iDreamPost

రూ.60 లక్షలు, 97 తులాల బంగారం దోపిడి.. KCR అన్న కొడుకుపై కేసు

  • Published Apr 18, 2024 | 2:57 PMUpdated Apr 18, 2024 | 2:57 PM

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కుమారుడు కన్నారావు మీద మరో కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుడి కుమారుడు కన్నారావు మీద మరో కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..

  • Published Apr 18, 2024 | 2:57 PMUpdated Apr 18, 2024 | 2:57 PM
రూ.60 లక్షలు, 97 తులాల బంగారం దోపిడి.. KCR అన్న కొడుకుపై కేసు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో భారీ దోపిడి కేసులో కేసీఆర్ అన్న కొడుకు మీద కేసు నమోదయ్యింది. ఆ వివరాలు.. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నరావుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే హైదరాబాద్ శివారు ఆదిభట్ల భూవివాదానికి సంబంధించి కేసు నమోదు కాగా.. తాజాగా అతడిపై భారీ దోపిడీ కేసు ఫైల్ అయింది. అతడితో పాటు మరో ఐదుగురి మీద కూడా బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు కన్నారావు, ఇతరులపై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. తనను గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి దాడి చేశారని అందులో పేర్కొన్నాడు. అంతేకాక కన్నారావు మరో మహిళతో కలిసి తన వద్ద భారీగా బంగారం, నగదు దోచుకున్నట్లు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకు తెలిపాడు.

Case against KCR's son

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ సమస్య పరిష్కారం కోసం కొన్ని రోజుల క్రితం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విజయవర్ధన్ రావు తనకు న్యాయం చేయాలని కోరుతూ కన్నారావును సంప్రదించాడు. కన్నారావుకు పరిచయస్తురాలైన బిందు మాధవి అలియాస్ నందిని ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వద్ద భారీగా నగలు, నగదు ఉన్నాయన్న విషయం కన్నారావుకు తెలిసింది. ఈ క్రమంలో సమస్య పరిష్కారం కోసం తన వద్దకు వచ్చిన విజయవర్ధన్ రావును.. నందిని, మరి కొందరితో కలిసి తన గెస్ట్‌ హౌస్‌లో అక్రమంగా నిర్బంధించాడు కన్నారావు. అనంతరం అతడిని బెదిరించి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడు.

తనకు తెలంగాణ పోలీసు శాఖలో ఉన్నతాధికారులు తెలుసునంటూ ఓ ఇద్దరి పేర్లు చెబుతూ కన్నారావు తనను బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే భూవివాదం కేసులో ఇరుక్కున్న కన్నారావుపై ఇప్పుడు ఇంత భారీ దోపిడీ కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి