iDreamPost

సీడెడ్ అంటే ఏంటో తెలుసా.. రాయలసీమకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

  • Published Nov 28, 2023 | 9:52 PMUpdated Nov 28, 2023 | 9:52 PM

ప్రస్తుతం మన రాయలసీమగా పిలుచుకుంటున్న ప్రాంతాన్ని తొమ్మిది దశాబ్దాల క్రితం వరకు సీడెడ్ అనే వారు. మరి ఆ సీడెడ్ అనే పేరు ఎలా వచ్చింది.. దానికి అర్థం ఎంటంటే..

ప్రస్తుతం మన రాయలసీమగా పిలుచుకుంటున్న ప్రాంతాన్ని తొమ్మిది దశాబ్దాల క్రితం వరకు సీడెడ్ అనే వారు. మరి ఆ సీడెడ్ అనే పేరు ఎలా వచ్చింది.. దానికి అర్థం ఎంటంటే..

  • Published Nov 28, 2023 | 9:52 PMUpdated Nov 28, 2023 | 9:52 PM
సీడెడ్ అంటే ఏంటో తెలుసా.. రాయలసీమకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ, ఏపీ, రాయల సీమ ప్రాంతాలను వేర్వేరు పేర్లతో పిలిచేవారు. నైజాం, సీడెడ్, కోస్తా ఇలాంటి పేర్లతో పిలిచేవారు. సామాన్యుల కన్నా కూడా సినిమా బిజినెస్ లో ఈ పేర్లు తరచుగా వినిపించేవి. నిజాం నవాబుల పాలనలో ఉంది కనుక.. తెలంగాణ ప్రాంతాన్ని నైజాం ఏరియా అని పిలిచేవారని అర్థం అవుతోంది. ఇక రాయలసీమను సీడెడ్ ప్రాంతం అనేవారు. మరి ఈ సీడెడ్ అనే పదానికి అర్థం ఏంటి.. అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది.. ఎవరు పెట్టారు వంటి పూర్తి వివరాలు మీ కోసం..

రాయలసీమ ప్రాంతాన్నీ సీడెడ్ అంటారని తెలుసు కదా. ఆ పదానికి బానిసలుగా అప్పజెప్పబడ్డవారు అని అర్థం. ఇక ఇంగ్లీష్ వాళ్ల ప్రకారం అయితే ఒక ప్రాంతంపై అధికారాన్ని మరో ప్రాంతానికి బదిలీ చేయడం. మరి ఇంతకు రాయలసీమ ప్రాంతాన్ని ఎవరు.. ఎవరికి బానిసలుగా అప్పగించారు అనేది తెలియాలంటే మనం విజయనగర సామ్రాజ్యం కాలం నాటికి వెళ్లాలి. అప్పుడే ఈ పరిణామం చోటు చేసుకుంది. శ్రీకష్ణదేవరాయల తర్వాత క్రమేపీ విజయనగర సామ్రాజ్యం క్షీణ దశకు చేరుకుంది. రాయల తర్వాత వచ్చిన పాలకుల్లో సమర్థులు లేకపోవడంతో.. ఆ తర్వాత వచ్చిన రాజులు చంద్రగిరిలాంటి చిన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు.

అప్పటి నుంచి సీడెడ్ గా మారింది..

అలా బ్రిటీష్ హయాం నాటికి రాయలసీమ ప్రాంతం కూడా నిజాం నవాబుల అధిపత్యంలో ఉండేది. అయితే నవాబులు కేవలం హైదరాబాద్ ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. దానిని మాత్రమే తమ ప్రాంతంగా భావించేవారు.. బాగోగులు పట్టించుకునేవారు. పక్కనే ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని తమది అనుకునేవారు కాదట. పైగా ముందు నుంచి ఈ ప్రాంతం నిజాం రాజుల పాలనలో లేదు. 1792లో మూడో మైసూరు యుద్ధం ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంతం నిజాం రాజుకు వచ్చింది. అక్కడి నుంచి 1800 వరకూ రాయలసీమ నిజాం రాజుల పాలనలో ఉండేది.

ఆ తరువాత మరాఠాలు, టిప్పు సుల్తాన్ నుంచి దాడులు ఎదుర్కొన్న అప్పటి రెండో నిజాం రాజు, బ్రిటిష్ సైన్యం సహాయం కోరాడు. అలా అమల్లోకి వచ్చిందే సైన్య సహకార పద్ధతి. బ్రిటీష్‌వారి సాయానికి ప్రతిగా ప్రస్తుత రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి (ఈస్ట్ ఇండియా కంపెనీకి) దత్తత ఇచ్చారు నాటి నిజాం నవాబు.

అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సీడెడ్ అంటున్నారు. ఇక్కడ సీడెడ్ అంటే seeded అనుకునే అవకాశం ఉంది. కానీ ఇది CDED మండలాలు. బ్రిటీష్ పాలకులకు కప్పం కట్టడానికి బదులుగా నవాబు వారికి ఈ ప్రాంతాలను అప్పగించాడు. అంటే బ్రిటీష్ వారికి బానిసలుగా అప్పజెప్పబడ్డ వారని, వదిలి వేయబడ్డవారని అర్థం. అప్పటి నుంచి సుమారు వంద ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని సీడెడ్ అనే పిలిచేవారు. ఆంధ్ర మహా సభల వల్ల ఈ పేరు మారింది. దత్త మండలాలు, సీడెడ్ అనే పేర్లు అవమానకరంగా ఉన్నాయని.. బానిసత్వాన్ని సూచిస్తున్నాయని భావించి.. పేరు మార్చాలని ఆంధ్ర మహాసభల్లో నిర్ణయం తీసుకున్నారు.

అలా రాయలసీమగా మారింది..

తొమ్మిది దశాబ్దాల క్రితం వరకూ ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు లేదు. అంతకుముందు.. ప్రస్తుత ఉన్న అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలను, కర్నాటకలోని బళ్లారి, తుముకూరు, దావణగేరి ప్రాంతాలను దత్త మండలం అని పిలిచేవారు. అయితే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర మహాసభలు నిర్వహించేవారు. ఈ క్రమంలో వీటిల్లో భాగంగా సీడెడ్ జిల్లాల సమావేశాలు 1928 నవంబర్ 17, 18 తేదీల్లో నంద్యాలలో జరిగాయి.

సీడెడ్ లేదా దత్త మండలం అన్న పదం బానిసత్వాన్ని సూచిస్తూ అవమానకరంగా ఉందన్న ఉద్దేశంతో దీన్ని మార్చాలని నాటి సమావేశాల్లో కొందరు ప్రస్తావించారు. నాటి సమావేశాలకు హాజరైన అనంతపురం జిల్లాకు చెందిన చిలుకూరి నారాయణ రావు సీడెడ్ బదులు రాయలసీమ అన్న పేరు వాడాలని ప్రతిపాదన చేశారు. బళ్లారి, అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు ప్రాంతాలను రాయలసీమగా పిలవాలని ఆ సభల్లో తీర్మానించారు. అప్పటి నుంచి ఇది రాయలసీమగా మారింది. కానీ నేటికి కూడా సినిమా బిజినెస్ సర్కిల్స్ లో మాత్రం సీడెడ్ ఏరియా అనే వాడుతున్నారు.

16-17 శతాబ్దాల్లోనే ‘రాయలసీమ’..

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 16-17 శతాబ్దాల్లో రాయలసీమ అనే పదం మొదట వినిపించింది అంటున్నారు చరిత్రకారులు. ’’మట్లి సంస్థానం కాలంలో రాసిన అభిషిక్త రాఘవం అనే గ్రంథంలో రాయలసీమ అనే పదం ఉంది. తెలుగు సాహిత్యంలో రాయలసీమ పదం కనిపించడం అదే ప్రథమం. మట్లి సంస్థానం రాజధాని ప్రస్తుత కడప జిల్లా సిద్ధవటం దగ్గర్లో ఉండేది‘‘ అని పురావస్తు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి