iDreamPost
android-app
ios-app

రాజు మంచివాడైతే.. రాజ్యం సుభిక్షంగా ఉంటుందనేది నిజమా…?

రాజు మంచివాడైతే.. రాజ్యం సుభిక్షంగా ఉంటుందనేది నిజమా…?

రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పెద్దలు చెప్పే మాట. ఈ మాటలో వాస్తవం ఎంత..? ఇలాంటి ఉపమానాలు, సామెతలు ఎన్నో ఉన్నాయి. సందర్భానుసారంగా వీటిని ఉపయోగిస్తుంటాం. అయితే ఇవి వాస్తవమని, కాదనే చర్చలు జరిగాయి. అయితే పలు సందర్భాలు ఈ ఉపమానాలు, నానుడిలు, సామెతలు నిజమేననేలా జరిగాయి. ఇలాంటి వాటిలో పైన పేర్కొన్న.. రాజు మంచివాడైతే..రాజ్యం సుభిక్షంగా ఉంటుందనేది ఒకటి. తాజాగా ఈ ఉపమానం నిజమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది వర్షాకాలం ప్రారంభంలో.. అంటే మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు ఐదేళ్లు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ కాలంలో ఐదేళ్లపాటు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది. ఉభయగోదావరి, కృష్ణాజిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజలు కనీసం తాగేందుకు కూడా నీరు లేక అవస్థలు పడ్డారు. ఇక సాగు నీరు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణా డెల్టానే బీడు పడే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్‌ ఆయకట్టులో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పోలాలు బీడులుగా పెట్టుకోవాల్సిన దుస్థితి అప్పట్లో దాపురించింది. కరువును తరిమికొట్టేందుకంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెయిన్‌ గన్‌ విధానాన్ని కూడా ఉపయోగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరువుతో వలసపోని పల్లెలు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో లేవంటే అతిశయోక్తి కాదు.

ఐదేళ్లు ఇలాంటి పరిస్థితి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగానే.. అప్పటి వరకూ కనిపించని వరుణుడు వెల్లువలా వచ్చాడు. గత ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోని చెరువులకు గండ్లు పడేలా వర్షాలు కురిశాయంటే.. ఆశ్చర్యం కలగమానదు. పదేళ్లలో మళ్లీ కృష్ణా నదికి భారీ స్థాయిలో వరద వచ్చింది. ఆ దెబ్బకు కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న చంద్రబాబు నివాసంలోకి నీళ్లు వచ్చాయి. ఏదో యాధృశ్చికంగా గత ఏడాది వర్షాలు పడ్డాయని అనుకుందామంటే.. పరిస్థితులు అలా లేవు. ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు పడుతున్నాయి.

ఖరీఫ్‌ ప్రారంభం అయ్యే జూన్‌ నెలలోనే నైరుతి రుతుపవణాలు వచ్చాయి. సకాలంలో నైరుతి రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. వీటి దెబ్బకు సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలోనూ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సకాలంలో వర్షాలు పడుతుండడంతో అన్నదాతలు ఆనందంలో ఉన్నారు. ఇప్పటికే సాగుకుఅవసరమైన విత్తనాలు, ఎరువులు తమ గ్రామంలోనే ఉన్న రైతు భరోసా కేంద్రాల నుంచి తెచ్చుకున్నారు.

2004కు ముందు కూడా చంద్రబాబు 9 ఏళ్ల హాయంలో చివరి 7 ఏళ్లు తీవ్రమైన కరువు సంభవించింది. మళ్లీ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అవగానే.. వర్షాలు పుష్కలంగా పడ్డాయి. కరువు మాయమైంది. వలస వెళ్లిన గ్రామీణ ప్రజలు మళ్లీ ఊర్ల బాట పట్టారు. వైఎస్‌ ఆకాల మరణం తర్వాత నాలుగేళ్లు వర్షాలు ఆలస్యంగానైనా కురిశాయి. 2014లో చంద్రబాబు రాకతో మళ్లీ కరువు. 2019లో జగన్‌ రాకతో.. మళ్లీ పుష్కలంగా వర్షాలు. వాతావరణ పరిస్థితులు, పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడే లా నినో, ఎల్‌ నినో.. వర్షాలు కురవడంపై ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ చెబుతుంది. కానీ ఏపీ చరిత్ర 1995 నుంచి చూసిన వారు మాత్రం.. రాజు మంచివాడైతే.. రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెబుతారు. వాతావరణం, సాంకేతిక పరిజ్ఞానం తెలియని అన్నదాతలు వర్షాలు, కరువుతో తమకున్న అనుభవం ద్వారా ఈ నానుడిని బలంగా విశ్వసిస్తారు.