iDreamPost

అలవాటైన బాటనే నమ్ముకున్న బీజేపీ

అలవాటైన బాటనే నమ్ముకున్న బీజేపీ

మనకు బాగా అలవాటైన దారిలో వెళ్ళడమే సులభంగా అన్పిస్తుంటుంది. ఎన్నికల్లో ఒక్కోసారి ఇలా సులభమైన దారిలో ప్రయాణించడానికే పలు పార్టీలు, నాయకులు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది జనాన్ని ఎంత వరకు ఆకట్టుకుంటుందన్నది తేలాలంటే ఎన్నికల్లో విజయమే గీటు రాయి అవుతుంది. ప్రస్తుతం తెలంగాణాలో జీహెచ్‌యంసీ ఎన్నికల వేడి ముమ్మరంగానే పెరిగిపోతోంది. అన్ని పార్టీల నాయకులు తమ ప్రత్యర్ధులను నోటికొచ్చిన పాండిత్యాన్నంతా ఉపయోగించి ఆడేసుకుంటున్నారు. ఇదే రీతిలో బీజేపీ కూడా తమకు అత్యంత ఇష్టమైన అంశాన్నే భుజానికెత్తుకుంది. బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రసంగాల ద్వారా తాము హిందూత్వ అజెండాతోనే ఎన్నికలను ఫేస్‌ చేయనున్నట్లు చెప్పకనే చెప్పేసారు.

ఛార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ళడం, అప్పుడెప్పుడో పక్కన పెట్టేసిన రోహింగ్యాల వ్యవహారాన్ని కదపడం, అధికార టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి మీరు ముస్లింల గురించి మాట్లాడినప్పుడు మేం హిందువల గురించి మాట్లాడితే తప్పా అంటూ మీడియా ముందుకు రావడం గమనిస్తే తమకు అత్యంత అలవాటైన, సులభమైనదని భావిస్తున్న హిందూత్వ అజెండానే గ్రేటర్‌ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంసిద్దమైపోయారన్నది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టీఆర్‌ఎస్, యంఐయంలకు ప్రత్యామ్నాంగా ఉన్నది తామేనని, ఆ ట్రేడ్‌ మార్కును సొంతం చేసుకోవడానికే బీజేపీ నాయకత్వం ఈ ప్రయత్నమన్నది ఇప్పటికే ఖరారు చేసేసినట్టే. కాంగ్రెస్‌ను తెలంగాణా వాసులు పెద్దగా పట్టించుకోవడం లేదన్నది కూడా స్పష్టమైపోయింది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ బృందంపై ఉన్న వ్యతిరేక ఓటింగ్, కాంగ్రెస్‌ ఓట్లుకు తోడు బీజేపీ ఓటు బ్యాంకును గంపగుత్తుగా కాపాడుకోవడం ద్వారానే తమ విజయావకాశాలు మెరుగుకాగలవన్నది బీజేపీ నాయకులు అంచనాకొచ్చేసారు.

ఈ నేపథ్యంలోనే తమ ప్రత్యర్ధులకు, తమకు ప్రధాన తేడాను ప్రజలు గుర్తించే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇదే అంశం ప్రజలు ఎంతగా గుర్తిస్తున్నారు, ఆమోదిస్తారు? అన్నదానిపైనే బీజేపీ విజయావకాశాలు ఉంటాయన్న విశ్లేషణ కూడా విన్పిస్తోంది. నిన్న మొన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఏ మీ ఏకపక్షంగా గెలుపొందేయలేదన్నది ఆయా పార్టీలకు పడిన ఓట్లు స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి ఉన్న కో ఆప్షన్‌ ఓట్లు, ఇతర అదనపు ప్రయోజనాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు విజయం నల్లేరుపై నడకే అన్నది ఇప్పటికే పలు అంచనాలు తేల్చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆయన బృందం ఎత్తుకుంటున్న హిందూత్వం ఎంత వరకు విజయతీరాలకు చేరుస్తుందన్నది ఫలితాల తరువాతనే తేలాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి