iDreamPost

Ante Sundariniki Review: అంటే సుందరానికి రివ్యూ

Ante Sundariniki Review: అంటే సుందరానికి రివ్యూ

న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటేనే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయొచ్చన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అప్పుడప్పుడు వి లాంటి వయొలెంట్ మూవీస్ తన మార్కెట్ ని కొంత దెబ్బ తీసినా ఇప్పుడున్న మిడిల్ రేంజ్ స్టార్లలో తన స్థానం పదిలంగా ఉంది. అంటే సుందరానికి ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో దాని మీద ఒకరకమైన సాఫ్ట్ కార్నర్ ఏర్పడిపోయింది. దానికి తోడు ప్రమోషన్లు ట్రైలర్ విషయంలో మైత్రి సంస్థ తీసుకున్న శ్రద్ధ, దర్శకుడు వివేక్ ఆత్రేయ ట్రాక్ రికార్డు వెరసి ఇవాళ డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చేందుకు దోహదపడ్డాయి. మరి అంటే అంటే అంటూ ఆసక్తి రేపిన సుందరం ఫైనల్ గా మెప్పించాడో లేదో రివ్యూలో చూద్దాం

కథ

సుందరం(నాని)ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే సద్భ్రాహ్మణ కుటుంబానికి చెందిన పెళ్లి కాని యువకుడు. లీలా(నజ్రియా) ఫోటోగ్రఫీలో గొప్ప పేరు పేరు తెచ్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్న క్రిస్టియన్ ఫ్యామిలీ అమ్మాయి. ఈ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. కొన్ని సందర్భాల తర్వాత ప్రేమలో పడతారు. అనూహ్యమైన కారణాలతో అమెరికా వెళ్తారు. తిరిగి వచ్చాక తల్లితండ్రులకు ఒక షాక్ లాంటి వార్త చెబుతారు. దీంతో ఈ జంటకు పెళ్లి చేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ఇదంతా అనుకున్నంత సాఫీగా జరగదు.ఊహించని మలుపులతో ఇరువైపులా సమస్యలు వచ్చి పడతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెరమీదే చూడాలి

నటీనటులు

నాని కొంత గ్యాప్ తర్వాత తనకు పర్ఫెక్ట్ గా సూటయ్యే పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. బాడీ లాంగ్వేజ్, మ్యానరిజంస్ ని దర్శకుడు కోరుకున్నట్టుగా పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. కామెడీ టైమింగ్ లో మరోసారి తన బలమేంటో చాటాడు. ఎక్కడా వంక పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. రాజారాణి తర్వాత ఇంత గ్యాప్ తర్వాత తెరమీద కనిపించిన నజ్రియాను సౌత్ స్క్రీన్ ఎంతగా మిస్ అవుతుందో ఇందులో చూడొచ్చు. హోమ్లీగా ఎక్కడ గ్లామర్ కోణంలో తనను చూసే ప్రశ్న ఉత్పన్నం కాకుండా మెప్పించిన తీరు మరిన్ని అవకాశాలు తీసుకురావడం ఖాయం. ఎలా ఆలోచించారో కానీ నాని నజ్రియాల జోడి తెరమీద అందంగా పండింది.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ కాకపోయినా ఇంత చిన్న పాత్రకు ఒప్పుకోవడం మెచ్చుకోదగిందే. నరేష్ హీరో తండ్రి పాత్రలో మరోసారి చెలరేగిపోయారు. ఆయనకు భార్యగా రోహిణిది అలవాటైన క్యారెక్టరే. హర్షవర్ధన్ ఉన్నది కొన్ని సీన్లే అయినా అన్నీ నవ్వులు పూయించినవే. నదియా స్వంతగా డబ్బింగ్ చెప్పుకున్నారేమో కొంత ఇంపాక్ట్ తగ్గింది. తమిళ నటుడు అళగన్ పెరుమాళ్ క్రిస్టియన్ ఫాదర్ గా సరిగ్గా సరిపోయారు. శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ అలా కనిపించి ఇలా వెళ్ళిపోయినా ముద్ర వేయగలిగారు. అరుణ భిక్షు, తన్వీ రామ్, విన్నీ, హారిక, నోమినా తదితరుల గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమి లేదు.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు వివేక్ ఆత్రేయలో మంచి సెన్సిబుల్ థాట్స్ ఉన్నాయి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురాలో ఇవి నచ్చాయి కాబట్టే ఆడియన్స్ వాటిని హిట్ చేసి పెట్టారు. అంటే సుందరం కూడా అదే కోవలోకే వస్తుంది. హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి మధ్య ప్రేమను ఆధారంగా చేసుకుని గతంలో సినిమాలు వచ్చాయి. సీతాకోకచిలుక, ప్రేమ లాంటివి మంచి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కానీ వాటిలో ఒక స్టేజి దాటాక సీరియస్ యాంగిల్ ఉంటుంది. ఎంటర్ టైన్మెంట్ తగ్గించేసి ఇష్యూ మీదే ఫోకస్ పెట్టారు. అంటే సుందరం ఆ కోవలోకి రాదు. మొదటి నుంచి చివరి దాకా వినోదాన్ని పంచుతూ చిన్న మెసేజ్ ఇవ్వాలనే తాపత్రయం కనిపించింది.

ఇలాంటి ప్లాట్స్ లో పెద్దగా మలుపులు ఉండవు కాబట్టి వీలైనంత నిడివి సింపుల్ గా ఉండేలా చూసుకోవాలి. అంటే సుందరం మూడు గంటలకు దగ్గరగా వెళ్లడం దీనికున్న ప్రధానమైన మైనస్. ఈజీగా అరగంట కోత వేసుకుని కథనాన్ని పరిగెత్తించి ఉంటే బోర్ కొట్టేందుకు అవకాశం ఉండేది కాదు. సీన్లు ఎంత ఫ్రెష్ గా ఉన్నా, స్క్రీన్ ప్లే ఎంత డిఫరెంట్ గా అనిపించినా లైన్ చిన్నదైనప్పుడు లెన్త్ కూడా దానికి తగ్గట్టే సెట్ చేసుకోవాలి. అంతే తప్ప నవ్వించడానికి స్కోప్ ఉంది కదాని అవసరానికి మించిన సన్నివేశాలను జొప్పించుకుంటూ వెళ్తే అసలు కంటెంట్ లోని మెయిన్ ఎలిమెంట్ సైతం డైవర్ట్ అయిపోయి ఎందుకిదంతా అనిపించే రిస్క్ ఉంటుంది.

ముఖ్యంగా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్స్ కోసం ఏకంగా నలభై అయిదు నిమిషాల దాకా టైం ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. చిన్నప్పటి సుందరం, లైలా పాత్రల తీరు తెన్నెలు, వాటి ఎమోషన్లు ప్రాపర్ గా చూపించాక అక్కడితో వదిలేయొచ్చు. ఇంకాస్త బలంగా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో ఎపిసోడ్లను పేర్చుకుంటూ పోవడంతో అసలు స్టోరీలో ఎంటర్ కావడానికి సమయం ఎక్కువ అవసరమయ్యింది. ప్రాధాన్యం తక్కువ ఉన్న ఇంకో పాత్రకు హీరోతో ఫ్లాష్ బ్యాక్ చెప్పించడమనేది గీతగోవిందంకు ముందు ఆ తర్వాత చాలాసార్లు చూశాం. అయితే ఇందులో నాని పదేపదే తన బాస్ కి కొలీగ్ కి మళ్ళీ మళ్ళీ చెప్పడం రిపీట్ గా అనిపిస్తుంది.

సమాజం ఎంతగా అభివృద్ధి చెందినా మతాంతర వివాహాలకు సంబంధించిన ఆలోచనల్లో మనం వెనుకబడే ఉన్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. వివేక్ ఆత్రేయ దీన్ని కామెడీ కోటింగ్ తో చెప్పాలనుకోవడం బాగుంది. నిడివిని భరించగలిగితే సుందరం ఓ మోస్తరుగా నచ్చేస్తాడు. కానీ పూర్తిగా కాకపోవచ్చు. ఎప్పుడో భలే భలే మగాడివోయ్ తర్వాత అంత హాస్యం ఉన్న సినిమా నానికి పడలేదు. ఈ అంటే సుందరంలో ఆ ఛాన్స్ దొరికింది. తనవరకు ఆడేసుకున్నాడు. ఫ్యాన్స్ తో చప్పట్లు కొట్టించుకున్నాడు. కాకపోతే సమస్య మూలాల్లోకి ఎక్కువగా వెళ్లకుండా పైపై కోటింగ్ తో మేనేజ్ చేద్దామనుకున్నప్పుడు కామెడీ డోస్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండాల్సింది.

మొత్తానికి ఇప్పటి జెనెరేషన్ కి ఎలాంటి థియేటర్ కంటెంట్ కావాలో వివేక్ ఆత్రేయ లాంటి దర్శకులు సరిగానే గుర్తిస్తున్నారు. యాక్షన్ బొమ్మలు, విజువల్ గ్రాండియర్లు రాజ్యమేలుతున్న ట్రెండ్ లో చూడగలిగే ఎంటర్ టైనర్స్ తీయడం కష్టం. అసలే ఓటిటి కాలంలో జనాలు ఫార్వార్డ్ ఆప్షన్ కు బాగా అలవాటు పడ్డారు. సినిమా హాల్లో ఆ వెసులుబాటు ఉండదు కాబట్టి వీలైనంత ఆ ఆలోచన రాకుండా చేయగలిగితేనే బొమ్మ సూపర్ హిట్ అనిపించుకుంటుంది. ఏ మాత్రం తడబాటు పడినా ఓ మెట్టు దిగి యావరేజ్ దగ్గర ఆగిపోతుంది. మరి అంటే సుందరానికి ఎలాంటి తీర్పు ఇస్తారనేది పైన చెప్పిన మైనస్ ని పబ్లిక్ అంగీకరించడం మీద ఆధారపడి ఉంది

వివేక్ సాగర్ పనితనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో బాగుంది. ఇలాంటి వాటికి క్యాచీ నెంబర్లు, మంచి పాటలు ఇస్తే ఆ ఆల్బమ్ కలెక్షన్లకు మరింత దోహదపడేది.ఈ విషయంలో ఇతను వీక్ గానే ఉన్నాడు. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం అందంగా కుదిరింది. రవితేజ గిరజాల ఎడిటింగ్ వైపే కంప్లయింట్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. దర్శకుడి సూచన మేరకే రాజీ పడ్డాడా లేక ఇంకేదైనా కారణం ఉందేమో తెలియదు. సంభాషణలు బాగా కుదిరాయి. వీటిలో వివేక్ మార్క్ కనిపించింది. సహజంగా భారీ బడ్జెట్ లతో దూసుకుపోయే మైత్రి నిర్మాతలు అంటే సుందరానికి డిమాండ్ చేయలేదు కాబట్టి దానికి తగ్గట్టు ఎంతకావాలో అంత ఖర్చు పెట్టారు

ప్లస్ గా అనిపించేవి

నాని నజ్రియా
క్యాస్టింగ్
సెన్సిబుల్ కామెడీ

మైనస్ గా తోచేవి

ఎక్కువైన నిడివి
పాటలు
ఫస్ట్ హాఫ్ తొలి సగం

కంక్లూజన్

ప్రేక్షకులుగా మనం నాని సినిమాకు కొన్ని కొలతలు వేసుకుని ఇలా ఉంటే చాలని వెళతాం. దానికి తగ్గట్టే సుందరం చెప్పుకోదగ్గ సుందరంగానే ఉన్నాడు. కాకపోతే మరీ హిలేరియస్ కామెడీ ని ఎక్స్ పెక్ట్ చేసి ఎలాంటి బోర్ ఉండకూడదని ఆశిస్తే మాత్రం కొంత ప్రిపేరై వెళ్తే మంచిది. అయితే రొటీన్ కథా కథనాలతో విసిగించే కమర్షియల్ మసాలాలు, స్పోర్ట్స్ డ్రామాలు, ఒకే ఫార్ములాతో ఉంటున్న బయోపిక్కుల కంటే సుందరం కొంత బెటర్ అనిపిస్తాడు. కాకపోతే కాఫీలో చక్కర కన్నా ఎక్కువ డికాషన్ ఉంటే అది అందరికీ నచ్చకపోవచ్చు. ముఖ్యంగా షుగర్ లవర్స్ కు. అలా అని తాగడం మానేయరు. జిహ్వ సంతృప్తి ముఖ్యమనుకునే వాళ్ళు తప్ప

ఒక్క మాటలో – పర్లేదు సుందరం

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి