iDreamPost

సందిగ్ధంలో జ‌న‌సేనాని…మూడుకు ఒకే కొడదామా?

సందిగ్ధంలో జ‌న‌సేనాని…మూడుకు ఒకే కొడదామా?

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సందిగ్ధంలో ప‌డ్డారు. మూడు రాజ‌ధానుల విష‌యంలో ఇప్ప‌టికే అన్న‌య్య క్లారిటీ ఇచ్చేశారు. మెగాస్టార్ వాటిని ఆహ్వానించారు. దాంతో త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి ఎటూ పాలుపోని స్థితికి చేరింది. అటు చంద్ర‌బాబు, ఇటు చిరంజీవి అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఇప్ప‌టికే ఈ విష‌యంలో చంద్ర‌బాబు మూడ‌డుగులు ముందుకేశారు. చివ‌ర‌కు మీడియా మీద దాడి జ‌రిగినా నేరుగా ఖండించ‌కుండా, నిందితుల‌ను అరెస్ట్ చేయ‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. పైగా జైలుకి వెళ్లి వారిని ప‌రామ‌ర్శించి కూడా వ‌చ్చారు.

మూడు రాజ‌ధానుల విష‌యంలో క్యాబినెట్ నుంచి క్లారిటీ వ‌స్తే మా వైఖ‌రి వెల్ల‌డిస్తామ‌ని వారం క్రిత‌మే జ‌న‌సేన స్ప‌ష్టం చేసింది. కానీ తీరా చూస్తే రాష్ట్ర ప్ర‌భుత్వం హైప‌ర్ క‌మిటీ వేసి మూడు వారాల గ‌డువు విధించింది. ఈలోగానే జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని ఆహ్వానించ‌డం ఆస‌క్తిక‌రం. అంతేగాకుండా తాజాగా పార్టీ రాష్ట్ర‌స్థాయి విస్తృత స‌మావేశానికి ఏకైక ఎమ్మెల్యే ఢుమ్మా కొట్టేశారు.

ఈ ప‌రిస్థితుల్లో జ‌న‌సేన ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన జ‌న‌సేన నేత‌లు కూడా విశాఖ రాజ‌ధాని అంశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సానుకూలంగా స్పందించాల‌ని ఒత్తిడి తెస్తున్న‌ట్టు స‌మాచారం. కానీ నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌హా ప‌లువురు నేత‌లు మాత్రం రాజ‌ధాని అంశంలో అమ‌రావ‌తికి జై కొట్టాల‌ని ప‌వ‌న్ కి చెబుతుండ‌డంతో ఆ పార్టీ అధినేత‌కు స్ప‌ష్ట‌త కొర‌వ‌డింది. గ‌తంలో ఇంగ్లీష్ మీడియం వంటి విష‌యాల్లో వేగంగా స్పందించిన ప‌వ‌న్ రాజ‌ధాని విష‌యంలో మాత్రం ఎటూ తేల్చ‌లేక‌పోవ‌డానికి ఈ ప‌రిస్థితి కార‌ణం అంటున్నారు.

అమరావ‌తి ప్రాంత రైతాంగానికి సంఘీభావంగా రంగంలో దిగుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ మీద కొన్ని విమ‌ర్శ‌లు చేయ‌డం, రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని చెప్ప‌డం వంటి హామీల‌కు ప‌వ‌న్ సిద్ధ‌ప‌డే ఛాన్స్ ఉంద‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో నేరుగా మూడు రాజ‌ధానుల వ‌ద్ద‌ని గానీ, అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాల‌ని గానీ ప‌వ‌న్ చెప్ప‌డానికి ప్ర‌స్తుత ప‌రిణామాలు సానుకూలంగా క‌నిపించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు బాట‌లో ప‌వ‌న్ సాగుతారా లేక చివ‌రి నిమిషంలో జాగ్ర‌త్త‌లు పాటించి , రాజ‌కీయ వ్యూహాత్మ‌క పాటిస్తారా అన్న‌ది రేప‌టికి క్లారిటీ వ‌స్తుంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం త‌ర‌లింపు విష‌యంలో ముంద‌డుగు వేయ‌డానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ జాగ్ర‌త్త‌లు పాటిస్తారా లేక బాబుని న‌మ్ముకుని రాజ‌ధాని ఊబిలో ఇరుక్కుంటారా అన్న‌దే ఆస‌క్తిక‌రం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి