iDreamPost
iDreamPost
        
నర్సీపట్నం ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్యం అందించాల్సిన బాధ్యత గల ఓ డాక్టర్ వ్యవహారం గడిచిన నెలలో పెద్ద వివాదంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మత్తు డాక్టర్ సుధాకర్ తీరు మీద అప్పట్లో పలు విమర్శలు వచ్చాయి. చివరకు ప్రభుత్వం అతన్ని సస్ఫెండ్ కూడా చేసింది. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం మాని, మీడియాలో రాజకీయ విమర్శలకు పూనుకోవడం అతని మీద చర్యలకు కారణంగా మారింది. ఇక ఇప్పుడు మళ్లీ నెల రోజులు గడవక ముందే సుధాకర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
ఈసారి విశాఖ ఫోర్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ వీరంగం చేయడం విశేషంగా మారింది. తన కొడుక్కి వత్తాసు పలుకుతూ పోలీసుల పై దురుసుగా ప్రవర్తించారంటూ డాక్టర్ పై కథనాలు రావడం ఆసక్తిగా మారింది. లాక్ డౌన్ సమయంలో సుధాకర్ తనయుడు లలిత్ నిబంధనలు ఉల్లంఘించడంతో అతని టూవీలర్ సీజ్ చేశారు. దానిని తనకు అప్పగించాలంటూ లలిత్ చేసిన ఒత్తిడికి పోలీసులు తలొగ్గకపోవడంతో చివరకు నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకున్న సుధాకర్ తీరు ఇప్పుడు చర్చకు కారణంగా ఉంది. పోలీస్ స్టేషన్ సిబ్బంది పై దురుసుగా ప్రవర్తించడంతో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది.
నిబంధనల ప్రకారం కేసు నమోదుకావడంతో కొడుకు లలిత్ బండిని కోర్టు లో విడిపించుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా వాహనాన్ని తమకు అప్పగించాలని, లేదంటే రెండో తాళం తీసుకుని వచ్చి వేసుకుపోతానంటూ బెదిరించడం విస్మయకరంగా మారింది. వైద్య వృత్తిలో ఉండి పోలీస్ సిబ్బందిని బెదరించేందుకు ప్రయత్నించడం గమనిస్తే తన ఆసుపత్రిలో ఆయన చాలామందిపై దురుసుగా ప్రవర్తించేవారనే విమర్శలకు ఊతమిస్తోంది. ఈ పరిణామాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రాజకీయ అండదండలు ఉన్నాయనే కారణంతా ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల మీద దుందుడుకుతనం ప్రదర్శించిన తీరు విస్మరించకూడదని చెబుతున్నారు. తగిన రీతిలో స్పందించాలని కోరుతున్నారు