iDreamPost
android-app
ios-app

TDPని భయపెడుతున్న తెలంగాణలోని జనసేన సీట్ల లెక్క!

TDPని భయపెడుతున్న తెలంగాణలోని జనసేన సీట్ల లెక్క!

ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఒక‌రిపై ఒకరు తీవ్ర విమ‌ర్శలు చేసుకుంటున్నారు. చివ‌ర‌కు వ్యక్తిగ‌త విమ‌ర్శల‌కు సైతం వెనుకాడ్డం లేదు నేతలు. ఈక్రమంలోనే జనసేన సైతం నేనున్నాను అంటూ ముందుకు వచ్చింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసి..వైసీపీని ఓడిస్తామంటున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ తో రెండు పార్టీలకు పవన్ కల్యాణే కీలకంగా మారారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తాము పోటీ చేసే సీట్లను జనసేన ప్రకటించింది. తెలంగాణలోని జనసేన సీట్ల లెక్క ఇప్పుడు టీడీపీని భయపెడుతున్నట్లు పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి కార్యక్రమాల్లో బిజీ  బిజీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో జనసేన కూడా నేనున్నాను అంటూ పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాల్లో నిలుస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర జనసేన ఇన్ ఛార్జీ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. పోటీ చేసే స్థానాలను కూడా ఆయనే ప్రకటించడం విశేషం. ఈ ప్రకటనే ఇప్పుడు ఏపీలో టీడీపీని భయపెడుతుందంట. ఏమీ లేని తెలంగాణలోనే 32 స్థానాల్లో  జనసేన బరిలో ఉంటే, కాస్త బలంగా ఉన్న ఏపీలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే చర్చ అందరిలో మొదలైంది.

తెలంగాణలో 119 స్థానాలకు గాను 32 స్థానాలు పోటీ చేస్తుంది. అంటే దాదాపు 25 శాతానికిపై స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది.  ఆ లెక్కన చూసిన ఏపీలో కనీసం 50 స్థానాలకు తగ్గకుండా జనసేన పోటీ చేసే అవకాశం ఉందని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. అంతకంటే తక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేస్తే, తమ ఆత్మగౌరవాన్నిటీడీపీ ముందు తాకట్టు పెట్టడమే అవుతుందని జనసేన నాయకులు, కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. ఇలా జనసేన నాయకులు ఉంటే, తెలంగాణ సీట్ల లెక్క ఏపీ టీడీపీని భయపెడుతుందంట. ఏపీలో జనసేన ఎన్ని సీట్లు అడుగుతుందో అనే భయం వెంటాడుతోంది. గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే  పొత్తు ఉంటుందని ఇప్పటికే అనేక సార్లు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పవన్ కల్యాణ్ లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్లే సాహసం చేయలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అసలు పవన్ కల్యాణ్ తెలంగాణలో  32 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించడం, ఏపీలో కనీసం 50 సీట్లు తక్కువ కాకుండా పోటీ చేస్తామనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడనే వార్తలు వినిపిస్తోన్నాయి. టీడీపీ కూడా అదే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేనకు వారి ఓటింగ్ శాతం బట్టి 20 నుంచి 25 సీట్లు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.  ఇదే సమయంలో 50 కంటే తక్కువ సీట్లు దక్కించుకుంటే పొత్తుకు అర్థమే లేదనే భావనలో జనసేన ఉందని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. చివరకి ఏమవుతుందో చూడాలి. మరి.. తెలంగాణలోని జనసేన సీట్ల లెక్కలు టీడీపీని భయపెడుతున్నాయంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.