iDreamPost

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో నెట్‌ బౌలర్‌గా ఫుడ్‌ డెలివరీ బాయ్‌! సక్సెస్‌ స్టోరీ

  • Published Sep 21, 2023 | 3:41 PMUpdated Sep 22, 2023 | 2:57 PM
  • Published Sep 21, 2023 | 3:41 PMUpdated Sep 22, 2023 | 2:57 PM
వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో నెట్‌ బౌలర్‌గా ఫుడ్‌ డెలివరీ బాయ్‌! సక్సెస్‌ స్టోరీ

క్రికెటర్‌ అవ్వాలని కలలు కనే యువత మన దేశంలో కోట్లలో ఉంటారు. కానీ, కొన్ని సార్లు వారి ఆర్థిక పరిస్థితులు వారి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతాయి. అయితే.. చాలా రేర్‌గా అతి కొద్ది మంది మాత్రమే వారి ప్రతిబంధకాలను సైతం ఛేదించుకుని మరీ.. వారి కలల వైపు అడుగులేస్తారు. అలాంటి ఓ యువకుడికి.. వన్డే వరల్డ్‌ కప్‌ రూపంలో అదృష్టం కూడా కలిసివచ్చింది. క్రికెటర్‌గా సత్తా చాటాలని కలలు కంటూ.. ప్రాక్టీస్‌ చేస్తూ మరోవైపు జీవనోపాధి కోసం స్విగ్గీలో ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా చూస్తూ.. ఇప్పుడు నెదర్లాండ్స్‌ జట్టుకు నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు.

చెన్నైకి చెందిన 29 ఏళ్ల లోకేష్ కుమార్ కాలేజీ చదువు తర్వాత.. క్రికెటర్‌ కావాలనే తన కల కోసం శ్రమించడం మొదలుపెట్టాడు. దాదాపు నాలుగేళ్ల పాటు పూర్తి ఫోకస్‌ క్రికెట్‌పైనే పెట్టాడు. ఆ తర్వాత తన అవసరాల కోసం స్విగ్గీలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా చేరాడు. అయితే.. మరికొన్ని రోజుల్లో మనదేశంలో జరగనున్న వరల్డ్‌ కప్‌లో పాల్గొనేందుకు నెదర్లాండ్స్‌ జట్టు భారత్‌కు వచ్చింది. నెట్స్‌లో తమ బ్యాటర్లకు బంతులు వేస్తూ ప్రాక్టీస్‌ చేయించేందుకు నెట్‌ బౌలర్ల కోసం నెదర్లాండ్స్‌ టీమ్‌ ప్రకటన ఇచ్చింది. అది చూసి లోకేశ్‌ కుమార్‌ సైతం.. తన బౌలింగ్‌ వీడియోను తీసుకుని.. నెదర్లాండ్స్‌ టీమ్‌కు పంపాడు. గంటకు 120 కి.మీ.కుపైగా వేగంతో బంతులేసే పేసర్లు, మిస్టరీ స్పిన్నర్ల కోసం చూస్తున్న నెదర్లాండ్స్ టీమ్‌కు లోకేశ్‌ బౌలింగ్‌ తెగ నచ్చేసింది.

వెంటనే.. లోకేశ్‌కు కబురుపెట్టేసింది. చెన్నై నుంచి అన్నీ సర్దుకుని బెంగుళూరులో తాము ప్రాక్టీస్‌ చేస్తున్న చోటుకు వచ్చేయమని పిలుపువచ్చింది. నెట్‌ బౌలర్‌ కోసం నెదర్లాండ్స్‌ ఇచ్చిన ప్రకటనకు భారత్ నుంచి పది వేల మంది తమ బౌలింగ్ వీడియోలను పంపించారు. వారిలో నలుగురిని ఎంపిక చేశారు. వీరిలో హేమంత్ కుమార్, రాజమణి ప్రసాద్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు కాగా.. హర్ష శర్మ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. ఇక చెన్నైకి చెందిన లోకేష్ కుమార్ మిస్టరీ స్పిన్నర్. 8 ఏళ్ల క్రితం పేసర్‌గా కెరీర్ ప్రారంభించిన లోకేశ్ కుమార్.. అనంతరం మిస్టరీ స్పిన్నర్‌గా మారాడు. ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున ఐదో డివిజన్‌కు ఆడుతున్నాడు. మరి ఫుడ్‌ డెలివరీ బాయ్‌ నుంచి అంతర్జాతీయ జట్టుకు నెట్‌ బౌలర్‌గా లోకేశ్‌ ఎంపిక కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పిల్లలతో కోహ్లీ యాడ్‌! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి