iDreamPost

పోరాట‌ప‌థం.. ప్ర‌జాసంక్షేమం – ప‌దేళ్ల వైఎస్సార్‌సీపీ ప్ర‌స్థానం

పోరాట‌ప‌థం.. ప్ర‌జాసంక్షేమం – ప‌దేళ్ల వైఎస్సార్‌సీపీ ప్ర‌స్థానం

ఒకే ఒక్క యువ‌కుడు.. ఆయ‌న చుట్టూ క్షుద్ర రాజ‌కీయాలు.. సంక్షేమ ఫ‌లాల‌తో ప్ర‌జ‌ల గుండెల్లో కొలువైన ఓ సీఎం అకాల మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక గుండెలు ప‌గిలిన కుటుంబాల‌ను ఆ తండ్రికి త‌న‌యుడిగా ఓదార్చ‌డం త‌న బాధ్య‌త‌గా భావించ‌డ‌మే త‌ప్ప‌న్న‌ట్లు రాష్టం నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆ సంక‌ల్పాన్ని అడ్డుకునేందుకు స‌వాల‌క్ష ల‌క్ష్మ‌ణ‌రేఖ‌లు. వాటిని ధిక్క‌రించి.. పార్టీకి దండం పెట్టి బ‌య‌ట‌కొచ్చేసి.. సింగిల్‌గానే పోరుబాట ప‌ట్టారు. తండ్రి ఆశ‌యాల‌ను నెర‌వేర్చ‌డ‌మే ల‌క్ష్యంగా.. ఆయ‌న అభిమానుల‌ను కాపాడుకోవ‌డ‌మే ధ్యేయంగా దృఢ‌దీక్ష బూనిన ఆ యువ‌నేత వైఎస్ జ‌గ‌న్‌ త‌న ల‌క్ష్య‌సాధ‌న‌కు ఓ జెండా, ఎజెండా ఉండాల‌ని భావించ‌డంతోనే యువ‌జ‌న‌, శ్రామిక‌, రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్‌సీపీ) ఊపిరిపోసుకుంది.

ప‌దేళ్ళ క్రితం స‌రిగ్గా ఇదే రోజు.. అంటే 2011 మార్చి 12న ఇడుపుల‌పాయ‌లో తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మాధి సాక్షిగా.. విలువ‌లు విశ్వ‌స‌నీయ‌తే పెట్టుబ‌డిగా.. ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా.. రాజ‌న్న రాజ్య‌స్థాప‌నే ధ్యేయంగా అంకురించిన వైఎస్సార్‌సీపీని పురిటిద‌శ‌లోనే పుట్టి ముంచేయాల‌ని ఎన్నో కుట్ర‌లు. న‌డ‌క‌లు నేర్వ‌క‌ముందే కాళ్ళు విరగ్గొట్టేసే ఆనాటి పాల‌క‌, ప్ర‌తిప‌క్షాల కుట్ర రాజ‌కీయాలు.. ఆర్థిక మూలాల‌ను దెబ్బ‌తీసే దాడులు.. కేసులు.. వాట‌న్నింటినీ ప్ర‌జాక్షేత్రం నుంచే ఎదుర్కొంటాన‌ని స‌వాల్ చేసి పోరాట‌మే త‌న ప‌థంగా మార్చుకొని.. ప్ర‌జ‌ల‌నే సైన్యంగా చేసుకొని ఎనిమిదేళ్ళ‌ అవిశ్రాంత యుద్ధం చేసిన ఆ యోధుడు చివ‌రికి విజ‌యం సాధించాడు. అవినీతి, అక్ర‌మ సామ్రాజ్యాల‌ను కూక‌టివేళ్ల‌తో కూల్చివేసి.. ప్ర‌జాసంక్షేమ ప్ర‌భుత్వానికి బ‌ల‌మైన పునాది వేశారు. రెండేళ్లుగా విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల‌తో ప్ర‌జాప్ర‌భుత్వ సౌధాన్ని ప‌టిష్టంగా నిర్మిస్తున్నారు.

నిరంత‌ర పోరాటం

నాడు ఓదార్ప‌యాత్ర‌కు నిరాక‌రించినందుకు కాంగ్రెస్‌కు, దాని ద్వారా వ‌చ్చిన ప‌ద‌వుల‌కు 2010 న‌వంబ‌ర్ 29న రాజీనామా చేసిన జ‌గ‌న్.. పార్టీ పెట్ట‌నున్న‌ట్లు అదే ఏడాది డిసెంబ‌ర్ ఏడో తేదీన ప్ర‌క‌టించారు. ప్రజా స‌మ‌స్య‌ల‌పై పోరుకు నాందిగా ఆ ఏడాది డిసెంబ‌ర్ 21 విజ‌య‌వాడ‌లో రైతు, చేనేత‌కారుల స‌మ‌స్య‌ల‌పై 48 గంట‌ల నిరాహార దీక్ష నిర్వ‌హించారు. చెప్పిన‌ట్లే 2011 మార్చి 12న వైఎస్సార్‌సీపీని ఏర్పాటు చేశారు. దాంతో ఆనాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఉన్న కొంద‌రు మంత్రులు, ప‌లువురు ఎమ్మెల్యేలు కొత్త పార్టీలో చేరుతూ.. కాంగ్రెస్ ద్వారా వ‌చ్చిన ప‌ద‌వుల‌ను త్య‌జించారు. ఫ‌లితంగా 2012లో 19 అసెంబ్లీ, ఒక లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఆ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న స‌మ‌యంలోనే అప్ప‌టి పాల‌క‌, ప్ర‌తిప‌క్షాలు కుమ్మ‌క్కై మ‌రో కుట్ర‌కు తెర‌తీశాయి. వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా ఆక్ర‌మంగా ఆర్థిక ల‌బ్ధిపొందారంటూ అప్ప‌టి పాల‌క కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష టీడీపీ కుమ్మ‌క్కై చేసిన త‌ప్పుడు ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ విచార‌ణ పేరుతో పిలిపించి జ‌గ‌న్‌ను అరెస్టు చేశారు. ఏకంగా 16 నెల‌ల‌పాటు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. అయినా జ‌గ‌న్‌పై ప్ర‌జ‌లు న‌మ్మ‌క‌ముంచారు. ఉప ఎన్నిక‌లు జ‌రిగిన 19 అసెంబ్లీ స్థానాల్లో 17 చోట్ల గెలిపించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా క‌డ‌ప లోక్‌స‌భ స్థానంలో నిల‌బ‌డిన స్వ‌యానా త‌న చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద‌రెడ్డిపై జ‌గ‌న్ 5.43 ల‌క్ష‌ల రికార్డు మెజార్టీతో విజ‌య‌దుందుభి మోగించారు.

Also Read : మళ్లీ జనాల్లోకి విస్తృతంగా ముఖ్యమంత్రి

స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర‌

త‌ప్ప‌డు కేసుల ఫ‌లితంగా జైలు పాలై.. 16 నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌కొచ్చిన జ‌గ‌న్ ఆ వెంట‌నే ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్ళారు. 2013లో ఉవ్వెత్తున సాగుతున్న స‌మైక్యాంధ్ర ఉద్యమానికి జ‌గ‌న్ జైకొట్ట‌డ‌మే కాకుండా.. రాష్ట్ర‌వ్యాప్తంగా పార్టీ శ్రేణుల‌ను ఉద్య‌మంలోకి ఉసిగొల్పారు. 2013 అక్టోబ‌ర్ ఐదో తేదీన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను స‌మైక్యంగా ఉంచాల‌న్న డిమాండ్‌తో హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లో స్వ‌యంగా నిర‌స‌న దీక్ష చేశారు. పార్టీ ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించారు.

రాష్ట్ర విభ‌జ‌న‌పై కేంద్రం రాజ‌కీయ పార్టీల అభిప్రాయాలు కోరిన‌ప్పుడు ఆనాటి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపి అధినేత ఆంధ్ర‌, తెలంగాణ రెండు త‌మ పార్టీకి స‌మాన‌మే అంటూ రెండు క‌ళ్ళ సిద్ధాంతాన్ని వ‌ల్లిస్తూ గోడ మీది పిల్లి వాటం ప్ర‌ద‌ర్శించ‌గా.. వైఎస్ జ‌గ‌న్ మాత్రం స‌మైక్యాంధ్ర‌కే త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉందంటూ స్ప‌ష్టంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా.. జ‌న‌సేన‌, టీడీపీలు చేసిన రాజ‌కీయ స‌వాళ్ల‌ను స్వీక‌రించి కేంద్రంలోని అప్ప‌టి యూపీఏ స‌ర్కారుపై వైఎస్సార్‌సీపీ త‌ర‌ఫున అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఆ తీర్మానానికి లోక్‌స‌భ‌లో ప‌లు పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తామ‌ని గొప్ప‌లు చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, టీడీపీ నేత‌లు మొహం చాటేయడంతో అది వీగిపోయింది. మ‌రోవైపు తెలంగాణ ప్రాంతంలో జ‌రుగుతున్న ఉద్య‌మాలు, అక్క‌డి కాంగ్రెస్, టీఆర్ ఎస్ నేత‌ల లాబీయింగ్‌ల‌కు త‌లొగ్గిన కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం అడ్డ‌గోలుగా పార్ల‌మెంటు త‌లుపులు మూసేసి మ‌రీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్వ‌భ‌జ‌న బిల్లును ఆమోదింప‌జేసుకుంది. రాష్ట్రాన్ని విడ‌గొట్టింది. ద‌శాబ్దాల క‌ష్టంతో నిర్మించుకున్న ఆధునిక హైద‌రాబాద్‌ను తెలంగాణ‌కు క‌ట్ట‌బెట్టి నవ్యాంధ్ర‌ను రాజ‌ధాని లేని రాష్ట్రంగా అనాథ‌గా వ‌దిలేసింది. కొత్త రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, రైల్వేజోన్‌, ఎయిమ్స్‌, ప‌లు కేంద్ర విద్యా సంస్థ‌లు వంటి తాయిలాలు ప్ర‌క‌టించింది.

2014 ఎన్నిక‌లు.. తృటిలో త‌ప్పిన అధికారం

విభ‌జ‌నతో గాయంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న న‌వ్యాంధ్ర‌కు ఆ వెంట‌నే ఎన్నిక‌లు వ‌చ్చాయి. వైఎస్సార్‌సీపీ తొలి సార్వ‌త్రిక ఎన్నిక‌ల యుద్ధానికి సింగిల్‌గానే సిద్ధం కాగా.. కాంగ్రెస్ కూడా ఒంట‌రిగానే బ‌రిలోకి దిగింది. కానీ ఆనాటి ప్ర‌తిప‌క్ష నేత, టీడీపీ అధినేత చంద్ర‌బాబు బీజేపీ, జ‌న‌సేన‌ల‌తో జ‌ట్టు క‌ట్టారు. ఆనాటి ఎన్నిక‌ల ప్ర‌చారంలో విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, ఇంకా ఏవేవో చేస్తామ‌ని వాగ్దానాలు చేయ‌డంతోపాటు.. కొత్త రాష్ట్రానికి చంద్రబాబులాంటి అనుభ‌వ‌జ్ఞుడు సీఎంగా ఉంటేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్న నినాదాన్ని ఎత్తుకున్నారు. తొలిసారి.. ఒంట‌రిగా పోటీ చేస్తున్నా తుది వ‌ర‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ 44.47 శాతం ఓట్లు సాధించినా.. ఆ స్థాయిలో సీట్లు మాత్రం సాధించ‌లేక‌పోయింది. 67 ఎమ్మెల్యే, 9 లోక్‌స‌భ సీట్లు సాధించి 1.2 శాతం ఓట్ల తేడాతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఆవిర్భ‌వించింది. అయినా పార్టీ అధినేత జ‌గ‌న్ ఏమాత్రం నిరాశప‌డ‌లేదు. కుంగిపోలేదు. మ‌రింత ఉత్సాహంతో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై అటు చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ.. ఇటు బ‌య‌టా పోరాటాలు చేశారు. అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను, అక్ర‌మాల‌ను నిగ్గ‌దీయడం ప్రారంభించారు.
దాంతో ఉక్క‌రి బిక్కిరి అయిన స‌ర్కారు పెద్ద‌లు చ‌ట్ట‌స‌భ‌ల్లో వైఎస్సార్‌సీపీ గొంతు నొక్క‌డం ప్రారంభించారు. మైకులు ఇవ్వ‌కుండా, మాట్లాడే అవ‌కాశం లేకుండా.. చీటికి మాటికీ స‌స్పెన్ష‌న్లు చేస్తూ త‌మ‌కు ఎదురులేకుండా చేసుకున్నారు.‌

ప్ర‌త్యేక హోదా కోసం పోరు

న‌వీన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ-బీజేపీ కూట‌మి.. త‌ర్వాత మాట మార్చేసింది. న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్ర‌భుత్వం నీతి ఆయోగ్ సిఫార‌సుల‌ను సాకుగా చూపుతూ ప్ర‌త్యేక హోదా ఇచ్చే అవ‌కాశం లేద‌ని తేల్చేసింది. దానికి బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని కొత్త ప్ర‌తిపాద‌న తెర‌పైకి తెచ్చింది. హోదా కోసం ఒత్తిడి చేయాల్సిన చంద్ర‌బాబు.. న‌రేంద్ర మోదీకి ఎదురుచెప్పే ధైర్యం లేక ప్యాకేజీ తాయిలానికి త‌లూపేశారు. అయితే వైఎస్సార్‌సీపీ మాత్రం దానికి అంగీక‌రించ‌కుండా ప్ర‌త్యేక హోదా కోసం మ‌ళ్ళీ ఉద్య‌మ బాట ప‌ట్టింది. ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి యువ‌భేరి స‌భ‌లు నిర్వ‌హించారు. పార్టీప‌రంగా ఢిల్లీలో 2015 ఆగ‌స్టు 10న ఒక‌రోజు ధ‌ర్నా నిర్వ‌హించారు. అదే ఏడాది ఆగ‌స్టు 29న రాష్ర్ట‌బంద్ కూడా నిర్వ‌హించారు. అదే క్ర‌మంలో 2017 జ‌న‌వ‌రి 26న ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో పార్టీ నిర్వ‌హించ త‌ల‌పెట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళ్లిన జ‌గ‌న్‌ను విశాఖ విమానాశ్ర‌యం ర‌న్‌వేపైనే రాష్ర్ట ప్ర‌భుత్వం అడ్డుకొని అరెస్టు చేసింది. అయినా ఏమాత్రం త‌గ్గ‌ని జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కే క‌ట్టుబ‌డ్డారు. అదే నినాదంతో గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో పాల్టొన్నారు. హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చే పార్టీల‌కే కేంద్రంలో మ‌ద్ద‌తు ఇస్తామ‌ని స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. ఒక‌వైపు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాలు చేస్తూనే మ‌రోవైపు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు సాగించారు. అనేక స‌మ‌స్య‌ల‌తో కుంగిపోతున్న రైతుల‌కు అండ‌గా అనంత‌ర‌పురం రైతు భ‌రోసా యాత్ర‌, మ‌ద్ద‌తు ధ‌ర‌లు కోరుతూ గుంటూరు రైతు దీక్ష‌, విశాఖ‌లో టీడీపీ నేత‌ల భూదందాల‌కు నిర‌స‌న‌గా సేవ్ విశాఖ నినాదంతో ఒకరోజు దీక్ష నిర్వ‌హించారు. మ‌హిళ‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌నిషేధం అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌

రాష్ర్టంలో పెచ్చుమీరిన స‌ర్కారీ అరాచ‌కాలు, టీడీపీ నేత‌ల‌, జ‌న్మ‌భూమి క‌మిటీ ఆగ‌డాల నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో స్వ‌యంగా ప్ర‌జ‌లు క‌ష్టాలు, స‌మ‌స్య‌లు తెలుసుకొని.. నేనున్నానంటూ వారికి భ‌రోసా ఇచ్చేందుకు జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల్లో పెనుమార్పుల‌కు నాందీవాచ‌కం ప‌లికింది. 2017 న‌వంబ‌ర్ ఆరో తేదీన ఇడుపుల‌పాయ‌లో ఈ యాత్ర మొద‌లుపెట్టిన జ‌గ‌న్ 14 నెల‌ల పాటు నిర్వ‌రామంగా న‌డిచారు. కొండ‌లు, కోన‌లు దాటుకుంటూ మారుమూల ప‌ల్లెలు, ప‌ట్నాల‌ను స్పృశిస్తూ.. అక్క‌డి ప్ర‌జ‌ల గుండె ఘోష వింటూ సాగిన ఈ యాత్ర‌లో తాను విన్న‌, క‌న్న స‌మ‌స్య‌ల‌నే జ‌గ‌న్ త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోగా మ‌ల‌చుకున్నారు. న‌వ‌ర‌త్నాలుగా తీర్చిదిద్దారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల ఇళ్ళ‌కే చేర్చేలా గ్రామ స‌చివాల‌య‌, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌తిపాదించారు. వాటితోనే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి.. రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ఆయ‌న మాట‌లను, వాగ్దానాల‌ను విశ్వ‌సించిన ప్ర‌జ‌లు అపూర్వ విజ‌యం అందించారు. సుమారు 51 శాతం ఓట్లు, 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల క‌ట్ట‌బెట్టి అధికార‌ప‌గ్గాలు అప్ప‌గించారు.‌‌‌‌‌

Also Read : జగనన్న విద్యాకానుకలో డిక్షనరీ కూడా. ..

పార‌ద‌ర్శ‌క పాల‌న‌తో విప్ల‌వం

జ‌గ‌న్ అనే నేను.. అని భ‌రోసా ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన యువ‌నేత జ‌గ‌న్‌.. వ‌చ్చిన మ‌రుక్ష‌ణం నుంచే ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానాల‌ను నెర‌వేర్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. విభ‌జ‌న గాయంతో ఆదాయ వ‌న‌రులు త‌గ్గిపోవ‌డం.. టీడీపీ స‌ర్కారు ఖాళీ ఖ‌జానాను అప్ప‌గించినా.. ఏమాత్రం వెర‌వ‌కుండా ఖ‌ర్చుల‌ను త‌గ్గించ‌డంతోపాటు ఆదాయ మార్గాలు పెంచుకునే విధానాలు అవ‌లంభిస్తూ న‌వ‌ర‌త్నాల రూపంలో సంక్షేమ ఫ‌లాల‌ను ఒక్కొక్కొటిగా ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. ఈ రెండేళ్ల‌లో దాదాపు ప్ర‌తి కుటుంబానికీ ఏదోరూపంలో ఆర్థిక ప్ర‌యోజ‌నం క‌ల్పించ‌గ‌లిగారు. సంక్షేమ ప‌థ‌కాల‌తోపాటు పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త కోసం విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్రాజెక్టులు, భారీ నిర్మాణాల్లో రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానం, సంక్షేమ ప‌థ‌కాల్లో అ్ర‌క‌మాలు జ‌ర‌గ‌కుండా నేరుగా ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే న‌గ‌దు జ‌మ చేయ‌డం, ఇంటికే రేష‌న్ స‌రుకుల డెలివ‌రీ వంటి నిర్ణ‌యాల‌తో దేశం దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నారు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం, సంక్షేమ ప‌థ‌కాలు, ఇళ్ళు, స్థ‌లాల‌ను వారి పేరిటే మంజూరు చేయ‌డం.. దిశ వంటి చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న ద్వారా అక్క‌చెల్లెమ్మ‌ల‌కు నిజ‌మైన అన్న‌గా జ‌గ‌న్ నిరూపించుకున్నారు. వ‌లంటీర్, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల ఏర్పాటుతో పింఛ‌న్ల‌తోస‌హా అన్ని ప‌థ‌కాలు, దృవ‌ప్ర‌తాల‌ను ప్ర‌జ‌ల ఇంటికే తీసుకెళ్ళి అందించే ఏర్ప‌టు చేసిన జ‌గ‌న్‌.. అదే వ్య‌వ‌స్థ ద్వారా ఒకేసారి 4 ల‌క్ష‌ల‌మందికి ఉద్యోగుల క‌ల్పించ‌గ‌లిగారు. మ‌రోవైపు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ద్వారా యువ‌తో నైపుణ్యానికి సాన‌బ‌ట్టి వంద‌లు వేల ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్య రంగాల్లో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌తో పాల‌న‌లో త‌న‌దైన ముద్ర వేస్తుస్న జ‌గ‌న్‌.. త‌ద్వారా వైఎస్సార్‌సీపీకి ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి