iDreamPost

Delhi Crime season 2 ఢిల్లీ క్రైమ్ 2 రిపోర్ట్

Delhi Crime season 2 ఢిల్లీ క్రైమ్ 2 రిపోర్ట్

నాలుగేళ్ల క్రితం 2019లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఢిల్లీ క్రైమ్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నిర్భయ గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని దాని తాలూకు విచారణను కళ్ళకు కట్టినట్టు చూపించిన తీరు ఆడియన్స్ మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ టాప్ మోస్ట్ వెబ్ సిరీస్ లో దాని చోటు పదిలంగా ఉంది. ఇటీవలే సెకండ్ సీజన్ ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. క్యాస్టింగ్ రిపీట్ అయ్యింది కానీ దర్శకుడితో సహా కొంత టెక్నికల్ టీమ్ మారింది. ప్రకటించినప్పటి నుంచే దీని మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి హైప్ కు తగ్గట్టు ఈసారి కూడా వ్యూయర్స్ ని మెప్పించిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం.

దేశ రాజధానిలో ఒంటరిగా జీవిస్తున్న ధనవంతులైన వృద్ధ దంపతులు అతి దారుణంగా హత్యకు గురవుతుంటారు. డబ్బు, నగలు దొంగతనం చేసి దుండగులు ఏ క్లూ వదిలిపెట్టకుండా పోలీసులకు సవాల్ విసురుతారు. ఈ కేసుని ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది డిసిపి వర్తికా చతుర్వేది(షెఫాలీ షా). 90 దశకంలో ఇలాంటి సీరియల్ కిల్లింగ్స్ చేసిన కచ్చా బనియన్ గ్యాంగ్ పనిగా తొలుత భావించినప్పటికీ దీని వెనుక ముగ్గురు యువకులు, బ్యూటీ పార్లర్లో పనిచేసే ఓ అమ్మాయి ఉందని తెలుస్తుంది. కానీ వాళ్ళ జాడ అంత సులభంగా దొరకదు. మరి తన టీమ్ తో కలిసి వర్తికా వాళ్ళను ఎలా పట్టుకుంది, వాళ్లేమయ్యారు అనేది సిరీస్ లోనే చూడాలి.

లైన్ బాగానే ఉన్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు తనూజ్ చోప్రా తడబడ్డాడు. టేకాఫ్ ఇంటరెస్టింగ్ గానే మొదలైనా కథాక్రమం గడిచే కొద్ది థ్రిల్ ఫ్యాక్టర్ తగ్గుతూ పోయింది. కీలకమైన ట్విస్టులను కిక్ ఇచ్చేలా తీర్చిదిద్దలేకపోయారు. పైగా డిపార్ట్ మెంట్ లో ఉన్న అంతర్గత సమస్యలను ముడిపెట్టి కొంత సందేశం కలుపుతూ కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఫస్ట్ సీజన్ రేంజ్ లో ఊహించుకుంటే నిరాశ తప్పదు కానీ దాంతో పోల్చుకోకుండా చూస్తే జస్ట్ ఓకే అనిపిస్తుంది. కేవలం 5 ఎపిసోడ్లతో అతి సాగతీత లేకుండా వేగంగా ముగించే ప్రయత్నం చేయడం ఒక్కటే ఢిల్లీ క్రైమ్ 2లో పాజిటివ్ అంశం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి