iDreamPost

Acharya Review ఆచార్య రివ్యూ

Acharya Review ఆచార్య రివ్యూ

సైరా నరసింహారెడ్డి తరువాత మూడేళ్ళ గ్యాప్ తో వచ్చిన మెగాస్టార్ మూవీగా ఆచార్య మీద అభిమానులకు భారీ అంచనాలున్నాయి. అందులోనూ రామ్ చరణ్ ఫుల్ లెన్త్ కాంబినేషన్ కావడంతో అవి ఆకాశాన్ని దాటేశాయి. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్, సోషల్ మీడియాలో పాకుతున్న ప్రీ నెగటివ్ వైబ్రేషన్స్ హైప్ మీద ప్రభావం చూపించినప్పటికీ సినిమా బాగుంటే ఇవన్నీ పక్కకెళ్లిపోతాయనే నమ్మకం జనాల్లో ఉంది. అందులోనూ అసలు పరాజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ కాబట్టి ఇక హిట్టు గ్యారెంటీ అనుకున్నారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత వచ్చిన ఈ భారీ చిత్రం మెప్పించేలా ఉందా లేక నీరసం తెప్పించిందా రివ్యూలో చూసేద్దాం

కథ

అనగనగా ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రం. దానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అక్కడంతా దుర్మార్గుడైన బసవ(సోనూ సూద్)దే రాజ్యం. అడ్డొచ్చిన వాళ్ళను చంపే రకం. అతన్ని నిలువరించేందుకు వస్తాడు ఆచార్య(చిరంజీవి). ఆ ముఠా ఆగడాలను అడ్డుకునే క్రమంలో ఆచార్య వచ్చింది సిద్ద(రామ్ చరణ్)కిచ్చిన మాట కోసమని అక్కడున్న వాళ్లకు తెలుస్తుంది. అసలు నక్సలైటైన ఆచార్య గుడికి ఎందుకు వచ్చాడు, బసవతో ఉన్న శత్రుత్వం ఏంటి, సిద్దాకు పాదఘట్టంతో అనుబంధం ఎలాంటిది, మధ్యలో నీలాంబరి(పూజా హెగ్డే) ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.

నటీనటులు

నూటాయాభై సినిమాల అనుభవమున్న మెగాస్టార్ నటన గురించి కొత్తగా చెప్పేందుకు ఏమి లేదు. ఆచార్యకు ఆయన పర్ఫెక్ట్ ఛాయసే కానీ తన పూర్తి ఎనర్జీని వాడుకునే స్థాయిలో సబ్జెక్టు లేకపోవడం విచారకరం. అయినా కూడా ఉన్నంతలో తన అభిమానులను అలరించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ మొహంలో కళ తగ్గిందా లేక కొరటాల అలా అడిగి చేయించుకున్నాడో తెలియదు కానీ పాత్రపరంగా ఫ్యాన్స్ కి ఆశించిన కిక్ రాలేదు. కానీ అరవై ఆరేళ్ళ వయసులో ఇప్పటికీ డాన్సులు చేయడం గొప్ప విషయమే. లాహే లాహే, భలే బంజారా పాటల్లో నృత్యాలు చూస్తే హాట్స్ అఫ్ అనిపించక మానదు.

రామ్ చరణ్ సిద్దాగా బాగున్నాడు కానీ తండ్రికొచ్చిన సమస్యే స్క్రిప్ట్ వల్ల ఇతనికీ వచ్చింది. ఆర్ఆర్ఆర్ చూసిన కళ్ళతో చరణ్ ని ఇంత సింపుల్ క్యారెక్టర్ లో చూడటం జీర్ణించుకోలేం. కాకపోతే చిరుతో కాంబో సీన్లు కంటికి రిలీఫ్ గా తోస్తాయి. పూజా హెగ్డే నామమాత్రం. సోను సూద్ విలనీ పరమ రొటీన్. జిస్సు సేన్ గుప్తాది అంతకు మించిన రెగ్యులర్ క్యారెక్టర్. తనికెళ్ళ భరణి, అజయ్ లు ఓవర్ ఎక్స్ ప్రెషన్లు లేకుండా సెటిల్డ్ గా కనిపించారు. సత్యదేవ్ ఒక్క సీన్ కే పరిమితం. శత్రుకి వంకర మూతి పెట్టడం అదేం వెరైటీనో దర్శకుడికే తెలియాలి. చిన్న చితక ఆర్టిస్టులు ఇంకా చాలానే ఉన్నారు కానీ ఇంకెవరూ గుర్తుకు రారు.

డైరెక్టర్ అండ్ టీమ్

దశాబ్దాల తరబడి చిరంజీవి సినిమా అంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉండిపోయింది. అందుకే అంచనాలు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. ఈ సూత్రాన్ని దర్శకులు దృష్టిలో పెట్టుకునే తీరాలి. ఏ ఒక్క అంశంలో నిరాశపరిచినా ఫలితం దక్కదు. గొప్ప చారిత్రాత్మక కథ చెప్పాలని సైరా ప్రయత్నిస్తే జనం యావరేజ్ చేశారు. పైసా వసూల్ అనిపించిన మాములు సినిమా ఖైదీ నెంబర్ 150కి వంద కోట్లతో పట్టం కట్టారు. ఇది చెరపలేని ఇంకుతో మెగాస్టార్ అనే ఇమేజ్ రాసిన సూత్రం. దీనికి ఎదురెళ్ళడం ఎవరి వల్ల కాలేదు. కె విశ్వనాథ్, బాలచందర్, భారతీరాజా లాంటి ఉద్దండులే తమవల్ల కాక ఫ్లాపులు తీశారు.

ఇంత బలంగా చిరు అనే స్టార్ డం తెలుగు జనాల మదిలో తిష్ట వేసుకుని ఉంది. అలాంటప్పుడు దర్శకుడు ఎవరైనా సరే పైన చెప్పింది గుర్తుంచుకునే దానికి తగ్గ సబ్జెక్టులు సిద్ధం చేసుకోవాలి. కొరటాల శివ దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆచార్య కథ మొదలుపెట్టారేమో కానీ ముగింపుకొచ్చేసరికి ఇదేదో ఆర్ నారాయణమూర్తి లాంటి పీపుల్స్ స్టార్ తీయాల్సిన సినిమాగా తీసి చూపించారు. పెద్ద గుడి సెట్టేశారు. బాగానే ఉంది. కానీ దాన్ని చూసేందుకు థియేటర్లకు రారుగా. దాని చుట్టూ బలమైన నేపథ్యం, సహజంగా కనెక్ట్ అయ్యే పాత్రలు, మాస్ కి సెట్ అయ్యే కాంఫ్లిక్ట్ అన్నీ బ్యాలన్స్ అయ్యేలా రాసుకోవాలి. ఆచార్యలో అవే లేవు

కొరటాల శివ బలం బలహీనత రెండూ ఒకటే. ఒక సమస్యను తీసుకుని దాన్ని ఊరికో, రాష్ట్రానికో, కుటుంబానికో ముడిపెట్టి కొన్ని కమర్షియల్ అంశాలు జోడించి తీసేయడం. మిర్చి నుంచి భరత్ అనే నేను దాకా ఇది వర్కౌట్ అయ్యింది. ఆచార్యకూ రిపీట్ చేశారు. కాకపోతే ఈసారి గుడిని తీసుకున్నారు. సరే ఇది తప్పు కాదు. ఎన్నిసార్లయినా చేయొచ్చు. కానీ అవి ఎందుకు సక్సెస్ అయ్యాయనేది విశ్లేషించుకుని ఉంటే ఆచార్యలో ఇన్ని తప్పులు జరిగేవి కాదు. మొదలుపెట్టిన క్షణం నుంచి రొటీన్ టెంప్లేట్ లో వెళ్లిన కొరటాల ఎక్కడా కనీస కొత్తదనం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే బోయపాటి స్టైల్ లో ఆలోచించాడు.

పోనీ ఆయనలాగా తీసినా బాగుండేది. కానీ అదీ జరగలేదు. ఆచార్య పాత్ర మొదటిసారి బసవ తాలూకు రౌడీలను చితక్కొట్టినప్పుడు అక్కడ ఎలివేషన్ ఓ రేంజ్ లో పండాలి. కానీ ఏదో టీవీ సీరియల్ లా చప్పగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో ఇంకోసారి వాళ్లకు రౌండ్ వేసినప్పుడు థియేటర్లో విజిల్స్ దద్దరిల్లిపోవాలి. కానీ జనం మొహాలు బ్లాంక్ గా ఉంటాయి. మిర్చిలో ప్రభాస్ తన ఫామిలీని కాపాడే ఎపిసోడ్, భరత్ అనే నేనులో రవిశంకర్ బ్యాచ్ తో థియేటర్ ఫైట్ లాంటివి ఆ సినిమాల్లో వీక్ నెస్ లను బాగా కవర్ చేశాయి. మరి చిరంజీవి రామ్ చరణ్ లు ఇద్దరూ కలిసినప్పుడు ఇంకే స్థాయిలో ఉంటాయోనని ఊహించుకోవడం తప్పు కాదుగా.

బేసిక్ గా కొరటాల శివ టేకింగ్ స్లోగా ఉంటుంది. కాకపోతే పాయిజన్ లాగా మెల్లగా ఎక్కేస్తుంది. కానీ ఆచార్యలో ఈ నెమ్మదితనం మరీ ఎక్కువైపోయి కనీసం మళ్ళీ చెప్పుకునేలా పవర్ ఫుల్ డైలాగులు లేకుండా అంతా మొక్కుబడి వ్యవహారంగా మార్చేశారు. సీన్ కో పదిసార్లు పాదఘట్టం పాదఘట్టం అంటూ ప్రతి పాత్ర జపించడం చిరాకు తెప్పిస్తుంది. ఆ పదాన్ని పేపర్ పై రాసేటప్పుడైనా విసుగొచ్చిందో లేదో. కమర్షియల్ ఎంటర్ టైనర్స్ లో లాజిక్స్ అక్కర్లేదు. కానీ బేసిక్స్ ఉండాలి. అఖండలో అవి ఫాలో అయినందుకు అంత పెద్ద సక్సెస్ దక్కింది. ఆచార్యలో రెండూ మిస్ చేశారు కొరటాల. ఒక స్టేజి అయ్యాక ఆయనే తీశారానే అనుమానం కలుగుతుంది

చిరు చరణ్ లకు కలిసి డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరకడం అదృష్టమే. ఆ తండ్రి కొడుకులే చెప్పుకున్నట్టు మళ్ళీ సాధ్యపడుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. అలాంటప్పుడు చేతికి దొరికిన ఈ బంగారం లాంటి ఆఫర్ ని గుడి కట్టడం మీద, సెట్ల మీద కాకుండా కథా కథనాల మీద పెట్టి ఉంటే ఆచార్య ఎప్పటికీ నిలిచిపోయే బెస్ట్ మల్టీ స్టారర్స్ లో ఒకటిగా నిలిచేది. సినిమా మొత్తం దాదాపు ఒకే సెట్లోనే సాగుతుంధి. మిగిలింది మారేడుమిల్లి అడవుల్లో చుట్టేశారు. ఇంతకు మించి ఖర్చు లేదు. అసలే టికెట్ ధరలు విపరీతంగా ఉన్నాయని జనాలు ఫ్రస్ట్రేట్ అవుతున్న టైంలో కంటెంట్ లో కొంత తేడా ఉన్నా దుమ్మెత్తిపోస్తున్నారు. దానికి ఎవరూ అతీతం కాదు

సంగీత దర్శకుడు మణిశర్మ ఆచార్యకున్న మైనస్సుల్లో మొదటి స్థానం తీసేసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ తీసికట్టుగా ఉంది. ఆయన కుమారుడు మహతి స్వర సాగర్ ఏదో చేయూత నిచ్చారని చెప్పారు కానీ ఫైనల్ అవుట్ ఫుట్ మాత్రం బ్యాడ్ గా వచ్చింది. చూసేందుకు బాగున్నాయి కాబట్టి పాటలు పాసయ్యాయి అంతే. తిరు ఛాయాగ్రహణం చాలా కష్టపడింది. గ్రాండియర్ నెస్ ని తగ్గించకుండా రిచ్ విజువల్స్ ని ప్రెజెంట్ చేసింది. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. ల్యాగ్ ఉంది కానీ ఆ లోపం స్క్రిప్ట్ లోదే. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సెట్ పరంగా భారీగా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ మాత్రం తగినంత క్వాలిటీ లేదు

ప్లస్ గా అనిపించేవి

చిరు అండ్ చరణ్
ఛాయాగ్రహణం
సెట్ వర్క్
బంజారా పాట

మైనస్ గా తోచేవి

రొటీన్ కథాకథనాలు
జీరో ఎమోషన్
నక్సలిజం బ్యాక్ డ్రాప్
ఫస్ట్ హాఫ్

కంక్లూజన్

చిరంజీవి – రామ్ చరణ్ – కొరటాల శివ ఈ మూడు పేర్లు ఆచార్య మీద నమ్మకాన్ని ఎవరెస్ట్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాయి. కాంబినేషన్ మీద ఎంత క్రేజ్ ఉన్నా కంటెంట్ బలంగా ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు సూపర్ హిట్ చేస్తారు. అంతే తప్ప గుడి ఉందనో ఇద్దరు కలిసి నటించారనో సానుభూతి చూపించరు. దురదృష్టవశాత్తు ఆచార్యకు జరిగింది ఇదే. మితిమీరిన అంచనాలు లేకపోయినా కనీసం యావరేజ్ ఉన్నా చాలు నెత్తినబెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న అభిమానుల కనీస అంచనాలు అందుకోలేక ఆచార్య తడబడి జారిపడ్డాడు. అన్ని రీమేక్స్ ఎందుకు చేస్తున్నారని చిరుని విమర్శించడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఆచార్య చూశాక.

ఒక్క లైనులో – అర్థం లేని ఆచార్య పాఠం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి