iDreamPost

మోడీ చెప్తే బీజేపీ ముఖ్యమంత్రే వినలేదు,ఇక ప్రజలెందుకు వింటారు…?

మోడీ చెప్తే  బీజేపీ ముఖ్యమంత్రే వినలేదు,ఇక ప్రజలెందుకు వింటారు…?

ఒకపక్క ప్రభుత్వం సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు చెప్తున్నా, వైరస్ వ్యాపించకుండా ప్రధాని మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించినా, వివాహాలు వాయిదా వేసుకోవాలని నిపుణులు పిలుపునిచ్చినా, ఒకవేళ వివాహం చేసుకున్నా అతిథుల సంఖ్యను 100 లోపే ఉండేలా చూసుకోవాలని వైద్యులు మొత్తుకుంటున్న కొందరు నాయకులకు ఇవేమీ పట్టడం లేదు.

ఈ నిబంధనలు కేవలం సామాన్యులకు మాత్రమే అని కొందరు నాయకుల అభిప్రాయంగా కనిపిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిరూపించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఎక్కువమంది హాజరయిన ఒక వివాహ కార్యక్రమానికి యడ్యూరప్ప అతిథిగా హాజరు కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కర్ణాటక బిజెపి ఎంఎల్‌సి మహంతేష్ కవతాగిమత్ కుమార్తె వివాహ వేడుకలకు యడ్యూరప్ప హాజరయ్యారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో సుమారు 3000 మంది అతిధులు హాజరైనట్లు అంచనా. సాధ్యమైతే వివాహ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని, లేకుంటే 100 లోపు అతిథులను మాత్రమే ఆహ్వానించాలని ప్రభుత్వం నిబంధనలు విధించినా ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉండి వివాహ కార్యక్రమాలకు సీఎం యడ్యూరప్ప హాజరు కావడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రెండు వాష్ బేసిన్స్ తో పాటుగా పలు హాండ్ సానిటైజర్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు కరోనా వైరస్ కట్టడి గురించి రెండు పెద్ద బ్యానర్లు వివాహ కార్యక్రమ ప్రాంగణం బయట ఏర్పాటు చేయడం కొసమెరుపు.

సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవిలో ఉండి, తానే రాష్ట్రంలో నిబంధనలు విధించి ఆ నిబంధనలు తుంగలో తొక్కుతూ పాటించకుండా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్న సీఎం యడ్యూరప్ప వైఖరిపై అన్నివైపులా నుండి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నిబంధనలు పాటించకుంటే సామాన్య ప్రజల ఎలా పాటిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దాదాపు 3000 మంది హాజరయిన ఈ కార్యక్రమంలో ఎవరి ద్వారా అయినా వైరస్ వ్యాపిస్తే పరిస్థితి ఏంటి అనేది ఊహలకు అందదు..

కాగా దేశంలో తొలి కరోనా మరణం కర్ణాటక రాష్ట్రం సంభవించింది. దాంతో కర్ణాటకలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప లాక్ డౌన్ విధించారు. దేశవ్యాప్తంగా 1071 కరోనా కేసులు నమోదవగా 29 మంది మృత్యువాత పడ్డారు. కరోనాను కట్టడి చేయడానికి యడ్యూరప్ప ఆల్ పార్టీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి