70 ఏళ్ల వయస్సు. 40 ఏళ్లకుపైగా రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 11 ఏళ్లు ప్రతిపక్ష నేత, దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త అయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు నుంచి ఆయన స్థాయికి తగ్గట్లు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు రావడంలేదని రాజకీయ నేతలు, మీడియా వర్గాలు, రాజకీయ విశ్లేషకులు నిన్నమొన్నటి వరకూ చేసిన విమర్శ. అయితే వారందరి విమర్శలకు చెక్ పెడుతూ ఏడాది కాలంలో చంద్రబాబు తొలిసారిగా తన అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వం నడుపుతున్న సీఎం వైఎస్ జగన్‌కు విలువైన సలహా ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన సలహా సీఎం జగన్ కూడా తప్పకుండా స్వీకరించేలా ఉంది.
చంద్రబాబు తన సలహాను ట్విట్టర్ వేదికగా ఇచ్చారు. ‘‘ ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితం చేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం, ప్రజల్లో మన పట్ల ఒక నమ్మకం, భరోసా కలిగాక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిలబెట్టుకోవాలి. లేదంటే చరిత్రహీనుల్లా మిగిలిపోతాం. ఇది వైసీపీ పాలకులు గ్రహించాలి’’ అని చంద్రబాబు సూచించారు.
చంద్రబాబు ఇచ్చిన సలహా చూస్తే.. ఆయన తన అనుభవంతో ఇచ్చినట్లుగా ఉంది. ‘‘ ప్రజల్లో మన పట్ల ఒక నమ్మకం, భరోసా కలిగాక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిలబెట్టుకోవాలి’’ అని చంద్రబాబు చెప్పిన మాటల్లో సీఎం జగన్‌ను ఏపీ ప్రజలు నమ్మారని, ఆయనపై భరోసా పెట్టుకున్నారని అర్థమవుతోంది. గత ఎన్నికల్లో సీఎం జగన్ ఇచ్చిన హామీలను, చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు కనుకనే గెలిపించారని చంద్రబాబు పరోక్షంగా గుర్తు చేస్తున్నారు. మరో ముఖ్యమైన పదం కూడా చంద్రబాబు ఉపయోగించారు. అదే భరోసా.. కష్టకాలంలో ఉన్న రాష్ట్రాన్ని, ప్రజలను అభివృద్ధి వైపు సీఎం జగన్ నడిపిస్తారనే భరోసా ప్రజల్లో ఉందని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు.
నమ్మకం, భరోసా.. పెట్టుకున్నాక వాటిని నిలబట్టుకోవాలి. లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం.. అని కూడా చంద్రబాబు చెప్పారు. ఇక్కడ ఓ విషయం గమనించాలి. చంద్రబాబు ఏదో యథాలాపంగా ఈ పదాలతో సలహా ఇవ్వలేదు. తన జీవితంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తగా సలహా ఇచ్చినట్లు అర్థమవుతోంది.
రాష్ట్ర విభజన, రాజధాని కూడా లేని రాష్ట్రం.. దిక్కుతోచని పరిస్థితిలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రాన్ని అనుభవజ్ఙుడైన చంద్రబాబు విజయవంతంగా నడిపిస్తారని ప్రజలు భరోసా పెట్టుకున్నారు. ఆయన ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం.. లాంటి 650 హామీలను తప్పకుండా అమలు చేస్తారని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. అందుకు 2019 ఎన్నికల్లో చరిత్రాత్మకమైన తీర్పు ఇస్తూ.. బాబుకు గుణపాఠం చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు.. యువకుడైన వైఎస్ జగన్‌కు ఈ సలహా ఇచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.
జీవితంలోనూ, రాజకీయాల్లోనూ ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ కాకతప్పుడు. జీవిత చరమాంకంలో పెద్దలు చేయగలిగిన పని.. ఎంతో విలువైన తమ అనుభవంతో యువతకు మంచి సలహాలు ఇచ్చి ఉజ్వలమైన భవిష్యత్ వైపు వారిని నడిపించడం. తాము చేసిన తప్పులు, పొరపాట్లు వారు చేయకుండా దిశానిర్ధేశం చేయడం. 70 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఈ పనే చేస్తున్నారని ఆయన ఇచ్చిన సలహాను బట్టి తెలుస్తోంది.
సీఎం జగన్ వయసు 47. చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి అయ్యారు. మరో 25 లేదా 30 ఏళ్లు క్రీయాశీలక రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు వైఎస్ జగన్‌ను సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయకుండా, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారు పెట్టుకున్న భరోసాను నిలుపుకోవాలి సూచిస్తున్నారు. తద్వారా ప్రజల మనసులను చూరగొని.. మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను చంద్రబాబు వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఏపీని సమర్థవంతంగా నడిపే నాయకుడు ఒక్క జగనే కనిపిస్తున్నారు. అటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ సత్తా ఏమిటో ఇప్పటికే ప్రజలు గమనించారు. ఇక ఎవరైనా కొత్తగా వస్తే తప్పా జగన్‌తో సరితూగగల, పోటీపడగల నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో లేరని కొన్ని రోజులుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే వారి విశ్లేషణలు నిజమేనన్న భావన కలుగుతోంది.
8502