iDreamPost

K.G.F: Chapter 2 కెజిఎఫ్ 2 బిజినెస్ ఎన్ని కోట్లు

K.G.F: Chapter 2 కెజిఎఫ్ 2 బిజినెస్ ఎన్ని కోట్లు

ఒక బ్లాక్ బస్టర్ యెక్క ప్రభావం దాని సీక్వెల్ మీద ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి కెజిఎఫ్ 2ని మించిన ఉదాహరణ అక్కర్లేదు. మూడేళ్ళ క్రితం అంచనాలు లేకుండా విడుదలై తెలుగు రాష్ట్రాల్లో కేవలం డబ్బింగ్ వెర్షన్ తోనే 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ శాండల్ వుడ్ సెన్సేషన్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఈ నెల 14న విడుదల కాబోతున్న చాప్టర్ 2 మీద డిస్ట్రిబ్యూటర్లు భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఏపి తెలంగాణ కలిపి 100 కోట్లకు పైగా దీని మీద రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక్కడి కొందరు స్టార్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా యష్ మీద కోట్లను ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ఒక్క నైజామ్ లోనే 50 కోట్లను అడ్వాన్స్ పద్ధతి మీద డీల్ చేసినట్టు ట్రేడ్ టాక్. ఒకవేళ అనూహ్యంగా ఏదైనా ప్రతికూల ఫలితం వస్తే దీని నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న సలార్ తో అడ్జస్ట్ చేసే విధంగా అంతర్గత ఒప్పందం జరిగినట్టుగా చెబుతున్నారు. సీడెడ్ లోనూ రికార్డు స్థాయిలో హక్కులు సొంతం చేసుకున్నారు పంపిణీదారులు. ఆర్ఆర్ఆర్ కు వచ్చిన వసూళ్లు చూసి కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడతారని ఋజువు కావడంతో ఎంత మొత్తమైనా సరే రెడీ అవుతున్నారు. 13న బీస్ట్ ఉన్నప్పటికీ దాని తాలూకు ప్రభావం అంతగా కనిపించడం లేదు.

ఇక ఏరియాల వారిగా బిజినెస్ అంచనా ఇలా ఉంది

నైజామ్ – 50 కోట్లు
సీడెడ్ – 20 కోట్లు
ఉత్తరాంధ్ర – 10 కోట్లు
గుంటూరు – 8 కోట్లు
ఈస్ట్ గోదావరి – 8 కోట్లు
వెస్ట్ గోదావరి – 7 కోట్లు
కృష్ణా – 6 కోట్లు
నెల్లూరు – 3 కోట్ల 50 లక్షలు

ఏపి తెలంగాణ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ – 112 కోట్ల 50 లక్షలు

ఎలా చూసుకున్నా ఒక కన్నడ డబ్బింగ్ సినిమాకు టాలీవుడ్లో ఇది ఎవర్ గ్రీన్ రికార్డు. కెజిఎఫ్ 1తో పోల్చుకుని చూసినా పదింతలు ఎక్కువగా ధర పలికింది. ఈ లెక్కన యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప చాప్టర్ 2 బ్రేక్ ఈవెన్ చేరుకోలేదు. ప్రమోషన్లు ఇంకా వేగమందుకోలేదు. ఓ 50 రూపాయల దాకా టికెట్ హైక్ కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అనువదించిన మూవీకి అనుమతి ఇస్తారా అంటే గతంలో రోబో, 2.0 లాంటి వాటికి దక్కింది కాబట్టి ఛాన్స్ ఉంది. ట్రిపులార్ కి జేబుల్లో నుంచి భారీగా ఖర్చు పెట్టుకున్న మన ఆడియన్స్ ఇప్పుడీ కెజిఎఫ్ 2ని కూడా అదే స్థాయిలో ఆదరిస్తారా లేదా అనేది వేచి చూడాలి

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి