iDreamPost

కరోనా తో ప్రైవేట్ డాక్టర్ మృతి.. కర్నూలులో ఉరుకులు పరుగులు పెడుతున్న అధికారులు..

కరోనా తో ప్రైవేట్ డాక్టర్ మృతి.. కర్నూలులో ఉరుకులు పరుగులు పెడుతున్న అధికారులు..

కర్నూలు నగరంలో ఓ ప్రైవేట్ డాక్టర్ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణానంతరం కరోనా వైరస్ సోకిందని తేలింది. ఆసుపత్రిలో చేరే వరకు సదరు డాక్టర్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లా అధికారులు లో అలజడి మొదలైంది. సదరు డాక్టర్ వద్ద చికిత్స తీసుకున్న వారిని గుర్తించే పనిలో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

కర్నూలు నగరంలో ప్రముఖ ఆస్పత్రులలో కె.ఎమ్ ఆసుపత్రి ఒకటి. ఈ ఆస్పత్రిలో దాదాపు 70 ఏళ్ల సదరు డాక్టర్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. కర్నూలు నగరంలోని పాతబస్తీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్, గద్వాల నుంచి కూడా ప్రజలు ఈ డాక్టర్ వద్దకు చికిత్స కోసం వస్తుంటారు. కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న సదరు డాక్టర్ స్థానికంగా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ నెగిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే రెండు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడటం తో కుటుంబ సభ్యులు డాక్టర్ ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ నుంచి శాంపిల్స్ను సేకరించారు. ఫలితం వచ్చే లోపే సదరు డాక్టర్ ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు. నిర్ధారణ ఫలితాల్లో సదరు డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఈ నెల 11 వ తేదీ వరకు సదరు డాక్టర్ ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ నేపథ్యంలో సదరు డాక్టర్ వద్ద చికిత్స తీసుకున్న వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు సదరు డాక్టర్ వద్ద వైద్య చికిత్స తీసుకున్న వారందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సదరు డాక్టర్ వద్ద దాదాపు 800 మంది వైద్య చికిత్స తీసుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరిని నేరుగా గుర్తించడం కష్టమవుతుంది కాబట్టి ఆ డాక్టర్ వద్దకు చికిత్స కోసం వచ్చిన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు పదే పదే కోరుతున్నారు. లేదంటే వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువుల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రి సిబ్బందిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి