iDreamPost

పరిపాలనలో సీఎం జగన్ నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏమి ఆశిస్తున్నారు..??

పరిపాలనలో సీఎం జగన్ నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏమి ఆశిస్తున్నారు..??

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన లేఖల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన చంద్రబాబు.. తాజాగా ఈ రోజు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

విపత్తులు వచ్చినప్పుడే నాయకత్వ సమర్థత బయట పడుతుంది. కానీ ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తే కరోనా నియంత్రణ చేతగాక కరోనా తో కలిసి జీవించాలి.. అంటూ పాలకులు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. కరోనా సంగతి ఎలా ఉన్నా ఇక ఎన్నికలు జరిపించాలి అన్న తొందరలో ఉన్నారు పాలకులు. ఇలాంటి పరిస్థితుల్లో పౌరులుగా మనమే మన బాధ్యత నిర్వర్తించాలి. మన ఊరు, మన వార్డు, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలి. మనం క్షేమంగా ఉందాం. సమాజాన్ని సురక్షితంగా ఉంచుదాం… అంటూ ప్రతిపక్ష నేత హోదాలో నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తే కరోనా నియంత్రణ చేతకాక కరోనా తో కలిసి జీవించాలి అంటూ పాలకులు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది.. అనేది చంద్రబాబు సందేశంలో ఓ భాగం. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు, రాజకీయ విశ్లేషకులకు అర్థంకానిది ఒక ఒకటి ఉంది. అసలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి పాలన ఆశిస్తున్నారు. వాస్తవ విరుద్ధమైన, సంభ్రమాశ్చర్యలకు గురిచేసేలా, ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తూ పరిపాలన సాగించాలనా..? లేదా వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ వారిని అప్రమత్తం చేసే పాలన కావాలనుకుంటున్నారా..?

కరోనా వైరస్ అరికట్టేందుకు వ్యాక్సిన్ రావడం లేదా ఇమ్యూనిటీపవర్ పెరగడం వల్లనో లేదా మందులు రావడం వల్లనో సాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు చెబుతున్న మాట. లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కూడా ఈ రోజు ఓ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదే విషయం ప్రజలకు వివరించారు.

సముద్రాన్ని వెనక్కి నెట్టి హుద్ హుద్ తుఫాన్ కంట్రోల్ చేశాను. టోక్యో తరహాలో అమరావతి రాజధాని నిర్మాణం. ఇస్తాంబుల్ తరహాలో రాజధాని అమరావతి. 2018 నాటికి అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహణ. దోమలపై దండయాత్ర. దోమలకు లింగ పరీక్షలు. అమరావతికి బుల్లెట్ ట్రైన్… ఇలాంటి హాస్యాస్పదమైన ప్రకటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు చేశారు. ఐదేళ్లపాటు పాలనలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా నిత్యం ఇలాంటి ప్రకటనతో కాలం వెళ్లబుచ్చారు.

ప్రజలను రంజింప చేసే వాడే రాజు అన్నట్లుగా వాస్తవ పరిస్థితిని మరచి అభివృద్ధి, సంక్షేమాన్ని అరచేతిలో స్వర్గం లాగా చూపించారు. దాని ప్రతిఫలం 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబుకు అర్థమైంది. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తనలాగే అలాంటి ప్రకటన చేయాలని బాబు ఆశిస్తున్నారా..? కరోనా ను కంట్రోల్ చేసాను.. కరోనా పై కరాటే…లాంటి ప్రకటనలు సీఎం జగన్ నుంచి చంద్రబాబు ఆశిస్తున్నట్లు గా ఆయన మాటల ద్వారా అర్ధమవుతోంది.

కరోనా వైరస్ కట్టడికి, లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు.. అన్నట్లుగా మన ఊరు, మన వార్డు, మన సమాజాన్ని రక్షించుకునే బాధ్యత మనదే అంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.. ఇంతవరకు బాగానే ఉంది. ఇలాంటి ఆపత్కాలంలో సాటి వారికి సహాయం చేయమని చెప్పడం మంచిగానే ఉంది. అయితే చెప్పే ముందు తాను ఆచరించాలి అన్న విషయం చంద్రబాబు మర్చిపోతున్నారు. లాక్ డౌన్ ప్రారంభానికి రెండు రోజులు ముందే హైదరాబాదులోని రాజభవనానికి వెళ్లిపోయారు.

ప్రతి ఎన్నికల్లోనూ తనను ఆదరిస్తున్న కుప్పం నియోజకవర్గానికి గాని, కనీసం తన ఊరి ప్రజలకు గాని ఈ ఆపత్కాలంలో చంద్రబాబు సహాయం చేసినట్లు ఎక్కడా వినిపించలేదు, కనిపించలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు కడిగేసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కాకపోయినా కనీసం కుప్పం నియోజకవర్గ ప్రజానీకానికి లేదా తన సొంత గ్రామమైన నారావారి పల్లె ప్రజలకైనా ఈ ఆపత్కాలంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించే ప్రయత్నం చేయలేదు. మొదటిసారి ప్రజాప్రతినిధులు అయినా నాయకులు అందరూ తమ తమ నియోజకవర్గ ప్రజలకు తమకు చేతనైనంత మేరకు సేవ చేస్తున్నారు.

గెలిచినా, ఓడినా మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను అన్న నారా లోకేష్ కూడా కరోనా కష్ట కాలంలో మంగళగిరి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మన ఊరు మన వార్డు మన సమాజాన్ని ఆదుకుందాం అన్న చంద్రబాబు కనీసం తన గ్రామానికైనా సహాయం చేయాలి. అప్పుడే ఆయన మాటకు, పిలుపుకు విలువ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి