iDreamPost

ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు..?

ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు..?

మరికాసేట్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు రాబోతున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు ఆయన దేశ ప్రజలనుద్ధేశించి మాట్లాడబోతున్నారు. సాధారణ అంశమైతే ప్రధాని ప్రెస్‌మీట్‌లో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ మీడియా ముందుకు ప్రధాని వస్తారని ముందుగానే వెల్లడించారు. ప్రజలు ప్రధాని మాటలు వినాలన్నదే ఇక్కడ లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. మోదీ ఏం మాట్లాడబోతున్నారు..? దేశ ప్రజలకు ఆయన ఏం చెప్పబోతున్నారు..? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ఏ ప్రాంతంలో చూసిన కరోనాపై చర్చ జరుగుతోంది. కరోనా అంశంపై మీడియా వార్తలు, కథనాలు ప్రచారం చేస్తోంది. ప్రత్యేక డిబేట్లు పెడుతోంది. అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రాత పోషిస్తోంది. వచ్చేది వేసవి కాబట్టి మన దాకా ఆ మహమ్మరి రాదనుకున్నారు. కానీ ప్రజల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కరోనా మహమ్మరి దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది.

మరో వైపు పొరుగుదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని ప్రభావం మరింతగా వ్యాపిస్తోంది. నిన్న మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన కరోనా వైరస్‌ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకూ వ్యాపిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనాలో కరోనా నియంత్రణలోకి వచ్చినా.. ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. యూరప్‌ చిగురటాకులా వణికిపోతోంది. సరిహద్దులను మూసేసిందంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

చైనా తర్వాత కరోనా వైరస్‌ వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశం ఇటలీ. అభివృద్ధి చెందిన ఇటలీ దేశం కూడా కరోనాను కంట్రోల్‌ చేయలేకపోతోంది. కేవలం ఆరు కోట్ల జనాభా ఉన్న ఇటలీలో వైద్యసదుపాయాలు లేక కరోనా బాధితులకు వైద్యం అందించలేకపోతున్నారు. వయస్సు ఆధారంగా చికిత్స అందిస్తున్నారన్న వార్తలు వింటున్న దేశ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇటలీ పరిస్థితి ఇలా ఉంటే.. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం పరిస్థితి ఏంటి..? అనే అందోళన ప్రజల్లో నెలకొంది. దీంతోపాటు మన వద్ద ఉన్న వైద్య సదుపాయాలు, ఆస్పత్రులు, డాక్టర్ల సంఖ్య గురించి ఆలోచించడానికే ప్రజలకు భయమెస్తోంది.

ఇలాంటి భయాలు, ఆందోళనలు ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు. ప్రజలకు మోదీ ఎలా ధైర్యం చెప్పబోతున్నారు..? కరోనాను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు తీసుకోబోతున్నారు..? కుదేలవబోతోన్న ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఏం చేయబోతున్నారు..? అనేది మరికొద్ది గంటల్లో వెల్లడికానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి