కరోనా వైరస్ వ్యాప్తి, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని ఓ పక్క ప్రచారం జరుగుతున్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేసులు సంఖ్య ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలకే ఆ లాక్‌డౌన్‌ను పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది.
రాజధాని చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, తిరువళ్లూర్, చెంగల్‌పేట్, కాంచీపురం జిల్లాలో ఈ నెల 19 నుంచి 30 వరకూ 12 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు నిపుణులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. జూన్ 21, 28వ తేదీల్లో ఆదివారాలు అత్యవసర సేవలు మినహా సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. మిగతా రోజుల్లో ఆంక్షలతో నిత్యవసరాలు, కూరగాయలు, ఇతర అత్యవసర సేవలకు అనుమతి ఉంటుందని ప్రకటించారు.
12 రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉండే ఆయా ప్రాంతాల్లో మార్గదర్శకాలను సీఎం పళనిస్వామి వెల్లడించారు. నిత్యవసర, అత్యవసర దుకాణాలు మినహా మిగతావన్నీ పూర్తిగా మూసివేయనున్నారు. అత్యవసరం అయితేనే ఆటోలు, ట్యాక్సిలకు అనుమతి ఇస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పార్శిళ్ల కోసం మాత్రమే అనుమతిస్తారు. ఫుడ్‌డెలివరీ సంస్థలకు అనుమతివ్వనున్నారు. చెన్నై దాటి వెళ్లాలంటే పాస్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రైలు, విమాన సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. టీ దుకాణాలు మూసి ఉంటాయి. అమ్మ క్యాంటిన్లు తెరిచి ఉంటాయి. బ్యాంకులు, కోర్టులు, మీడియా సంస్థలకు యథావిధిగా కొనసాగేందుకు అనుమతిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు 33 శాతం హాజరవ్వాలని సీఎం వెల్లడించారు.
8827