iDreamPost

లాక్ డౌన్, జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా అడుగులు …

లాక్ డౌన్, జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా అడుగులు …

దేశంలో ప‌రిస్థితిపై కేంద్రం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ముఖ్యంగా లాక్ డౌన్ కొన‌సాగించాలా లేదా అన్న‌ది అంతుబ‌ట్ట‌ని విష‌యంగా మారింది. ఈవిష‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. చివ‌ర‌కు సీఎంల స‌మావేశంలో కూడా ప్ర‌ధాని ముందు ప‌లు ర‌కాల వాద‌న‌లు వినిపించాయి. దాంతో కేంద్రం మే 3 త‌ర్వాతి ప‌రిస్థితిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌నే దీనిపై కీల‌క అడుగులు వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ప్ర‌పంచంలో అప్ప‌టికే ప‌లు దేశాలు లాక్ డౌన్ ని అనుస‌రిస్తున్న స‌మ‌యంలో మార్చ్ 24 అర్థ‌రాత్రి నుంచి ఇండియాలో కూడా అములోకి తెచ్చారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశంలో లాక్ డౌన్ చిన్న విష‌యం కాదు. అయిన‌ప్ప‌టికీ హ‌ఠాత్తుగా మోడీ ప్ర‌క‌టించిన నిర్ణ‌యం ఏప్రిల్ 14 వ‌ర‌కూ తొలిద‌శ‌లో కొన‌సాగింది. అయితే లాక్ డౌన్ అమ‌లులో ఉన్న‌ప్ప‌టికీ కేసుల సంఖ్య గానీ, మృతుల వివ‌రాలు గానీ అదుపులోకి వ‌చ్చిన దాఖ‌లాలు లేక‌పోవ‌డంతో మెజార్టీ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా మ‌ళ్లీ పొడిగిస్తూ కేంద్రం ప్ర‌క‌ట‌న చేసింది. మే 3 వ‌ర‌కూ రెండో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఆ త‌ర్వాత ఏమిట‌న్న‌దే ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది.

లాక్ డౌన్ విష‌యంలో డబ్ల్యూ హెచ్ ఓ స‌హా వివిధ ప్ర‌ముఖ సంస్థ‌లు, శాస్త్ర‌వేత్త‌లు కూడా భిన్న‌వాద‌నలు వినిపిస్తున్నారు. ఇండియా వంటి దేశాల్లో అది ఉత్త‌మ మార్గం కాద‌ని చెబుతున్నారు. ఇండియా అనుభవం కూడా దాదాపు అలానే ఉంది. సుమారు 40కోట్ల మంది అసంఘ‌టి రంగ కార్మికుల్లో వ‌ల‌స‌కూలీల జీవ‌నం అల్ల‌క‌ల్లోలంగా మారుతోంది. వంద‌ల మంది ప్రాణాలు పోతుండడం క‌ల‌క‌లం రేపుతోంది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వాల‌కు పెనుభారంగా మారుతోంది. అంద‌రికీ ఆదాయ‌మార్గాలు మూసుకోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారబోతోంది. భ‌విష్య‌త్ ప‌ట్ల ఓ ఆందోళ‌న‌ను క‌న‌బ‌రుస్తోంది.

ఇప్ప‌టికే ఈ విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు. క‌రోనా విష‌యంలో దేశంలోనే ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. డేటా ఆధారంగా నిర్ణ‌యాలు అమ‌లు చేస్తున్నారు. రెడ్ జోన్ల ప‌రిధి దాట‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. విస్తృతంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తూ, దానికి త‌గ్గ‌ట్టుగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే స‌మ‌యంలో గ్రీన్ జోన్ల‌లో స‌డ‌లింపు విష‌యంలో ఏప్రిల్ 14కి ముందే ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు. ఆ త‌ర్వాత ఏప్రిల్ 20 నుంచి కేంద్రం ఆ మేర‌కు కొన్ని నిర్ణ‌యాలు అమ‌లు చేసింది. స‌డ‌లింపు అమ‌లులోకి తెచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా పీఎం స‌మ‌క్షంలో జ‌గ‌న్ చేసిన సూచ‌న‌లు దానికి కొన‌సాగింపుగానే ఉన్నాయి. లాక్ డౌన్ విష‌యంలో కొన‌సాగింపు కోసం కొంద‌రు సీఎంలు ప‌ట్టుబ‌డుతుండ‌గా, జ‌గ‌న్ మాత్రం త‌న‌దైన ప‌రిష్కార మార్గాలు సూచిస్తున్నారు. అది ఆచ‌రిస్తే అంద‌రికీ శ్రేయ‌స్క‌రం అంటూ భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ప్ర‌ధానంగా క‌రోనా స‌మ‌స్య దీర్ఘ‌కాలం కొన‌సాగే ప్ర‌మాదం ఉన్నందున దానికి స‌న్న‌ద్ధం కావాల్సి ఉంటుంద‌ని సూచిస్తున్నారు.

ప్ర‌ధాని ముందు త‌న అభిప్రాయాలు వెల్ల‌డించిన జ‌గ‌న్, ఆత‌ర్వాత రాష్ట్ర ప్ర‌జ‌ల ముందు కూడా అలాంటి ఆలోచ‌న‌నే వ్య‌క్త‌ప‌రిచారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ బాట‌లోనే ప‌లు రాష్ట్రాలు ప‌య‌నించే అవ‌కాశం క‌నిపిస్తోంది. తెలంగాణాలో అన‌ధికారికంగా కొంత మేర‌కు స‌డ‌లింపు వైపు ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తుండ‌డం దానికో నిద‌ర్శ‌నం. కేర‌ళ‌లో ఇప్ప‌టికే ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. ఒడిశా వంటి రాష్ట్రాలు కూడా అలాంటి బాట‌లో సాగుతున్నాయి. ఈనేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌లు ఆచ‌ర‌ణ‌లోకి తీసుకొచ్చేందుకు త‌గ్గ‌ట్టుగా కేంద్రం అడుగులు వేయ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. రెడ్ జోన్లు, కంటోన్మెంట్ ఏరియాల్లో మిన‌హా మిగిలిన చోట ద‌క్షిణాఫ్రికా త‌ర‌హాలో స‌డ‌లింపు చేయ‌బోతున్న‌ట్టు భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి