iDreamPost

కరోనా కట్టడికి ఆంద్రప్రదేశ్ వ్యూహాలను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు.

కరోనా కట్టడికి ఆంద్రప్రదేశ్ వ్యూహాలను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు.

యావత్ ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ని కట్టడి చేయడంలో ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా కొన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి పన్నిన వ్యుహరచనలో విఫలం చెందడం మూలాన వైరస్ వ్యాప్తి ఆయా రాష్ట్రాల్లో తీవ్రంగా విజ్రంబిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో చూపిన అలసత్వం మూలాన భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మొదటి నుండి ప్రజల ఆరోగ్యం పట్ల జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో మెరుగైన ఫలితాలు అందుకుంటుంది. ఇప్పటికే దేశంలో అత్యధిక కరోనా నిర్ధారణ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. అలాగే కొరియా నుండి అత్యాదునిక టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకోవడం , కోవిడ్ పరీక్షలకు (IMASQ) బస్సులు ఏర్పాటు చేయడం , ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా చికిత్స అందిస్తున్న తొలి రాష్ట్రం గా ఉండటం. కరోనా సోకిన వారు నెగెటివ్ వచ్చి డిస్చార్జ్ అయ్యే సమయంలో కొంత నగదు ఇవ్వడం , రాష్ట్రంలోకి వచ్చిన వలస కూలీలపై చూపిన దాతృత్వం లాంటి అత్యంత పఠిష్టమైన చర్యలు చేపట్టడంతో మిగిలిన రాష్ట్రాల కన్న మెరుగ్గా రాష్ట్రం కమ్యునిటి స్ప్రెడ్ కేవలం 8% మాత్రమే నమోదై అగ్ర స్థానం లో నిలిచింది.

సిఎం జగన్ నేతృత్వంలో ఇలా అన్ని విదాలుగా కరోనాను ఎదుర్కోవడంలో సత్ఫలితాలు సాధిస్తుండటంతో, మొదటి నుండి రాష్ట్రంలో ఆవలంభిస్తున్న అనేక అంశాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచాయి. కరోనా కట్టడికి ఇతర రాష్ట్రాలు సైతం అవలంబిస్తున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యూహాలు చూస్తే

హౌస్‌హోల్డ్ స్క్రీనింగ్:

104 వాహనాల ద్వారా ప్రతి కుటుంబ ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని, మూడు నెలల (90 రోజుల) కాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అలాగే అందరికి కరోన టెస్టులు చెయ్యాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తడంతో డిల్లీ ప్రభుత్వం కూడా ప్రతి ఇంటిని సర్వే చేయాలని జులై 6లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అక్కడి అధికారులని ఆదేశించింది.

సాంకేతిక పరిజ్ఞానం:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా సెల్ ఫోన్ టవర్ సిగ్నల్, సెల్ ఫోన్ డేటా ఆదారంగా కరోనా పాజిటివ్ కేసుల ప్రైమరీ కాంటాక్టు ని గుర్తించడమే కాకుండా హోం క్వారంటయిన్ లో ఉన్న వారి కదలికలను గుర్తించే విధంగా కార్యాచరణ చేపట్టారు. ఆ తరువాత ఇదే పద్దతిని తెలంగాణ , బీహార్ రాష్ట్రాలు అనుసరించాయి.

వాలంటీర్ సిస్టం:

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం సాగించిన పోరాటాలలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నుముకగా నిలిచింది. 2.5 లక్షలకు పైగా వాలంటీర్ల తో, కరోనా వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లోనే ఇంటింటికి సర్వేలు చేయడమే కాకుండా వ్యాది సోకిన వారిని గంటల వ్యవదిలో గుర్తించి వారిని క్వారంటైన్ కు పంపి సమగ్ర చికిత్స అందించేలా చూడడంతో పాటు లాక్డౌన్ సమయంలో ఇంటికి అవసరమైన వస్తువులను కూడా అందించింది. దీంతో కేరళ రాష్ట్రంతో పాటు మరి కొన్ని కూడా కరోనా సమయంలో ప్రభుత్వం తరుపున ప్రజలకు సేవలు అందించడానికి వాలంటీర్లగా ముందుకు వచ్చి పని చేయాలని ప్రజలను అభ్యర్ధించాయి. ఇదే పద్దతిని యుకే , ఇండోనేషియా దేశాలు కూడా పాటించడం గమనార్హం.

డోర్-టు-డోర్ సర్వేలు:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని జగన్ ప్రభుత్వం ఇప్పటికే 4 సార్లు ఇంటింటి సర్వేలను నిర్వహించింది, విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించడం దగ్గర నుండి వివిద సంధర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించి ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమైన సమాచారాన్ని మొత్తం సేకరించింది. అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు దీనిని ఆదర్శంగా తీసుకుని ఇదే పద్దతిని అనుసరించాయి. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లలో కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇంటింటికి సర్వేలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడం చూస్తే సీఎం జగన్ కరోనా కష్టకాలంలో ఎంత ముందు చూపుతో వ్యవహరించారో అర్ధం అవుతుంది.

అలాగే సిఎం జగన్ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రజలు కరోనాతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ జీవించడం నేర్చుకోవాలని, కరోనా కట్టడికి జోన్ల వారీగా విభజించాలని, కరోనా కి ప్రస్తుతం మెడిసెన్ గా పేరాసెట్మాల్ తప్ప ఇంకేది అందుబాటులో లేదని, అలాగే కరోనా కట్టడికి బ్లీచింగ్ అనేది ముఖ్యమని అనేక సూచనలు చేశారు, తొలుత ముఖ్యమంత్రి జగన్ సూచనలను కొందరు అవహేళన చేసినా ఆ తరువాత దేశంలో ఉన్న కెసిఆర్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు , ఒకానొక సందర్భంలో ప్రధాన మంత్రి తో సహా సీఎం జగన్ చెప్పిన సూచనలను అంగీకరించడమే కాకుండా అమలు లోకి తీసుకుని వచ్చారు.

ఇలా అనేక సందర్భాలో ముఖ్యమంత్రి జగన్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి అవలభించిన వ్యూహలతో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు మెరుగ్గా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అనుసరించిన విదానాలు నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవ్వడం చూస్తే ముఖ్యమంత్రి జగన్ కి ఉన్న దూరదృష్టి అలాగే విపత్తు కాలంలో ఆయన అనుసరించిన విధానాలు ఆయన పనితీరు ఆమోఘమనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి