రాష్ట్రానికి మూడు రాజధానులపై ప్రభుత్వం చేసిన ప్రకటనకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. చిరంజీవి పేరుతో శనివారం నాటి ప్రకటనకు భిన్నంగా తెల్ల కాగితంపై ఆదివారం మరో ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
దీనిని ఖండిస్తూ చిరంజీవి వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. తెల్ల కాగితంపై తన పేరిట వచ్చిన ప్రకటన అవాస్తవమని, ఫేక్ అని స్పష్టం చేశారు. ఆదివారం తెల్లకాగితంపై వచ్చిన ప్రెస్‌నోట్ తనది కాదని, అలాంటి ప్రకటన తానివ్వలేదని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే తాను కట్టుబడి ఉన్నానని, ఫేక్ ప్రకటనను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వరుసగా శని, ఆది వారాల్లో చిరంజీవి పేరిట రెండు లేఖలు విడుదల కావడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఆదివారం విడుదలైన లేఖ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంమైన ఈ అంశంలో స్పష్టత ఇచ్చేందుకు చిరంజీవి నేరుగా రంగంలోకి దిగారు.
3186