iDreamPost

‘Liger’ movie review లైగర్ రివ్యూ

‘Liger’ movie review లైగర్ రివ్యూ

అర్జున్ రెడ్డితో అనూహ్యమైన బ్లాక్ బస్టర్, గీత గోవిందం ఇండస్ట్రీ హిట్ తో యూత్ లో అశేషమైన ఫాలోయింగ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండకు ఎన్ని ఫ్లాపులు వస్తున్నా ఏదో పెద్ద బ్రేక్ వస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. బయట చూపించే యాటిట్యూడ్ మీద కామెంట్స్ ఉన్నప్పటికీ తన తీరే ఇంత అనేలా ప్రవర్తించే రౌడీ హీరో మొదటి సారి ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రొజెక్ట్ అయిన సినిమా లైగర్. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ధర్మా బ్యానర్ ఇందులో భాగంగా కావడంతో ఢిల్లీ నుంచి చెన్నై దాకా ప్రమోషన్లను ఓ రేంజ్ లో చేశారు. మాస్ ని టార్గెట్ చేసుకున్న ఈ క్రాస్ బ్రీడ్ సాలా బాక్సింగ్ రింగ్ లో గెలిచాడా లేదా రివ్యూలో చూసేద్దాం పదండి.

కథ

నత్తితో బాధపడే కొడుకు లైగర్(విజయ్ దేవరకొండ)ని ఇంటర్నేషనల్ మార్షన్ ఆర్ట్స్ ఛాంపియన్ చేయాలని కరీంనగర్ నుంచి ముంబైకి తీసుకొస్తుంది తల్లి బాలమణి(రమ్యకృష్ణ). ఓ కోచ్ (రోనిత్ రాయ్)దగ్గర పట్టుబట్టి చేర్పించేస్తుంది. శిక్షణ తీసుకుంటున్న క్రమంలో లైగర్ బాగా డబ్బున్న తాన్యా(అనన్య పాండే)ప్రేమలో పడతాడు. ఇతగాడి లోపం తెలిశాక ఆ అమ్మాయి బ్రేకప్ చెబుతుంది. దీంతో జ్ఞాన నేత్రాలు తెరుచుకున్న లైగర్ అంతర్జాతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ ని గెలవాలని సంకల్పం పెట్టుకుంటాడు. అక్కడి నుంచి ప్రయాణం అమెరికా చేరుకుంటుంది. చివరికి అమ్మ కోరిక నెరవేర్చి తన ప్రేమను ఏం చేశాడన్నది తెరమీద చూడాలి

నటీనటులు

ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో యువతకు త్వరగా కనెక్ట్ అయిపోయి ఈ స్థాయికి చేరుకున్న విజయ్ దేవరకొండ పలు ఇంటర్వ్యూలలో చెప్పినట్టు నిజంగానే చాలా కష్టపడ్డాడు. ఆ శ్రమ తాలూకు ఫలితం ఫైట్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈజీగా రామ్ కామ్ ఎంటర్ టైనర్లు చేసుకునే సౌలభ్యం ఉన్నప్పటికీ బాడీని రిస్క్ చేసి మరీ ఇలాంటి ఎఫర్ట్ పెట్టడం మాములు విషయం కాదు. స్టోరీ విన్నప్పుడు ఎగ్జైటింగ్ గా అనిపించడం వల్ల ఒప్పుకుని ఉండొచ్చు కాబట్టి రిజల్ట్ ని బట్టి తనను నిందించడానికి లేదు. కానీ తన ఒంటికి అంతగా సరిపడని డాన్సులు చేసే ప్రయత్నం మాత్రం పెద్దగా సింక్ అవ్వలేదు. అది మినహాయిస్తే బాబు బాగా చేశాడు.

అనన్య పాండేకు కనీసం స్క్రీన్ టెస్ట్ అయినా చేశారో లేదో అనే అనుమానం వస్తుంది సినిమా చూశాక. క్యారెక్టరైజేషన్ మరీ దారుణంగా ఉండటంతో పాటు అమ్మడి నటన కూడా అంతే అథమంగా సాగడంతో పూరి బ్యాడ్ హీరోయిన్స్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. రమ్యకృష్ణ అక్కడక్కడా కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించినా ఆ పాత్రకు అది అవసరం కాబట్టి ఇంకెవరూ అంతకన్నా బెటర్ గా చేయలేరన్నది వాస్తవం. రోనిత్ రాయ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ మొక్కుబడిగా మిగిలాడు. సైడ్ విలన్ సంజుగా చేసిన విషు సోసోనే. మైక్ టైసన్ కి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంత సిల్లీగా వాడుకున్నందుకు నిజంగానే బాక్సింగ్ చేసి చంపేసేవారు

డైరెక్టర్ అండ్ టీమ్

గురువు రామ్ గోపాల్ వర్మ లాగే ఒకప్పుడు పూరి హీరోయిజంకి కొత్త డెఫినేషన్లు ఇచ్చిన మాట వాస్తవం. ఇడియట్, పోకిరి, బిజినెస్ మెన్ కంటే గొప్ప ఉదాహరణలు అక్కర్లేదు. ఆ గౌరవంతోనే కేవలం ఈయన పేరు మీదే టికెట్లు కొనేవాళ్ళున్నారు. అలా అని చెప్పి మనం ఏది బడితే అది తీసి ఇదే సినిమా అనుకోమంటే ఫ్యాన్స్ కూడా మెచ్చరు. లైగర్ కున్న అతి పెద్ద సమస్య బ్యాక్ డ్రాప్ లోనే ఉంది. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యాన్ని ఇప్పటికే ఎందరో ఆరగదీశారు. కొత్తగా అందులో ఏం మిగల్లేదు. అంతెందుకు పూరినే తీసిన అమ్మా నాన్న తమిళ అమ్మాయిలోనూ ఇదే బాక్సింగ్ రింక్ ఉంటుంది. ఏదో మిక్స్డ్ అనే ట్యాగ్ తగిలించి కొత్త ఆట అనుకోమన్నారు అంతే.

టేకాఫ్ ని కొంత ఆసక్తిగా మొదలుపెట్టిన పూరి జగన్నాధ్ హీరోయిన్ ఇంట్రోతో మొదలుపెట్టి ఎక్కడికక్కడ ట్రాక్ తప్పుకుంటూ పోయారు. బార్ లో మందు కొడుతూ అప్పటికప్పుడు తట్టిన సీన్లను పేపర్ మీద రాసుకుని తిరిగి క్రాస్ చెక్ చేసుకోకుండా తీసినంత తేలిగ్గా చాలా సన్నివేశాలు తేలిపోయాయి. హీరోయిన్ ని ఎంత బరితెగింపుగా చూపిస్తే మాస్ అంతగా వెర్రెక్కిపోతారనుకున్నారో లేక బయట అమ్మాయిలు అధిక శాతం ఇలాగే ఉన్నారనే భ్రమలో తాన్యాను తీర్చిదిద్దారో తెలియదు కానీ సగటు ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం కంపరం పుట్టేలా డిజైన్ చేసిన తీరు పూరి స్థాయి దర్శకుడికి తగదు. సెకండ్ హాఫ్ లో సిల్లీ జస్టిఫికేషన్ ఇచ్చారు కానీ అదీ పండలేదు.

స్పోర్ట్స్ డ్రామాలు హిందీ నుంచి తెలుగు దాకా పరమ రొటీన్ అయిపోయాయి. లైగర్ లోనూ ఎలాంటి కొత్తదనం ఫీలవ్వం. అందుకే కాబోలు హీరోకు నత్తి, మైక్ టైసన్ లాంటి అదనపు ఆకర్షణలు తీసుకొచ్చారు. కానీ ఎమోషన్ ప్రాపర్ గా కనెక్ట్ చేయనప్పుడు రమ్యకృష్ణ ఎంత గొప్పగా అరిచినా, కొడుక్కి మోటివేషన్ క్లాస్ తీసుకున్నా అదేదో ప్రేక్షకులను తిడుతున్న ఫీలింగ్ కలుగుతుందంటే ముమ్మాటికీ స్క్రీన్ ప్లే లోపమే ప్రధాన కారణం. విజయ్ లాంటి అప్ కమింగ్ స్టార్లు డైరెక్టర్లను గుడ్డిగా నమ్మేస్తారు. అంత అనుభవమున్న పూరి లాంటి వాళ్లకు పూర్తిగా సరెండర్ అయిపోయి తమ బెస్ట్ ఇస్తారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది తీయాల్సింది పూరినే కదా. సో ఈ నిందలు తప్పవు.

లైగర్ లో మరో ప్రధాన సమస్య హై అనిపించే మూమెంట్స్ లేకపోవడం. అంటే సరిగా రాసుకోకపోవడం. లైగర్ చేతిలో డబ్బులు లేక విదేశాలకు ఎలా వెళ్లాలాని సతమతమవుతుంటే ఓ కమెడియన్ ని తీసుకొచ్చి అతని ద్వారా తీసుకెళ్లే ట్విస్ట్ గొప్పగా పేలుతుందని అంచనా వేసుకున్నారు. అది కాస్తా తుస్సుమని పేలింది. ప్రీ క్లైమాక్స్ లో మైక్ టైసన్ ఎపిసోడ్ చూసి థియేటర్ లో జనం ఊగిపోతారని లెక్కలేసుకుని ఉంటారు. అదీ నవ్వులపాలయ్యింది. ఒక ట్రైన్ ఫైట్, ఒక నిర్మానుష ప్రదేశంలో రౌడీలతో ఫైట్ తర్వాత లీడ్ పెయిర్ బ్రేకప్ ఇలాంటివి పోకిరిలో ఉన్నాయి కాబట్టి సక్సెస్ అయ్యాయి కనక వాటినే తిరిగి రిపీట్ చేద్దామనే కిందికి వెళ్ళిపోయాడు పూరి. ఒక స్టేజి దాటాక విజయ్ పాత్రకు పెట్టిన శృతి మించిన నత్థి చిరాకు పుట్టిస్తుంది. నిజంగా ఆ లోపం ఉన్నవాళ్లు కూడా కొట్టేలా.

దాదాపుగా సినిమా మొత్తం హిందీలోనే తీశారు. ఏదో తెలుగు జనాన్ని మభ్యపెట్టడానికి గెటప్ శీను, అలీ లాంటి ఒకరిద్దరిని పెట్టుకున్నారు కానీ అధిక శాతం సీన్స్ లో విజయ్ తో సహా అందరి లిప్ మూమెంట్ ని మాములుగా గమనించినా తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లెక్కన చూస్తే ఇది డబ్బింగ్ మూవీగానే చెప్పుకోవాలి తప్పించి స్ట్రెయిట్ కిందకు రాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు అన్నేసి పాటలు ఎందుకు పెట్టారో అర్థం కాదు. పోనీ ఏ మణిశర్మనో దేవిశ్రీనో అయితే మాస్ కి ఎక్కేలా రెండు మూడు ట్యూన్ లైనా ఇచ్చేవాళ్ళు. ఇదీ నార్త్ వాళ్ళకే ఇచ్చి విపరీతమైన నస పెట్టారు. పాపం భాస్కరభట్ల పాటలు రాయడానికి ఎంత కష్టపడ్డారో

ఇరవై ఏళ్ళ అనుభవం దాటిన పూరి లాంటి దర్శకులు అర్జెంట్ గా అప్ గ్రేడ్ అవ్వాలి. అంటే పబ్బుల్లో, ఫ్లై ఓవర్లపైన, ఫారిన్ లో షూటింగులు చేయడం కాదు. ఎలివేషన్లు ఏవి ఎక్కడ ఎలా పండాలి, హీరోయిజం ఎలా ఎక్స్ ప్లోర్ చేయాలి, ఎమోషన్స్ ని ఎలా రిజిస్టర్ చేయాలనే దాని మీద ఇప్పటి జనరేషన్ మేకర్స్ నుంచి స్ఫూర్తి పొందాలి. అంత అరాచకమున్న కెజిఎఫ్ లో మదర్ సెంటిమెంట్ ని ప్రశాంత్ నీల్ అంత నీట్ గా ఇరికించినప్పుడు ఇదే పాయింట్ మీద ఎంతో పట్టున్న పూరి ఇంకెంత అద్భుతం చేయాలి. కేవలం బ్రాండ్ పేరు మీద మహా అయితే బిజినెస్ చేయొచ్చేమో కానీ పబ్లిక్ ని రెండో రోజుల తర్వాత థియేటర్ కు తీసుకురాలేం. ఇది సత్యం.

బహుశా కరణ్ జోహార్ నిర్మాణంలో అధిక భాగం వహించడం కూడా మితిమీరిన బాలీవుడ్ ఫ్లేవర్ కి కారణం కావొచ్చు. మన ఆర్టిస్టులతోనే రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు హిందీ ఆడియన్స్ ని గొప్పగా మెప్పిస్తుంటే రివర్స్ లో పూరి మనకు ముక్కు మొహం తెలియని రోనిత్ రాయ్, చుంకీ పాండేలాంటోళ్ళను తీసుకొచ్చి ఎందుకు రుద్దుతున్నారో అర్థం కాదు. మార్కెట్ కోసమనే సిల్లీ రీజన్ చెబితే అంతకన్నా ఆత్మహత్యాసదృశ్యం మరొకటి ఉండదు. సెకండ్ హాఫ్ బాక్సింగ్ రింగులో పదే పదే అన్నేసి ఫైట్లు పెడితే ఎగ్జైట్మెంట్ ఎలా కలుగుతుంది. దానికి ముందు వెనుకా జరిగే తతంగం ప్రాపర్ గా ఉన్నప్పుడే కదా మాసోడైనా అందులో కిక్కుని ఫీలవుతాడు.

ముగ్గురు నలుగురుతో కలిసి కొట్టించిన పాటలు చూసేందుకు కొంత పర్వాలేదు అనిపించినా వాటి ప్లేస్ మెంట్, ఆడియో తేడా కొట్టేశాయి. సునీల్ కశ్యప్ నేపధ్య సంగీతం కూడా ఏమంత మేజిక్ చేయలేకపోయింది. విష్ణు శర్మ ఛాయాగ్రహణం వీలైనంత హై స్టాండర్డ్ లోనే సాగింది కానీ పరిమిత లొకేషన్ల వల్ల ఆయన ప్రతిభని మరీ ఎక్కువ ఆవిష్కరించుకునే ఛాన్స్ దక్కలేదు. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ కొంత ల్యాగ్ ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. పూరి కలంలో బలంగా తగ్గిపోయింది. నిర్మాణ విలువల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు కానీ మరీ ఆమ్మో ఇంత బడ్జెట్ పెట్టారా అని కళ్లుచెదిరే స్థాయిలో ప్రొడక్షన్ వాల్యూస్ లేవు కానీ ఖర్చుపెట్టింది ఎక్కువే

ప్లస్ గా అనిపించేవి

విజయ్ దేవరకొండ
కొంతవరకు రమ్యకృష్ణ పాత్ర

మైనస్ గా తోచేవి

హీరోయిన్
జీరో ఎమోషన్
సెకండ్ హాఫ్
సిల్లీ స్క్రీన్ ప్లే

కంక్లూజన్

కాంబినేషన్ల క్రేజ్ మీద సినిమాలు ఆడే రోజులు కావివి. నిఖిల్ లాంటి చోటా హీరోకి హిందీలో బ్లాక్ బస్టర్ దక్కింది. అమీర్ ఖాన్ లాంటి బడా స్టార్ కి పరాభవం మిగిలింది. ఇప్పుడు కంటెంట్ మాత్రమే కింగ్. లైగర్ ఈ లాజిక్ ని పూర్తిగా మిస్ అయ్యింది. స్పోర్ట్ డ్రామాని తీయాలనుకునే ఆలోచన తప్పు కాదు కానీ దాన్ని ఎలాంటి ఉప్పు పప్పు లేని చప్పటి కిచిడిగా చేయడమే థియేటర్ నుంచి బయటికి వస్తున్న జనానికి అసంతృప్తిని మిగిలిస్తుంది. విజయ్ దేవరకొండ తనవంతుగా సెంచరీ కొట్టేంత ఎనర్జీతో గ్రౌండ్ కొచ్చాడు. కానీ చివరి వికెట్ గా బ్యాటింగ్ పొజిషన్ లో ఉన్న పూరి జగన్నాథ్ కావాలని రన్ అవుట్ అయితే తను మాత్రం చేయగలిగింది ఏముంది

ఒక్క మాటలో – బోరర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి