జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మండిపడ్డారు. విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు విషం చిమ్ముతున్నారని ఆమె అన్నారు. తాజాగా వైజాగ్‌లో పవన్ పర్యటించడంపై తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రుషికొండలో నిర్మాణాలు చేపట్టేందుకు దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందన్నారు రోజా. హైకోర్టు రూల్స్‌కు లోబడి నిర్మాణాలు కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు. నిర్ణీత విస్తీర్ణంలో కంటే తక్కువ జాగాలోనే కట్టడాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ రుషికొండ నిర్మాణాల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని రోజా సీరియస్ అయ్యారు. సర్కారు భూముల్లో అభివృద్ధి కట్టడాలు కడుతుంటే ఎందుకంత బాధ? అని ఆమె ప్రశ్నించారామె. కోర్టుల కంటే పవన్ కల్యాణ్ గొప్పా? అని క్వశ్చన్ చేశారు. కొండలపై ఏమీ కట్టొద్దని అజ్జానంగా మాట్లాడుతున్నారని చెప్పిన రోజా.. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండల పైనే ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించారు. పవన్ రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో చెప్పలేకపోయారని రోజా చెప్పారు. బోడి ప్రచారాలు చేయడం బోడి వెధవలకు ఫ్యాషన్‌గా మారిపోయిందని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిపై పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ‘ఏపీలో సీఎం జగన్‌కు ఇల్లు ముందు నుంచే ఉంది. తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని పరిపాలనను ఆయన కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పనిచేస్తుంటాడు పవన్. వీళ్లిద్దరికీ ఏపీలో కనీసం ఇల్లు కూడా లేదు’ అని రోజా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని రోజా పేర్కొన్నారు. అసలు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా? అని ఆమె ప్రశ్నించారు.