iDreamPost

Macherla Niyojakavargam మాచర్ల నియోజకవర్గం రివ్యూ

Macherla Niyojakavargam మాచర్ల నియోజకవర్గం రివ్యూ

ఒక హిట్ వస్తే రెండు మూడు ఫ్లాపులు వరసగా పలకరించడం అలవాటైపోయిన నితిన్ కు భీష్మ తర్వాత అదే జరిగింది. చెక్, రంగ్ దే థియేటర్లో ఆడకపోగా మాస్ట్రో డైరెక్ట్ ఓటిటి రిలీజు పుణ్యమాని గట్టెక్కింది. అయితే మాచర్ల నియోజకవర్గం ప్రకటించినప్పటి నుంచి నితిన్ కు దీని మీద చాలా నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఎడిటర్ గా మంచి అనుభవమున్న ఎంఎస్ రాజశేఖర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్. బింబిసార, సీతారామంల సక్సెస్ లతో మంచి ఊపుమీదున్న బాక్సాఫీస్ కు ఆ ఉత్సాహం కొనసాగించేలా ఈ బొమ్మ ఉందా లేక ఏదైనా తేడా వచ్చిందా రివ్యూలో చూసేద్దాం పదండి

కథ

వైజాగ్ లో ఉండే సిద్దార్థ్ రెడ్డి అలియాస్ సిద్దు(నితిన్)చలాకి కుర్రాడు. పక్కింట్లో దిగిన స్వాతి(కృతి శెట్టి)ని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. అయితే ఆ అమ్మయి వెనుక ఓ ప్రమాదం ఉందని తెలుసుకుని ఆమెకు అండగా నిలబడేందుకు రాజప్ప(సముతిరఖని)తో తలపడతాడు. అతనుండే మాచర్లకే సిద్దుకి కలెక్టర్ గా పోస్టింగ్ వస్తుంది. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యే అవుతున్న రాజప్పకు చెక్ పెట్టేందుకు స్వాతి తాతయ్య రాఘవయ్య(శుభలేఖ సుధాకర్)ను రంగంలోకి దింపుతాడు సిద్దు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య గవర్నమెంట్ వర్సెస్ పొలిటికల్ వార్ మొదలవుతుంది. చివరికి ఎవరు గెలుస్తారో మీకు తెలిసిందే

నటీనటులు

నితిన్ లో మంచి ఎనర్జీ ఉంది. అది కొన్ని తరహా సబ్జెక్టులకే ఫిట్ అవుతుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళవుతుంది కదా మనమే పాత్ర చేసినా చెల్లుతుందనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదని మాచర్ల మరోసారి ఋజువు చేసింది. లుక్స్ పరంగా నితిన్ అందంగా స్టయిలిష్ గా హుషారుగా ఉన్నాడు. అయితే తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ కానీ ఓవర్ ది బోర్డ్ హీరోయిజంని ఇందులో ఎక్కువ మోతాదులో దట్టించడంతో వ్యవహారం తేడా కొట్టేసింది. కొన్ని సన్నివేశాల్లో నితిన్ తేలిపోయాడు. హై ఎలివేషన్ డైలాగులు చెప్పడానికి పడిన ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంది. ఇకనైనా కూల్ జానర్ వైపు షిఫ్ట్ అయిపోవడం నితిన్ ఫ్యూచర్ కి మంచిది.

వారియర్ లాగే ఇందులోనూ కృతి శెట్టిది మొక్కుబడి పాత్రే అయ్యింది. కేవలం పాటలకే పనికొచ్చింది. ఫస్ట్ హాఫ్ లో కొంత స్పేస్ ఇచ్చారు కానీ అది పరమ రొటీన్ ఫార్మాట్ లో సాగడంతో ఇది ఏ రకంగానూ ప్లస్ కాదు. సముతిరఖని ఇంకో రెండు మూడు ఇలాంటి వేషాలు వేస్తే ప్రకాష్ రాజ్ ని మించిన మొనాటనీ అవ్వడం ఖాయం. వెన్నెల కిషోర్ మాత్రం తన టైమింగ్ తో కాస్త నవ్వించాడు. కాకపోతే ఆ పాత్రకు రాసిన ఈగో ట్రాక్ మరీ పేలవంగా ఉండటంతో కాసేపయ్యాక వెగటు పుడుతుంది. బుగ్గలు బూరెలా ఉబ్బిపోయిన కాథరిన్ త్రెస్సాకు దక్కిన గెస్ట్ రోల్ చేసే మేలేమి లేదు. యాంకర్ శ్యామల, మురళీశర్మ, ఇంద్రజ, రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ ఇలా క్యాస్టింగ్ చాలానే ఉంది కానీ అందరివీ గతంలో ఎన్నోసార్లు చూసిన పాత్రలే.



డైరెక్టర్ అండ్ టీమ్

మాస్ సినిమాలు ఎప్పటికీ అవుట్ డేటెడ్ కాదు. వాటికి లైఫ్ ఉంటేనే థియేటర్లు బ్రతుకుతాయి. లేదూ వాటిని పక్కనపెడతాం అంటే ఏం జరుగుతుందో బాలీవుడ్ లో నెలకొన్న దారుణ పరిస్థితులే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంత మాత్రాన ఆ భాగం ఆడియెన్స్ ని తక్కువ అంచనా వేస్తే మాత్రం ఎలాంటి ఫలితాలు దక్కుతాయో గత నెల రోజుల్లో రామారావు ఆన్ డ్యూటీ, ది వారియర్ లాంటి ఫెయిల్యూర్లు రుజువు చేశాయి. ఎంత కమర్షియల్ మూవీ అయినప్పటికీ దేన్నీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. రాజమౌళి అంతటి గొప్ప దర్శకుడు విక్రమార్కుడు లాంటి రొటీన్ కథతోనూ బ్లాక్ బస్టర్ ఎలా సాధించారో అర్థం చేసుకుంటే మాస్ పల్స్ ఏంటో ఒంటబట్టుతుంది.

సిద్దు అనే మన హీరో గారు ఐఎఎస్ కి రెడీ అవుతుంటారు. కానీ అతని ప్రవర్తన, వ్యక్తిత్వంలో కనీసం దాని ఛాయలు కూడా కనిపించవు. ఇడియట్ లో రవితేజలా హీరోయిన్ ని టీజ్ చేస్తాడు. ఆకతాయిలను తన్నేసి పొట్టిబట్టలు వేసుకున్న గర్ల్ ఫ్రెండ్ తో బీచ్ లో డాన్సులు చేస్తాడు. పక్కింటి మిడిల్ ఏజ్ ఫ్రెండ్ కి మ్యారేజ్ యానివర్సరీ జరిపించి శోభనంలో శక్తి కోసం కిల్లి కట్టించుకు వస్తాడు. రోడ్డు మీద రౌడీ గ్యాంగ్ ఓ ముసలాడి పళ్లబండిని గుద్దేస్తే వాళ్లకు బుద్దిచెప్పేసి లెజెండ్ బాలకృష్ణ టైపు లో హీరోయిన్ ముందు బిల్డప్ ఇస్తాడు. కలెక్టర్ పోస్టింగ్ వచ్చిందని నాన్న ఫోన్ లో చెప్పగానే అప్పటికప్పుడు టకాటకా ఇన్ షర్ట్ వేసుకుని విలన్ కో వార్నింగ్ ఇస్తాడు.

దీన్నే మాస్ అనుకోమన్నాడు దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పటిదాకా చెప్పింది ఫస్ట్ హాఫ్ లో ఆణిముత్యాల గురించే. సెకండ్ హాఫ్ లో హీరోగారు కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నాక అక్కడి పోలీసుల దగ్గరనుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా అందరూ ఈయన చెప్పినట్టే వింటారు. పోనీ ఆ స్థాయిలో గొప్ప పనులేమైనా చేశాడా అంటే ఏం లేదు ఎన్నికలు జరిపిస్తానని రాజప్పను బెదిరించడం, ఓ పెద్దాయనతో నామినేషన్ వేయించడం తప్ప. నిజానికి మాచర్ల నియోజకర్గం మెయిన్ పాయింట్ లో వెయిట్ ఉంది. కానీ దర్శకుడు కం రచయిత రాజశేఖర్ నిర్లక్ష్యం వల్ల అన్నీ పైపై పూత సన్నివేశాలతో మేనేజ్ చేయాలనుకోవడం తీవ్రంగా దెబ్బ కొట్టింది.

రెండున్నర గంటల సినిమాను చూస్తున్నంత సేపు అన్నీ గతంలో చూసినట్టే అనిపిస్తాయి. బోయపాటి శీను ప్రభావం ఈ డైరెక్టర్ మీద బలంగా ఉంది. కానీ తన చేతిలో ఉన్నది బాలయ్య లాంటి బ్రహ్మాస్త్రం కాదు నితిన్ అనే చిన్న బాణమని గుర్తించలేకపోయాడు. కథా విస్తరణే సిల్లీగా ఉంది. మాములుగా హీరో బలంగా ఉండి విలన్ వీక్ గా ఉంటే పోన్లే అని క్షమించవచ్చు. అది రివర్స్ లో జరిగితే కామెడీ అయిపోతుంది. మచ్చుకు ఓ ఎగ్జామ్ ఫుల్ తీసుకుంటే నితిన్ ఎంఆర్ఓ ఆఫీస్ లో సముతిరఖని ని సవాల్ చేసే సీన్ అచ్చం ఇదే ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక క్లైమాక్స్ కు ముందు వచ్చే ట్విస్టు, దాన్ని ముగింపు దాకా తీసుకెళ్లిన తీరు అప్పటికే కోల్పోయిన సహనాన్ని తిరిగి నిలబెట్టలేక ఉస్సూరుమంది.

హీరో ఇమేజ్ ప్లస్ బలహీనతలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటే ఇలాంటి ఫలితాలు రావు. సరైనోడు అల్లు అర్జున్ చేశాడు కాబట్టి బ్రతికిపోయింది. అదే దర్శకుడు అదే స్టైల్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ని చూపించబోతే జనం నో అన్నారు. బాలకృష్ణ చిరంజీవి ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తే ఒప్పుకున్నారు కానీ డాక్టర్ రాజశేఖర్ చేస్తే వద్దు బాబోయ్ అనేశారు. ఇలాంటి క్యాలికులేషన్లు మాస్ చిత్రాలకు చాలా అవసరం. నితిన్ తనను తాను ఎక్కువ ఊహించుకున్నాడో లేక ఇప్పటికే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి కాబట్టి ఇకనైనా తనకో పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని దర్శకుడు తాపత్రయపడ్డాడో ఎంత ఆలోచించుకున్నా అర్థం కాదు.

కాలం ఎంత మారినా ఓటిటిలు ఎంత ప్రభావం చూపిస్తున్న థియేటర్ కు వచ్చేందుకు ప్రేక్షకులు సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే పాత వంటలైనా సరే రుచిగా వడ్డించమంటున్నారు. ఇలా ఫ్రిడ్జ్ లో నెలల తరబడి దాచిన కూరలు అన్నాలు ప్లేట్ లో పెడితే విసిరి కొట్టడం కాదు మళ్ళీ మీ హోటల్ కొస్తే ఒట్టని శపధాలు చేస్తున్నారు. అలాంటప్పుడు రచయితలు చాలా జాగ్రత్తగా కథా కథనాలు రాసుకోవాలి. ఇంటర్వెల్ కార్డుకే మాచర్ల స్క్రిప్ట్ ని ఒక్కరోజులో రాశారేమో అన్న అనుమానం కలిగితే అది ప్రేక్షకుడి తప్పు కాదు. కథలో భాగంగా ఎలివేషన్లు వస్తే ఓకే కానీ వాటిను ముందు సెట్ చేసుకుని తర్వాత స్టోరీ గురించి ఆలోచించినట్టు వుంది ఈ మాచర్ల వ్యవహారం.

ఎన్నో సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించి వాటి తాలూకు తప్పొప్పులను దగ్గరి నుంచి చూసిన రాజశేఖర్ రెడ్డి ఇలాంటి పేలవమైన అవుట్ ఫుట్ తో రావడం విచారకరం. ఆయన స్వంత ఆలోచనో లేక ఎవరైనా చెబితే ఎగ్జైట్ అయిపోయి వేగంగా తీయాలనే ఉబలాటమో తెలియదు కానీ ఒక నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఏళ్లతరబడి ఒకే వ్యక్తి ఎన్నిక్కవ్వడం మంచి పాయింటే. కానీ దాన్ని ఇంత పెద్ద కాన్వాస్ తో తెరకెక్కించాలనుకున్నప్పుడు పేపర్ మీద కూడా కత్తెర వాడి ఉంటే బాగుండేది. అతుకులబొంతలకు ఇంతేసి టికెట్ రేట్లతో భరించే రోజులు పోయాయి. ఇచ్చే డబ్బులకు కనీసం సగం న్యాయమైనా జరక్కపోతే సాయంత్రానికే సీట్లు ఖాళీ ఉంటున్నాయి.

సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ ఓ రెండు పాటలతో మెప్పించినా ఓవరాల్ గా చూసుకుంటే మణిశర్మ వారసత్వాన్ని మోయాల్సిన స్థాయిలో పనితనం చూపించలేకపోతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఓకే అనిపిస్తే చాలా సార్లు సౌండ్ ఎక్కువైపోయి చెవులకు పొల్యూషన్ అనిపిస్తుంది. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో ఉంది. తనకిచ్చిన పనిని నీట్ గా చేసుకుంటూ పోయారు. కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ సాటి స్నేహితుడి కోసం మొహమాటపడింది కాబోలు ల్యాగ్ తప్పించుకోలేకపోయింది. మామిదాల తిరుపతి సంభాషణలు సోసోగా ఉన్నాయి. నితిన్ హోమ్ బ్యానర్ కావడంతో బడ్జెట్ గట్టిగానే ఖర్చు పెట్టారు

ప్లస్ గా అనిపించేవి

కొన్ని యాక్షన్ బ్లాక్స్ ‘
ఐటెం సాంగ్

మైనస్ గా తోచేవి

రొటీన్ కథా కథనాలు
నితిన్ కు సూట్ కాని పాత్ర
కామెడీ
ఓవర్ ఎలివేషన్లు

కంక్లూజన్

దుర్యోధనుడి వేషం స్వర్గీయ ఎన్టీఆర్ వేస్తేనే ఆ గాంభీర్యం పండుతుంది. అదే పాత్రలో శోభన్ బాబుని ఊహించుకోలేం. ఎవరికి తగ్గట్టు వాళ్లకు టైలర్ మేడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏదో మాస్ కలెక్టర్ అనగానే కథ పూర్తిగా వినకుండా ఊగిపోయి నితిన్ చేసిన ఈ మాచర్ల నియోజకవర్గం అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ కే యావరేజ్ అనిపించే అవకాశం ఉన్నప్పుడు ఇక కామన్ ఆడియెన్స్ గురించి వేరే చెప్పాలా. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితమైతే వర్కౌట్ అయ్యే కథను తీసుకొచ్చి ఇంత స్థాయిలో ఖర్చు పెట్టించేందుకు ఒప్పించిన దర్శకుడి నైపుణ్యం అసలైన స్టోరీ స్క్రీన్ ప్లే మీద ఉండి ఉంటే నితిన్ కో మంచి హిట్ దక్కేది. ఇలా ఎలక్షన్స్ లో డిపాజిట్ కోల్పోయే అవమానం తప్పేది

ఒక్క మాటలో – డిపాజిట్ గల్లంతు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి