iDreamPost

‘మాయాబజార్’ ఫెయిలైన 2 సందర్భాలు

‘మాయాబజార్’ ఫెయిలైన 2 సందర్భాలు

మాయాబజార్. ఈ పేరులోనే ఒక మేజిక్ ఉంది. దశాబ్దాలు దాటినా, తెలుగు సినిమా ఎన్ని కొత్త పుంతలు తొక్కినా స్క్రీన్ ప్లే గ్రామర్ కు తిరుగు లేని ఉదాహరణగా ఇప్పటి తరం ఫిలిం మేకర్స్ సైతం గర్వంగా చెప్పుకునే పేరిది. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా ఛానల్ మార్చకుండా అలా చూస్తుండి పోయేలా చేయడం దర్శకులు కెవి రెడ్డి ఇంద్రజాలమే. దిగ్గజాలైన నటులున్నప్పటికీ కేవలం పాత్రలు మాత్రమే కనిపించేలా చేయడం ఆయనకే చెల్లింది. అయితే ఇంతలా చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన మాయాబజార్ టైటిల్ ని పెట్టుకున్న ఇతర దర్శకులు మాత్రం వైఫల్యాన్ని అందుకోవడమే విచిత్రం. అదేంటో చూద్దాం.

1995లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో మాయాబజార్(Maya Bazaar 1995) రూపొందింది. అదే కథకే మాడరన్ టచ్ ఇస్తూ చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇందులో ఆధునిక కృష్ణుడిగా అక్కినేని నాగేశ్వర్రావు గారు నటించడం విశేషం. అభిమన్యుడిగా సుమన్, శశిరేఖగా ఆమనితో పాటు తెరనిండా నటీనటులు చాలామంది కనిపిస్తారు. అయినా జనానికి ఈ మాయాబజార్ ఎక్కలేదు. ఘటోత్ఘచుడిగా దాసరి నటవిశ్వరూపం, మాధవపెద్ది సురేష్ హుషారైన సంగీతం, ఫామ్ లో ఉన్న తోటపల్లి మధు సంభాషణలు, క్రేజీ హీరోయిన్ల క్యామియోలు ఇవేవి సినిమాను కాపాడలేకపోయాయి. ఫైనల్ రిజల్ట్ ఫ్లాప్.

ఆ తర్వాత 2006లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాజా, భూమిక జంటగా మాయాబజార్(mayabazar 2006) వచ్చింది. ఎస్పి బాలసుబ్రమణ్యం కీలక పాత్ర పోషించిన ఈ మాయాబజార్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. టైటిల్ క్రేజ్ కూడా దీనికి ఏ మాత్రం ఉపయోగపడలేదు.కనీసం రెండు వారాలు కూడా ఆడలేక వెనక్కు వచ్చేసింది. ఇలా తెలుగులో రెండు సార్లు మాయాబజార్ ఫెయిల్ కావడం విశేషమే. తమిళ్ లో కూడా 1995లో మాయాబజార్ పేరుతో ఓ హారర్ కామెడీ వచ్చింది కానీ దాని ఫలితం కూడా అంతంత మాత్రమే. ఇలా ఎవర్ గ్రీన్ క్లాసిక్ టైటిల్ వాడుకున్న వాళ్ళందరూ ఒకే తరహా ఫలితాన్ని అందుకోవడమే అసలు ట్విస్ట్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి