సినిమా హీరోలందరికీ ఒక విన్నపం. ఇంత కాలం మీరు ప్రేక్షకుల్ని రంజింప చేశారు. వాళ్ల కష్టాల్ని మరిపించారు. కలల ప్రపంచాన్ని చూపించారు. రోజంతా కష్టపడిన ఒక ఆటో డ్రైవర్ కొండారెడ్డి బురుజు దగ్గర “భేరాల్లేవమ్మా” అని డైలాగ్‌లు చెప్పిన, మహేశ్‌బాబుని చూసి ఒళ్లు పులకించి శ్రమ మరిచిపోయాడు. బస్తాలు మోసిన కూలీ కుర్రాడు , తెర మీద అల్లు అర్జున్ కనిపించి సామజవరగమనా అంటే భుజాల పీకుడు గుర్తు లేకుండా సంతోషపడ్డాడు.
సైరాలో చిరంజీవి కత్తి తిప్పితే , దుమ్ములో ధూళిలో కూరగాయలు అమ్ముకున్న ఒక పేదరాలు చప్పట్లు కొట్టింది. సమయం లేదు మిత్రమా అని బాలకృష్ణ అంటే రోజుకి 12 గంటలు ఆఫీస్ ముందు కూర్చోకుండా నిలబడే ఒక సెక్యూరిటీ గార్డ్ విజిల్ వేశాడు. అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్ సీన్‌లో పవన్ డైలాగ్ చెబుతుంటే అనంతపురంలోని నేల టికెట్ ప్రేక్షకుడు విజిల్ వేశాడు. ఆయన ఫైట్ చేస్తే కూరగాయలు అమ్ముకునే కుర్రాడు కుర్చీలోంచి గంతులేశాడు.
రాంచరణ్‌కి రంగస్థలం సినిమాలో చెవులు వినపడకపోతే హోటల్లో రోజుకి పది గంటలు కప్పులు కడిగే కుర్రాడు కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. రాఖీలో ఎన్టీయార్‌ని చూసి, ఇళ్లలో పాచి పనులు చేసుకునే అమ్మాయి తన సొంత అన్నయ్య అనుకుంది.
రవితేజని చూసి భీమవరం పొలాల్లో పనిచేసే కూలీలు, అచ్చం తమ పక్కింటి కుర్రాడు అనుకున్నారు. అందరికి చల్లదనం పంచడానికి ఎండలో ఐస్‌క్రీంలు అమ్మే కుర్రాడు నాగార్జున సినిమా అంటే పడిచస్తాడు. నాని మతిమరపు చూసి మణికొండలో ఇల్లిల్లూ తిరిగి పాంప్లెట్స్ పంచే అవిటి కుర్రాడు బలేబలే మగాడివోయ్ సినిమాని ఐదుసార్లు చూశాడు.
మీరు నవ్వితే వీళ్లంతా నవ్వారు. మీ కంట్లో నీళ్లు వస్తే వీళ్లు కన్నీటి ప్రవాహంగా మారారు. మీ ఫైట్స్‌కి చప్పట్లు కొట్టారు. మీ పాటలకి డాన్స్‌లు చేశారు. టికెట్ల కోసం తన్నులు తిన్నారు. కష్టార్జిత సొమ్ముతో బ్లాక్‌లో కొన్నారు. మిమ్మల్ని ఒకసారి చూడడానికి తోసుకున్నారు, తన్నుకున్నారు.
మీరు ఇచ్చిన వినోదానికి , బతుకులోని విసుగుని మరిచిపోయారు. తెరమీది వెలుగుని చూసి జీవితంలోని చీకటిని మరిచిపోయారు. మిమ్మల్ని చూస్తున్న కాసేపు ఈ ప్రపంచాన్ని మరిచిపోయి కలల లోకంలో షికారు చేశారు. బతుకులోని కష్టం, చిరుగుల చొక్కా, సగం కడుపుకే తిండి , కోళ్ల గూడులాంటి ఇల్లు ఇవేవి మిమ్మల్ని చూస్తుంటే గుర్తు రావు.
మిమ్మల్ని అభిమానించారు, ప్రేమించారు, చొక్కాలు చింపుకున్నారు, రక్తాలు కార్చుకున్నారు. మీ బంగారు రథాలని, కష్టాలు పెనువేసుకుపోయిన తమ మోకులతో లాగారు.
ఇపుడు వీళ్లంతా కష్టాల్లో ఉన్నారు సార్, కరోనా వచ్చేసింది. సూక్ష్మం కాస్త బ్రహ్మాండమైంది. ఆర్థిక విధ్వంసం మొదలైంది. చేయడానికి పనిలేదు. పనిచేయకపోయినా ఆకలేస్తుంది.
ఆటో డ్రైవర్లు రోడ్డు మీదికి రాలేదు. పనిమనుషుల్ని ఇళ్లలోకి రానివ్వరు. హోటళ్లు మూసేశారు. దుకాణాలు లేవు. వూరెళదామంటే బస్సులు లేవు. ఒక మృత్యు మేఘంలా ఆకాశమంతా కరోనా పరుచుకుంది. భూమిని కమ్మేస్తూ ఉంది.
ఈ కష్ట కాలాన్ని ప్రభుత్వాలు మాత్రమే దాటలేవు. కేసీఆర్, జగన్ ఇద్దరూ ప్రజలంటే ఇష్టమున్న వాళ్లే, కష్టాలకి స్పందించే వాళ్లే. కానీ ఈ వైతరణి నది (నరకలోకం చీమునెత్తురలతో ఉన్న నది) దాటడం వాళ్ల వల్ల కూడా కాదు. అందరూ తలో చెయ్యి వేస్తేనే , అందరి నోట్లోకి ముద్ద వెళ్లేది.
మీరు హీరోలుగా తెరమీద నిరూపించుకున్నారు. కానీ మనిషిగా నిరూపించుకునే అవకాశాలు జీవితంలో చాలా తక్కువ వస్తాయి. ఇపుడు వచ్చింది. క్రరోనా ఒక రకంగా కాల పరీక్ష. మనలో మనిషి ఉన్నాడో లేదో తేలిపోతుంది.
(హీరోలకే కాదు, పేద వాళ్ల డబ్బులతో ధనవంతులుగా జీవించే ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది)
6102