iDreamPost

కాశ్మీర్‌లో భద్రతా దళాలపై ఉగ్రదాడి

కాశ్మీర్‌లో భద్రతా దళాలపై ఉగ్రదాడి

భారత్‌తో సహా ప్రపంచమంతా కోవిడ్-19పై పోరు సాగిస్తుంటే దాయాది పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు మాత్రం భద్రతా దళాలపై దాడులకు తెగబడుతున్నారు.ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శ్రీనగర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోఫోర్ పట్టణంలో భద్రతా దళాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.ఈ ఉగ్రదాడులలో ముగ్గురు కేంద్ర రిజర్వు పోలీసులు ప్రాణాలు కోల్పోగా,మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ముష్కరుల దాడి సమాచారంతో ఆ ప్రాంతానికి భద్రతా దళాలు హుటాహుటిన చేరుకున్నాయి.దాడికి కారకులైన తీవ్రవాదుల కోసం భద్రతా దళాలు సిఆర్పిఎఫ్,పోలీసులు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.గత వారం రోజులలో కాశ్మీర్ లోయలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడటం ఇది మూడోసారి.

శుక్రవారం కరోనా మహమ్మారిపై పోరులో భారత్ తలమునకలై ఉంటే పాకిస్థాన్‌ మాత్రం ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పనిలో బిజీగా ఉందని భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే విమర్శించారు. భారత సైన్యాధిపతి నరవణే పాకిస్థాన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో కూడా నియంత్రణ రేఖ వెంబడి గత కొన్ని రోజులుగా పాక్‌ దళాలు కాల్పులకు పాల్పడుతూ తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి