అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త తో విచారణ జరిపించాలని ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించింది. ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మూడో రోజు ఇన్సైడర్ ట్రేడింగ్‌పై తీర్మానం ప్రవేశపెట్టింది. హోంమంత్రి మేకతోటి సుచరిత తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి.. చర్చను ప్రారంభించారు.
కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన ఆధారంగా 4,070 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. స్వతంత్ర ఏజెన్సీతో విచారణ చేయించాలని పలువురు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. సీబీఐ వంటి సంస్థతో దర్యాప్తు చేయిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. చర్చ అనంతరం తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణపై అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడంతో ఈ అంశంలో నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలన్నే కృతనిశ్ఛయంతో వైఎస్సార్సీపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అధికార పార్టీ, లేదు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ సవాల్ విసిరింది. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరు చెప్పి రాజధానిని విశాఖకు తరలిస్తున్నారంటూ టీడీపీ విమర్శస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తేల్చకపోతే తమకు తిప్పలు తప్పవన్న అంచనాకు వైఎస్సార్సీపీ వచ్చింది. లోకయుక్త, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థ.. ఇలా ఏదైనా సరే విచారణ జరిపించి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించాలనే లక్ష్యంతో ఉంది. అధికార పార్టీ దూకుడుతో.. నిన్నటి వరకు సవాళ్లు విసిరిన టీడీపీకి, రాజధాని ప్రకటనకు ముందే భూములు కొన్న టీడీపీ తాజా, మాజీ ప్రతినిధులకు తిప్పలు తప్పేట్లు లేవు. త్వరలో విచారణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
4110