iDreamPost

ప్రపంచ అత్యుత్తమ రాజధాని.. టిడిపి ఇన్సైడర్ ట్రేడింగ్..

ప్రపంచ అత్యుత్తమ రాజధాని.. టిడిపి ఇన్సైడర్ ట్రేడింగ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భారీ భూ కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారిందా.. ప్రపంచ అత్యుత్తమ రాజధాని కాస్త ప్రపంచ అవినీతి కుబేరుల నిలయంగా నిలిచిందా.. ఏడు కోట్ల ఆంధ్రుల కలల రాజధానిపై భూ భకాసురులు ఏ విధంగా విరుచుకుపడ్డారు.

ఒక వ్యక్తి ఒక ఎకరం భూమి కొనుగోలు చేసాడు. ఆ వ్యక్తి భూమి కొనుగోలు చేసిన ప్రాతంలో ఉన్నట్టుండి ప్రభుత్వం అబివృద్ది చేసేందుకు ఎంపిక చేసింది. ఎకరం 5 లక్షలు పెట్టి కొన్న భూమి ఇప్పుడు 50 లక్షలు పలుకుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే అసలు విషయం మొదలవుతోంది. ఎకరం 5 లక్షలు పెట్టి కొన్న వ్యక్తికి అక్కడ ప్రభుత్వం భూమి కొనుగోలు చేస్తుందని ముందే తెలిసి ఉంటే.. అక్కడ కొనింది ఎకరం కాకుండా కొన్ని వేల ఎకరాలు అయి ఉంటే.. వినడానికే భయంగా ఆశర్యంగా ఉంది కదూ.

అవును ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే జరిగినట్లు తెలుస్తోంది. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అచ్చం పైన మనం చదివినట్లే జరిగినట్లు కనిపిస్తుంది. హైదరాబాద్ రాజధానిని కోల్పోయిన నవ్యాంధ్రప్రదేశ్ లో నూతనంగా వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో రాజధానిని ఎంపిక చేసేందుకు పెద్ద కసరత్తులే చేసింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మించుకోవాలని అప్పుడే మనం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీగా ఉంటామని చంద్రబాబు చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాజధాని ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ నివేదిక రాకముందే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు.

మొదట్లో గుంటూరు, నూజివీడు ప్రాంతాలలో రాష్ట్ర రాజధాని నిర్మిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అంతలోనే ఆశావహులు చాలా మంది ఆ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. రాజధానిలో భూమి ఉంటే బాగుపడినట్లే అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. రాజధానిని తుళ్లూరు ప్రాంతంలో పెడతామని చెప్పింది. అంతటితో ఆగకుండా ప్రపంచ అత్యున్నత రాజధానిగా నిర్మించేందుకు 33వేల ఎకరాలు కావాలని రైతుల నుండి భూమిని సేకరించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది.

అవును రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కోసం భూమిని కొనుగోలు చేసింది. వెయ్యి కాదు రెండు వేలు కాదు ఏకంగా 33 వేల ఎకరాలు రైతుల నుండి తీసుకుంది. 2014లో ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని ప్రకటించకముందే టిడిపికి చెందిన నేతల్లో చాలామంది ఇక్కడ భారీగా భూములు కొనేశారు. అక్కడ ఎక్కడో రాజధాని వస్తుందని అందరూ అయోమయంలో ఉన్న సమయాన్ని చాలా చాకచక్యంగా ఉపయోగించుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు రెండో వ్యక్తికి తెలియకుండా ఎకరాలకు ఎకరాలు కొని గమ్మున కూర్చుండి పోయారు. తీరా రాజధాని ఇక్కడ పెడతామని ప్రకటించేసాక మనకు ముందే తెలుసుగా అని మనసులోనే నవ్వుకుని తెగ సంబర పడిపోయారు.

రాజధాని ప్రాంతంలో భూములు కొన్న వారులో రాజకీయ ప్రముఖులు, వారి బినామిలు, వారికి చెందిన కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ 14.22 ఎకరాలు కొనేసింది. కంటేరు గ్రామంలోని 27/3 ఏ సర్వే నంబర్ లో 1 ఎకరా, 27/3బి 28/ 2ఏ సర్వే నంబర్ లో 1.15 ఎకరాలు, 56 సర్వే నంబర్ లో 4.4 ఎకరాలు, 62/22బిలో 2 ఎకరాలు, 63/1 సర్వే నంబర్ లో 2.93 ఎకరాలు, 63/2బిలో 2.70 ఎకరాలు ఇలా మొత్తం 14.22 ఎకరాలు ముందస్తు ప్రణాళికలో భాగంగా కొనిపెట్టుకున్నారు. మాజీ మంత్రి పి. నారాయణ తన బంధువుల పేర్ల మీద 55. 27 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈయన ఆవుల ముని శంకర్, రావుల సాంబ శివ రావు, ప్రమీల పేర్ల మీద ఈ భూములు కొన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాల భూమిని కొన్నారు. గుమ్మడి సురేష్ పేరు మీద ఈయన భూమి కొన్నారు. రావెల కిషోర్ బాబు తనకు చెందిన సంస్థ అయిన మైత్రి ఇన్ఫ్రా పేరు మీద 40.85 ఎకరాలు కొనేశారు. ఎమ్మెల్యే ఙివిఎస్ ఆంజనేయులు లక్ష్మీ సౌజన్య పేరుతో 37.84 ఎకరాలు, పయ్యావుల కేశవ్ పయ్యావుల శ్రీనివాస్, వేం నరేందర్ రెడ్డి పేర్లపై 15.30 ఎకరాలు, పల్లె రఘునాథరెడ్డి కొడుకు వెంకట కిషోర్ రెడ్డి పేరు మీద 7.56 ఎకరాలు కొన్నారు. ఇక నారా లోకేష్ కు బాగా కావలసిన వ్యక్తి అయిన వేమూరి రవి కుమార్ పేరు పై 25.68 ఎకరాల భూమి ఉంది. ఇక లింగమనేని రమేష్ భారీగా 350 ఎకరాల భూమిని కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు ఇదే లింగమనేని కి చెందిన ఇంట్లోనే ఉన్నారు.

వీరితో పాటు యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ 7 ఎకరాలు, కోడెల శివ ప్రసాద్ షష్టి ఇన్ఫ్రా పేరు పై 17.13 ఎకరాలు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ధూళిపాళ్ళ వైష్ణవి, పుల్లయ్య పేర్ల మీద 13.50 ఎకరాలు కొనుగోలు చేశారు. పరిటాల సునీత కూతురు భర్త పేరు మీద భూమి కొన్నారు. మొత్తం 4070 ఎకరాలు ముందుగానే కొనేశారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న జిల్లాలోని టిడిపి నాయకులంతా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అప్పట్లోనే భూములు కొనేశారు.

ఇదే ఇన్సైడర్ ట్రేడింగ్.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అక్రమంగా ముందే తెలుసుకొని అదే ప్రాంతంలో తక్కువ ధరకు భూములు కొని భారీగా లాభాలు ఆర్జించారు మన తెలుగుదేశం పార్టీ నేతలు. రాష్ట్రం అభివృద్ధి లో ముందుండి పనిచేయాల్సిన నేతలంతా ఇలా అక్రమంగా కోట్లు సంపాదించుకునేందుకు ప్రజల రాజధాని అంటు చెప్పుకుంటూ ఇలా భారీగా సంపాదించుకున్నారు. వీరిలో కొందరి భూములు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం తీసుకుంది. మరికొందరివి తీసుకోకుండా అలాగే పక్కనే ఉంచింది.

33వేల ఎకరాల భూమిని తీసుకున్న చంద్రబాబు ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రపంచంలో ఎవ్వరు చెయ్యని అక్రమాలను దగ్గరుండి ప్రోత్సహించారు. చెన్నైలో 426 చదరపు కిలో మీటర్ల లో రాజధాని ఉంది. కలకత్తా లో 1886 చదరపు కిలో మీటర్ల లో, ఢిల్లీలో 1397 చదరపు కిలో మీటర్ల వ్యవధిలో రాజధాని ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం 8వేల చదరపు కిలో మీటర్ల ప్రాంతం తీసుకున్నారు. కేవలం తనకు కావలసిన, అనుకూలంగా ఉన్న వ్యక్తులందరికి భారీగా లబ్ది చేకూర్చాలని ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారని స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఒక రాజధానిని నిర్ణయించాలంటే రాజ్యాంగ బద్దంగా నిర్ణయించాలని చెబుతారు. మరి ఈ రాజధానిని నిర్ణయించిన విధానం ఏ విధంగా సేకరించారో తెలియదు.

33 వేల ఎకరాల భూమని తీసుకొని ప్రజలకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆంధ్రుల కలల రాజధాని ప్రజలు మెచ్చేదిగా ఉండాల్సింది పోయి చివరకు తీవ్ర చర్చకు దారితీస్తుండటం మన దురదృష్టకరం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి