iDreamPost

మళ్లీ మిడతల దండు-నాగ్‌పూర్‌ చేరుకున్న మిడతలు

మళ్లీ మిడతల దండు-నాగ్‌పూర్‌ చేరుకున్న మిడతలు

 తెలంగాణలో ఎనిమిది జిల్లాకు పొంచి ఉన్న ప్రమాదం

దేశంలో మళ్ళీ మిడతల దండు కలకలం సృష్టిస్తుంది. ఇటీవలి వచ్చి వినుదిరిగాయని అందరూ భావించారు. కానీ మిడతల దండు మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పటికే మహారాష్ట్రకు చేరుకున్న మిడతల దండు…దాని ప్రమాదం తెలంగాణపై పడనుంది.

పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ జాతీయ పార్క్‌ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాకు ఎడారి మిడతల దండు చేరుకుంది. జిల్లాలోని అజ్ని గ్రామంలోకి మిడతల దండు ప్రవేశించిందని, పంటలు, చెట్లపై డ్రోన్ల సహాయంతో పురుగు మందులను పిచకారీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌కు మిడతల దండు చేరుకున్నా అది రక్షిత ప్రాంతం కావడంతో పురుగులు మందులు చల్లడానికి వీలు కాలేదు. అజ్ని గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సమక్షంలో పురుగులు మందులు పిచకారీ చేసినట్లు తెలిపారు.

అయితే ఈ మిడతల ప్రభావం తెలంగాణ పై పడనుంది. ఎందుకంటే మహారాష్ట్రకు తెలంగాణ సరిహద్దు రాష్ట్రం కనుక…అక్కడ నుంచి తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు ప్రమాదం పొంచి ఉంది.

మిడతల దండుపై వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశించారు. తెలంగాణకు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని అజ్ని అనే గ్రామం దగ్గర మిడతల దండు ఉందని, ఈ మిడతలు దక్షిణ దిశగా సాగితే తక్కువ సమయంలోనే తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తెలిపారు.

అదే జరిగితే ఈ నెల 20 నుంచి జులై 5 మధ్యలో తెలంగాణలోకి మిడతలు రావచ్చని అంచనా వేశారు. భద్రాచలం, వెంకటాపురం, చర్ల, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్‌, బోధన్‌, జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాల నుంచి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉందని కెసిఆర్‌ చెప్పారు.

ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ, తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మిడతలు దాడి చేస్తే భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి