఎక్కడ చూపించాలో తెలియని అయోమయమో ఏమో కానీ అలా చేయడమే బెడిసి కొట్టింది. హీరోతో ఎన్ని బిల్డప్పులు ఇప్పించినా ప్రతినాయకుడు కనీసం సెకండ్ హాఫ్ లో అయినా ఎంట్రీ ఇవ్వాలి. అదేమీ లేకుండా నాలుగైదు ట్విస్టులు పట్టుకుని వేలాడుతూ చివర్లో చూశారా మీ మైండ్ పోయే మలుపు పెట్టాం అనేలా చూపించిన విధానం అభిమానులకు సైతం నచ్చదు. ఇంతా చేసి అక్కడ శ్రీకాంతో లేక జగపతిబాబు రేంజ్ ఆర్టిస్టు ఉంటే ఏదో పోన్లే అనుకోవచ్చు. ఇంత బ్రతుకు బ్రతికి చివరికి ఇంటివెనుక చచ్చిన సామెత టైపులో ముగించారు

శరత్ మండవలో మంచి రైటర్ ఉన్నాడు. ఎప్పుడో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇది తయారు చేసినట్టు ముందే చెబుతారు. నిజానికి ఆ అవసరం కూడా లేదు. స్మగ్లింగ్ ఇప్పటికీ శేషాచలం అడవుల్లో జరుగుతూనే ఉంది. వర్తమానంలో జరిగినట్టు చూపించినా నడిచిపోయేది. ముప్పై ఏళ్ళ క్రితం న్యూస్ పేపర్లలో వచ్చిన కొన్ని సంఘటనలు ఇప్పుడు చదివితే ఎగ్జైటింగ్ గా అనిపించవచ్చు. కానీ వాటిని సినిమాటిక్ మెటీరియల్ గా మార్చడం అంత సులభం కాదు. పుష్ప విషయంలో సుకుమార్ సక్సెస్ సాధిస్తే విరాట పర్వంతో మంచి ప్రయత్నం చేసిన వేణు ఊడుగుల బ్యాడ్ రిజల్ట్ అందుకున్నారు. తేడా అందరికీ తెలిసిందే.

ఏ జానర్ కైనా ఒక గ్రామర్ ఉంటుంది. పాత్రల మధ్య సంబంధాలు, వాటికి సంబంధించిన ఇంటర్ లింకులు, మెయిన్ కాంఫ్లిక్ట్ ని బలంగా రిజిస్టర్ లాంటివి ప్రాధమిక సూత్రాలు. వీటిని తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో సరిగ్గా రెండు వారాల క్రితం ది వారియర్ నిరూపించింది. రామారావు కూడా అదే దారి పట్టాడు. మాస్ ఆడియన్స్ లోనూ క్రమంగా మార్పు వస్తోంది. వాళ్ళూ రొటీన్ ప్రెజెంటేషన్ ని ఒప్పుకోవడం లేదు. ఉత్తి యాక్షన్ ఎపిసోడ్లు, గాల్లో ఎగిరే ఫైట్లు, మాములు ట్విస్టులకు ఎగ్జైట్ అవ్వడం లేదు. ఎమోషన్లు డిమాండ్ చేస్తున్నారు. అడవిరాముడు ఘరానా మొగుడు కాలం నుంచి అఖండ దాకా దీన్ని ఫాలో అయినవాళ్లు ఫెయిల్ కాలేదు.

ఇప్పటి పబ్లిక్ కి ఒకప్పుడు ఏం జరిగిందని చెప్పాలనుకోవడం మంచిదే. డ్రామా లేకుండా ఎంత బడ్జెట్ పెట్టినా లాభం లేదు. అసలే ఓటిటిల కాలంలో డాక్యుమెంటరీలు సైతం భారీ బడ్జెట్ లతో తీస్తున్నారు. అలాంటిది టికెట్ రేట్లకు భయపడో లేదా వర్షాలకు బెదిరో థియేటర్ కు రాని జనాన్ని కదిలించాలంటే ఎన్టీఆర్ కాలం నాటి రామారావులు కాదు కావాల్సింది. జూనియర్ ఎన్టీఆర్ జెనరేషన్ విక్రమ్ లు రావాలి. అలా అని తమిళ మలయాళ దర్శకులు మనకన్నా గొప్పగా తీస్తున్నారని కాదు. ఆ మధ్య వచ్చిన పృథ్విరాజ్ కడువాలో ఉన్నది కూడా అరిగిపోయిన మసాలానే. కాకపోతే దాన్ని వండిన దర్శకుడు దినుసులు సరిగ్గా వేసుకోవడం వల్ల రుచి కుదిరింది అంతే

సంగీత దర్శకుడు సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనితనం కొన్నిసార్లు బాగుందనిపిస్తే మరికొన్ని చోట్ల అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. టైమింగ్ తేడా కొట్టడం వల్ల ఏ పాటని ఎంజాయ్ చేయలేకపోతాం. సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం బడ్జెట్ పరంగా ఉన్న లిమిటేషన్స్ ని దాటి క్వాలిటీ వర్క్ ని ఇచ్చింది. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ గురించి కామెంట్ చేయలేం. స్క్రిప్ట్ లోనే ల్యాగ్ ఉన్నప్పుడు తను మాత్రం ఏం చేయగలడు. పీటర్ హైన్, స్టంట్ శివ పోరాటాలు బాగున్నాయి కానీ అవీ పూర్తిగా సింక్ కాలేకపోయాయి. నిర్మాణ విలువలు మరీ అత్యంత భారీగా అనే పదం వాడలేం కానీ ఉన్నంతలో ఎక్కువే ఖర్చు పెట్టిన మాట వాస్తవం

ప్లస్ గా అనిపించేవి

రవితేజ
కొంత బీజీఎం
స్టోరీ బ్యాక్ డ్రాప్

మైనస్ గా తోచేవి

పాటలు
సెట్ అవ్వని ట్విస్టులు
కథనం
రొటీన్ టేకింగ్

కంక్లూజన్

రవితేజ సినిమా అంటేనే ఎంటర్ టైన్మెంట్ ప్లస్ యాక్షన్ అంతే. ఈ రెండు సరిగ్గా కుదిరితే చాలు మాస్ మహారాజా టికెట్ డబ్బులకు న్యాయం చేకూరుస్తాడు. విక్రమార్కుడు నుంచి క్రాక్ దాకా ఇది ఎన్నో సార్లు రుజువయ్యింది. కానీ బలహీనంగా ఉన్న సబ్జెక్టుని తన ఎనర్జీ కాపాడలేదని రామారావు ఆన్ డ్యూటీ మళ్ళీ నిరూపించింది. ఓటిటి జమానాలో మారిపోయిన కమర్షియల్ పరిధిని దర్శక రచయితలు దృష్టిలో పెట్టుకుని కథలు రాయాలే తప్ప హీరోని సంతృప్తి పరచడానికో లేక ఫ్యాన్స్ ని మెప్పించడానికో కాదు. అలా చేస్తే ఏమవుతుందో ఇందులో చూడొచ్చు. ఖిలాడీ కంటే బెటరా అనే అమాయకమైన ప్రశ్న వేసుకుని చూడాలనుకుంటే ఓకే కానీ లేదంటే సైన్ ఆఫ్ చేయడమే మంచిది

ఒక్క మాట – రామారావు సస్పెండెడ్

రేటింగ్ – 2.25 / 5

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి