iDreamPost
android-app
ios-app

ప్రతిదినం ప్రజాహితం పుస్తకావిష్కరణ

ప్రతిదినం ప్రజాహితం పుస్తకావిష్కరణ

సీనియర్‌ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రచురించిన ‘ప్రతిదినం ప్రజాహితం’ పుస్తకాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఏపీలో అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు, జగన్‌ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాల గురించి ప్రస్తావించారు. పుస్తకావిష్కరణనంతరం వైఎస్‌ విజయమ్మ మాట్లడుతూ వైఎస్‌ జగన్‌ తన తండ్రి బాటలో నడుస్తున్నారన్నారు. గత పాలకుల హయాంలో ప్రజలెదుర్కొన్న కష్టాలను జగన్‌ పాదయాత్ర సందర్భంగా దగ్గర్నుంచి చూశారని, దానికి అనుగుణంగానే మేనిఫెస్టోను రూపొందించారన్నారు. నవరత్నాల రూపకల్పన వెనుక పాదయాత్ర పాత్ర ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను జగన్‌ నెరవేర్చార న్నారు.

ఇళ్ల పట్టాలే మిగిలున్నాయి…

జగన్‌ హామీలకు సంబంధించి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఒక్కటే మిగిలి ఉందని తాను భావిస్తున్నట్లు విజయమ్మ పేర్కొన్నారు. జులై 8న ఆ కార్యక్రమాన్నీ పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందనే విషయాన్ని గుర్తుచేశారు. కరోనా వైరస్‌ వల్ల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలను విస్మరించలేదని, ఇచ్చిన హామీల మేరకు అన్ని వర్గాలకూ రూ.10 వేల రూపాయలను జమచేస్తున్నారన్నారు. తన కుమారుడు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నందుకు తల్లిగా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.