ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ రోజు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన సుబ్బిరామిరెడ్డి వైఎస్ జగన్‌తో మంతనాలు జరిపారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ సమయం దగ్గరపడుతున్న సమయంలో సుబ్బిరామిరెడ్డి సీఎం జగన్‌ను కలవడం చర్చనీయాంశమైంది.
వచ్చే నెలలో రాజ్యసభలో 55 మంది సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. అందులో సుబ్బిరామిరెడ్డి కూడా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న సుబ్బిరామిరెడ్డి ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతర రాష్ట్రాల నుంచి మళ్లీ రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఆయా ప్రయత్నాలు ఫలించే అవకాశం లేకపోవడంతో.. తాజాగా ఆయన మరో దారిలో వెళుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడితో భేటీ అయినట్లు ప్రచారం సాగుతోంది.
55 రాజ్యసభ స్థానాల ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 6 నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 13వ తేదీతో ముగుస్తోంది. ఏపీ నుంచి ఖాళీ అయ్యే నాలుగు స్థానాలు వైఎస్సార్‌సీపీకి దక్కనున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఇటీవల ముకేష్ అంబానీ తన సంస్థలో పని చేసే పరిమల్ సత్వానీకి రాజ్యసభ సభ్యత్వం కోసమే తాడేపల్లి వచ్చి సీఎం జగన్‌ను కలిసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా టి.సుబ్బిరామిరెడ్డి కూడా జగన్‌ను కలవడంతో పోటీ లేకపోయినా ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.