iDreamPost

సుజనాకు సొంత గూటిలోనే షాక్

సుజనాకు సొంత గూటిలోనే షాక్

ఏపీ బీజేపీని త‌న దారిలోకి తెచ్చుకోవాల‌ని సుజ‌నా చౌద‌రి ఆశిస్తున్నారు. గ‌తంలో వెంక‌య్య నాయుడు పోషించిన పాత్ర‌లో తాను దూసుకుపోవాల‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. కేంద్రంలో పెద్ద‌ల‌తో ఉన్న ప‌రిచ‌యాలు, ఆర్థిక ద‌న్ను, టీడీపీ నుంచి ఇటీవ‌ల పార్టీలో చేరుతున్న నేత‌లు, సామాజిక నేప‌థ్యానికి తోడుగా మీడియాలో మ‌ద్ధ‌తు కూడా ఉండ‌డంతో ముంద‌డుగు వేయాల‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. కానీ బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాఖ‌లో ప‌రిణామాలు ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేదు.

తాజాగా అమ‌రావ‌తి వ్య‌వ‌హారంలోనే సుజ‌నా చౌద‌రికి షాక్ త‌గిలింది. అది కూడా పార్టీ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహ‌రావు స్పంద‌న‌తో సుజ‌నా ఖంగుతినాల్సి వ‌చ్చింది. రాజ‌ధాని విష‌యంలో తాను కేంద్రంతో మాట్లాడి చెబుతున్నాన‌ని, రాజ‌ధాని మారుస్తామంటే చూస్తూ ఊరుకోమ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఆయ‌న మాట్లాడిన 24 గంట‌ల్లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌చ్చిన జీవీఎల్ అదంతా ఆయ‌న వ్య‌క్తిగ‌తం అంటూనే, రాజ‌ధాని విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోద‌ని తేల్చేశారు. అంతేగాకుండా అదంతా ఏపీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం అని, అధికార ప్ర‌తినిధిగా త‌న మాటే ఫైన‌ల్ అని ఆయ‌న స్ప‌ష్టం చేసేశారు. ఇది సుజ‌నాకి చెంప‌పెట్టుగా మారింది.

ఓవైపు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మ‌రోవైపు సుజ‌నా చౌద‌రి కూడా అమ‌రావ‌తికి అండ‌గా ఉద్య‌మిస్తామ‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో ఈ ఇరువురు ఏపీ బీజేపీ పీఠం కోసం పోటీలో ఉన్నారు. క‌న్నా దానిని నిల‌బెట్టుకోవాల‌ని ఆశిస్తుంటే, తాను ద‌క్కించుకోవాల‌ని సుజ‌నా ఆశిస్తున్నారు. క‌మ్మ‌, కాపు పోటీలో చివ‌ర‌కు ఎవ‌రు ద‌క్కించుకుంటున్నార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అదే స‌మ‌యంలో వారిద్ద‌రినీ కాద‌ని త‌న‌దైన మార్క్ చూపించాల‌ని జీవీఎల్ వంటి వారు ఆశిస్తున్నారు. త‌మ‌కు అనుకూలంగా ఉన్న నేత‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని ఆశిస్తున్నారు. సోము వీర్రాజు వంటి సీనియ‌ర్లు కూడా జీవీఎల్ తో క‌లిసి సాగుతున్న త‌రుణంలో ఈ వ్య‌వ‌హారం బీజేపీలో ఆస‌క్తిక‌ర మార్పుల‌కు దారితీయ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

రాజ‌ధాని అంశంలో సోము వీర్రాజు సైలెంట్ గా ఉండ‌డం వెనుక కూడా రాజకీయ వ్యూహాత్మ‌కంగా భావిస్తున్నారు. క‌న్నా, సుజ‌నా వంటి వారు బ‌ద్నాం అయితే అది రాజ‌కీయంగా త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సోము వీర్రాజు అంచ‌నా వేస్తున్నారు. మ‌రో ఎమ్మెల్సీ మాధ‌వ్ కూడా ఈరేసులో ఉన్నారు. ఏమ‌యినా ఏపీ రాజ‌ధాని అంశంలో సుజ‌నా చౌద‌రికి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న వేళ బీజేపీలో పాగా వేయాల‌నే త‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. పైగా సుజ‌నాకి టీడీపీ నుంచి ఉన్న స‌హ‌చ‌రుడు సీఎం ర‌మేష్ నుంచి కూడా మ‌ద్ధ‌తు ద‌క్క‌క‌పోవ‌డం మ‌రో విశేషం. ఇటీవ‌ల జ‌గ‌న్ కి బొకే అందించి ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నించిన సీఎం ర‌మేష్ రాజ‌ధాని అంశంలో సామ‌ర‌స్యంగా స్పందించారు. ఈ విష‌యంలో ఆయన జాగ్ర‌త్త‌లు పాటించారు. త‌ద్వారా సుజనాకి సొంత మ‌నుషుల నుంచి కూడా ఆశించిన మ‌ద్ధ‌తు ద‌క్క‌లేదు. ఈ ప‌రిస్థితుల్లో బీజేపీ నాయ‌కుడిగా సుజ‌నా ఆశ‌లు నెర‌వేరే అవ‌కాశాలు క‌నుచూపుమేర‌లో క‌నిపించ‌డం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి