iDreamPost

ఆంధ్రా క్రికెటర్​కు బంపరాఫర్.. IPL​లో ఆడాల్సిందిగా 2 ఫ్రాంచైజీల నుంచి పిలుపు!

  • Author singhj Published - 05:00 PM, Thu - 21 September 23
  • Author singhj Published - 05:00 PM, Thu - 21 September 23
ఆంధ్రా క్రికెటర్​కు బంపరాఫర్.. IPL​లో ఆడాల్సిందిగా 2 ఫ్రాంచైజీల నుంచి పిలుపు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంతలా ఆధునిక క్రికెట్​పై ఈ టోర్నమెంట్ ప్రభావం చూపిస్తోంది. టెస్టులు, వన్డేలకు అలవాటైన సంప్రదాయ క్రికెట్ అభిమానులకు పొట్టి ఫార్మాట్​లోని అసలైన మజాను రుచి చూపించింది ఐపీఎలే. ఈ మెగా టోర్నీ వల్ల టీ20లకు విశ్వవ్యాప్తంగా క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఐపీఎల్​ సక్సెస్​తో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పొట్టి లీగ్​లు పుట్టుకొచ్చాయి. డబ్బుకు డబ్బు, ఆటగాళ్లకు క్రేజ్ లభిస్తుండటంతో ఇలాంటి టోర్నీల నిర్వహణకు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఐపీఎల్ ద్వారా క్రికెటర్ల సంపాదన పదింతలు అయింది. స్టార్ క్రికెటర్లే కాదు.. డొమెస్టిక్ ప్లేయర్లకు కూడా ఈ లీగ్ వల్ల ఎంతో లాభం చేకూరింది.

ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి వేలంలో వారిని రూ.కోట్లు కుమ్మరించి కొంటున్నాయి ఫ్రాంచైజీలు. అడ్వర్టయిజ్​మెంట్స్, స్పాన్సర్లు, ప్రసార హక్కుల రూపంలో భారత క్రికెట్ బోర్డుపై కూడా కాసుల వర్షం కురుస్తోంది. ఐపీఎల్​లో అద్భుతమైన ప్రదర్శనతో తమ దేశ జాతీయ జట్లలో చోటు దక్కించుకున్న క్రికెటర్లూ ఉన్నారు. ఊరు, పేరు తెలియని ప్లేయర్లు ఈ పొట్టి లీగ్​లో బాగా ఆడి డబ్బులతో పాటు కెరీర్​లో మంచి అవకాశాలు దక్కించుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. డబ్బుతో పాటు పేరుప్రతిష్టలు, జాతీయ జట్టులో చోటు సంపాదించుకునేందుకు ఒక వేదికగా మారిన ఐపీఎల్​లో ఆడాలనేది చాలా మంది ప్లేయర్ల డ్రీమ్. అలాంటి ఒక ఆటగాడి కల ఇప్పుడు నెరవేరబోతోంది.

ఒక ఆంధ్రా క్రికెటర్​ను ఈ అదృష్టం వరించింది. అనంతపురం జిల్లాకు చెందిన వర్ధమాన క్రికెటర్ కేహెచ్ వీరారెడ్డికి అరుదైన ఛాన్స్ దక్కింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్​)లో బెస్ట్ పెర్ఫార్మెన్స్​తో రాయలసీమ కింగ్స్ విజయానికి కారణమైన వీరారెడ్డి.. ఆ టోర్నీలో ఎమర్జింగ్ ప్లేయర్​గా అవార్డు దక్కించుకున్నాడు. రెండో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్​గా రికార్డు కూడా నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అతడికి ఐపీఎల్​లో ఆడే ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. తమ టీమ్​లో ఆడాలంటూ ముంబై ఇండియన్స్​తో పాటు రాజస్థాన్ రాయల్స్ నుంచి వీరారెడ్డికి పిలుపు అందిందట. రాజస్థాన్​ పిలుపుపైనే అతడు మక్కువ చూపిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్​లో గనుక వీరారెడ్డి అరంగేట్రం చేస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మెగా లీగ్​లో ఆడిన తొలి క్రికెటర్​గా ఖ్యాతి గడించడం ఖాయం.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​2023లో నెట్ బౌలర్​గా ఫుడ్ డెలివరీ బాయ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి