iDreamPost
iDreamPost
జయము జయము చంద్రన్న లాంటి పాటలు పాడి , గొంతెండిన మాకు డబ్బులు ఎగ్గొట్టాడు ఆ బాబు . మీరైనా ఆ డబ్బులిప్పించి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటున్న జానపద కళాకారులు ..
గత టీడీపీ ప్రభుత్వ హాయాములో ఎన్నికల ముందు ప్రభుత్వ పథకాలను , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తించటానికి ఏకంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కొన్ని కళా బృందాలను నియమించుకొని హరికథ , బుర్ర కధల రూపంలో పలు భజన కీర్తులు రాయించుకొని , పొగిడించుకొన్న బాబు గారి ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన 96 లక్షల డబ్బులు మాత్రం చెల్లించలేదు .
ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు 3.60 లక్షల కోట్ల అప్పు భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన మోపిన బాబు గారు అదనంగా తన భజన సంకీర్తనల బకాయిలు కూడా చెల్లించకుండా దిగిపోయారు . అధికారంలో ఉన్నన్నాళ్లు అంతులేని అనవసర వ్యయాలతో ఖాజానాని గుల్ల చేసిన బాబు ఇలాంటి ప్రచారాలకు కూడా తక్కువేమీ ఖర్చు పెట్టలేదు . నాడు పట్టిసీమని , అది నిర్మించిన బాబుని పొగడటానికి అప్పటి రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో రెండు పాటలు రాయించినందుకు ప్రత్యేక జీవో ద్వారా ఏకంగా 20 లక్షలు ఖర్చు చేయడం బాబు గారి ప్రచార కాంక్ష తీవ్రతని , దుబారా తత్వాన్ని తెలియజేస్తుంది .
అలాగే పోలవరం గేట్ల దగ్గర కాంక్రీట్ వేసినప్పుడు టీడీపీ కార్యకర్తల్ని తీర్ధ యాత్రలకు తిప్పినట్టు తిప్పి అక్కడ జయము జయము చంద్రన్న పోలవరము కట్టినావురో అంటూ పాడించుకొన్న సంకీర్తన మీడియాలో , సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా నవ్వుల పాలు కావటానికి దారితీసినా అది కూడా ఓ రకమైన ప్రచారమే అని ఆనందపడి ఎన్నికల ముందు అలాంటి ప్రచారాలు మరింత కొనసాగించి ఆ కళాకారులకు డబ్బివ్వకుండా ప్రభుత్వం నుండి దిగిపోయారు .
ఎన్నికల ఫలితాల తర్వాత డబ్బులు చెల్లించాలని కోరుతూ టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరిగిన వీరిని నువ్వేట్టా ఓడావయ్యా అంటూ సాగిన ఓదార్పు కార్యక్రమంలో కూడా వాడి బాబు గారి దగ్గర కన్నీరు పెట్టించి ఫోటో సెషన్ నడిపారని సమాచారం . ఆ తర్వాత వీరి బకాయిలు చెల్లించకపోగా అవి ప్రభుత్వం తరపున చేసిన ఫ్రోగ్రామ్స్ అని కనుక ప్రభుత్వాన్నే అడగాలి కానీ తమకు సంబంధం లేదని చెప్పి తప్పించుకోగా కొంతకాలం నుండి వీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కనపడ్డవారికల్లా తమ గోడు వెళ్లబోసుకొంటున్నారు .