iDreamPost

పవన్‌ కళ్యాణ్‌ సంచలన ప్రకటన.. ‘టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదు’

  • Published Jan 26, 2024 | 12:03 PMUpdated Jan 26, 2024 | 12:03 PM

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని అన్నారు. ఆ వివరాలు..

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని అన్నారు. ఆ వివరాలు..

  • Published Jan 26, 2024 | 12:03 PMUpdated Jan 26, 2024 | 12:03 PM
పవన్‌ కళ్యాణ్‌ సంచలన ప్రకటన.. ‘టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదు’

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎలక్షన్‌ కోసం అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ, జనసేన కూటమిగా కలిసి పోటీ చేస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది అనే ప్రచారం తెర మీదకు వచ్చింది. రానున్న ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయం సాధించి క్లీన్‌ స్వీప్‌ చేసి అధికారంలోకి రావాలని గట్టిగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కార్యచరణ ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఇక అధికార పార్టీ ఎన్నికల కోసం దూకుడుగా ముందుకు సాగుతుండగా.. టీడీపీ-జనసేన కూటమి పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.

ఇంకా సీట్ల పంపిణీ కొలిక్కి రాలేదు. పైగా పొత్తు గురించి ప్రకటించిన నాటి నుంచి ఇరు పార్టీల నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదు అన్నారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..

టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని పవన్‌ తప్పుబట్టారు. అంతేకాక చంద్రబాబుకు పోటీగా.. రాబోయే ఎన్నికల కోసం రెండు స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని తెలపడమే కాక.. ఆ స్థానాలే ఏవో ప్రకటించారు పవన్‌ కళ్యాణ్‌. ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించి టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు పవన్‌ కళ్యాణ్‌. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ సమయంలో పవన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు.. అవి ధర్మం పాటించాలి. కానీ, టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. పొత్తులపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. లోకేష్‌ సీఎం పదవిపై మాట్లాడినా నేను మౌనంగానే ఉన్నాను. కానీ వాళ్లు పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేం రెండు సీట్లు ప్రకటిస్తాం. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే మేమూ రెండు సీట్లు ప్రకటిస్తున్నాం’’ అన్నారు పవన్‌ కళ్యాణ్‌.

అంతేకాక‘‘పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. అభ్యర్థుల ప్రకటన వల్ల జనసేనలో ఆందోళన చెలరేగింది. దీనిపై నన్ను ప్రశ్నించిన పార్టీ నేతలకు నా క్షమాపణలు. జనసేన నుంచి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాంగానీ.. తీసుకునే వాళ్లం కాలేకపోతున్నాం. ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేయడం కోసం జనసేన 50, 70 స్థానాలు తీసుకోవాలని.. నాకు తెలియనివికావు. కానీ ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయిగానీ అధికారంలోకి వస్తామోరామో తెలియదు. పవన్‌ జనంలో తిరగడు.. వాస్తవాలు తెలియవని కొందరు అంటున్నారు. తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం.. విడదీయడం తేలిక. అందుకే నాకు నిర్మించడం ఇష్టం’’ అంటూ వ్యాఖ్యానించారాయన.

జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ.. దాన్ని లెక్కచేయకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును ఏకపక్షంగా ప్రకటించారు. అలాగే అరకు అభ్యర్థి విషయంలో కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అంతటితో ఆగకక మరికొన్ని చోట్ల కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమయ్యారు చంద్రబాబు. టీడీపీ అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్నే తాజాగా పవన్‌ కళ్యాణ్‌ వ్యతిరేకించారు. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి