iDreamPost
android-app
ios-app

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించిన ‘బేబీ’ మూవీ రివ్యూ!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించిన ‘బేబీ’ మూవీ రివ్యూ!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా.. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ‘బేబీ’. ఇప్పటికే పాటలతో, ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకులలో అంచనాలు మినిమమ్ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఈరోజు (జులై 14న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్‌ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌కేఎన్‌ నిర్మించిన బజ్ అయితే గట్టిగానే సెట్ చేసుకుంది. మరి ఆ బజ్ తగ్గట్టుగా బేబీ సినిమా సాగిందా లేదా రివ్యూలో చూద్దాం.

కథ:

ఆనంద్‌(ఆనంద్‌ దేవరకొండ), వైష్ణవి(వైష్ణవి చైతన్య) స్కూల్‌ డేస్‌ లోనే ప్రేమలో పడతారు. తెలిసి తెలియని వయసులో ఇద్దరు ఒకరినొకరు డీప్ గా లవ్ చేసుకుంటారు. కట్ చేస్తే.. ఆనంద్ టెన్త్ ఫెయిల్ అవ్వడంతో ఆటో డ్రైవర్ గా మారిపోతాడు. వైష్ణవి ఇంటర్ చదివి.. ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతుంది. దీంతో ఇద్దరి మధ్య దూరం మొదలవుతుంది. కాలేజీలో వైష్ణవికి కొత్త పరిచయాలు.. మోడరన్ లైఫ్ స్టైల్ కి షిఫ్ట్ అవుతుంది. ఇంతలో.. కాలేజీలో అందగాడు విరాజ్ తో వైష్ణవికి పరిచయం.. స్నేహం.. కానీ విరాజ్ దురాలోచనతో లవ్ చేస్తాడు. ఓవైపు ఆనంద్.. మరోవైపు విరాజ్.. ఊహించని విధంగా వైష్ణవి విరాజ్ కి దగ్గరవుతుంది. కానీ.. ఆనంద్ ని మర్చిపోలేకపోతుంది. అక్కడినుండి విరాజ్ – వైష్ణవిల వ్యవహారం ఎలా సాగింది? ఎంతగానో ప్రేమించిన ఆనంద్ పరిస్థితి ఏంటి? ఆఖరికి వైష్ణవి ఎవరిని ప్రేమించింది? అసలు వీరి లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

‘బేబీ’ ట్రైలర్ చూసినప్పుడే ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అని అర్థమైంది. కానీ.. నేటి యువతకు కనెక్ట్ అయ్యే విధంగా అందులో సన్నివేశాలు.. లవ్ ట్రాక్ నడిచేసరికి యూత్ లో.. ప్రేక్షకులలో సినిమాపై మినిమమ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రెజెంట్ టైంలో సొసైటీలో జరుగుతున్న రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాని తెరపైకి తీసుకొచ్చారు. బస్తీలో మొదలైన లవ్ స్టోరీ.. కాలేజీకి వెళ్ళాక మోడరన్ హంగులు దిద్దుకొని.. అక్కడినుండి మూడో వ్యక్తి ఎంట్రీ.. ఇటు చిన్నప్పటి లవ్ లో డిస్టర్బన్స్.. గొడవలు.. ఇలా ప్రతీ పాయింట్ వద్ద యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని బాగా తీర్చిదిద్దారు దర్శకుడు.

కలర్ ఫుల్ లవ్ స్టోరీ కాస్త.. చివరికి వచ్చేసరికి ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎండింగ్ తో ముగించడం బాగుంది. ఈ సినిమా ప్రారంభంలో చెప్పిన లైన్ గుర్తుందా.. ఫస్ట్ లవ్ ఎప్పుడు మనసు పొరల్లో శాశ్వతంగా ఉంటుంది అని చెప్పారు. ఆ లైన్ కి ఈ బేబీ మూవీ కరెక్ట్ గా ఆప్ట్ అయింది. టైటిల్ కూడా సినిమాని జస్టిఫై చేసేలా ఉంది. ఇలాంటి సినిమాలలో మేల్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ.. ఫిమేల్ క్యారెక్టర్స్ హైలైట్ అవుతుంటాయి. అలాగే ఇందులో వైష్ణవి హైలైట్ అయ్యింది. మనకు ట్రైయాంగిల్‌ లవ్ స్టోరీస్‌ కొత్త కాదు. కానీ.. సినిమాని నడిపించిన కథనం కొత్తగా ఉండటం బేబీకి ప్లస్. పడాల్సిన చోట ట్విస్టులు.. ఎమోషన్స్.. డైలాగ్స్.. ఇలా అన్ని స్క్రీన్ ప్లేలో కలిసి వచ్చాయి.

ఇక యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు బేబీలో చాలా ఉన్నాయి. ముందుగా క్యారెక్టర్స్ లో తమను తాము చూసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఫస్ట్ లవ్ లేదా క్రష్ లాంటివి ఉంటాయి. వాటిని ఈ సినిమా గుర్తు చేస్తుంది. యూత్ విజిల్స్ వేసుకునే పాయింట్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్.. అన్ని వాస్తవంగా చూసినట్లు అనిపిస్తాయి. ఇక ఆనంద్ దేవరకొండ.. వైష్ణవిల క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ బాగున్నాయి. ఓ క్యూట్ లవ్ స్టోరీలోకి విరాజ్ మూడో వ్యక్తిగా ఎంటరైన క్షణం నుండి సినిమాలో.. కథలో సంఘర్షణ మొదలవుతుంది. అలాగే నెక్స్ట్ ఏం అవుతుందా అనే ఆసక్తి కూడా కలుగుతుంది. సినిమాకి ఇంటర్వెల్.. మేజర్ హైలైట్.

ఇక సెకండాఫ్ లో డైరెక్టర్ కొంచం తడబడ్డాడు. రెండు ప్రేమ కథలను మెయింటైన్ చేయడంలో ఆ ఆసక్తిని మిస్ అయినట్లు అనిపించింది. క్లైమాక్స్ కి వచ్చేసరికి.. ఆసక్తిగా ఉన్నా అంత సంతృప్తిగా ముగించలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇలాంటి ఎండింగ్స్ ఇదివరకు చూసిన సినిమాలను గుర్తుచేస్తుంది. అయితే.. సినిమాకి మేజర్ గా స్లో నేరేషన్ మైనస్. ఇంటరెస్టింగ్ గా ఉన్నా.. స్లోగా ఉండటం కాస్త డ్రామా ఎక్కువ అయిన ఫీల్ కలిగిస్తుంది. ఎంతసేపు కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్ ఇంకాస్త సాగదీశారు. ఇక సినిమాలో క్యారెక్టర్స్ అన్ని.. అందరు నటులు బాగా చేశారు. వైష్ణవికి ఇది పర్ఫెక్ట్ డెబ్యూ అని చెప్పవచ్చు. సినిమాకి ప్రధాన బలం విజయ్ బుల్గానిన్ మ్యూజిక్. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు స్టోరీకి అనుకూలంగా ఉన్నాయి. దర్శకుడు సాయి రాజేష్.. కథనం ఇంకాస్త షార్ప్ చేసి ఉంటే.. సినిమా ఈ ఏడాదికి కల్ట్ అనిపించుకునేది కావచ్చు.

ప్లస్ లు:

  • స్టోరీ లైన్
  • మెయిన్ క్యారెక్టర్స్
  • మ్యూజిక్
  • కెమెరా వర్క్

మైనస్ లు:

  • క్లైమాక్స్
  • స్లో నేరేషన్

చివరిమాట: బేబీ.. యూత్ ఫుల్ లవ్ స్టోరీ!

రేటింగ్: 3/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)