iDreamPost

సందేహాలు.. చర్చలకు తావు లేకుండా.. వైఎస్‌ జగన్‌ వాట్‌ ఏ ప్లాన్‌..!!

సందేహాలు.. చర్చలకు తావు లేకుండా.. వైఎస్‌ జగన్‌ వాట్‌ ఏ ప్లాన్‌..!!

అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకణపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఈ విషయంపై విధాన పరమైన నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి సందేహాలు, చర్చలకు అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో సాగుతున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

గత నెల 17వ తేదీన అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున మూడు రాజధానుల ఏర్పాటుపై తన ఆలోచనను సీఎం జగన్‌ వెల్లడించినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అమరావతి కేంద్రంగా నిరసనలు కొనసాగిస్తోంది. జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ కమిటీ నివేదికలపైనా ప్రతిపక్ష పార్టీ అనేక ఆరోపణలు, విమర్శలు చేసింది. గత నెల 27వ తేదీన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశమైంది. అంతకు ముందుగానే రాష్ట్ర అభివృద్ధి, రాజధానిపై జగన్‌ సర్కార్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చింది. క్యాబినెట్‌ భేటికి కొద్ది సమయం ముందు రాజధాని అమరావతి పేరుతో సాగిన అక్రమాలు, నిబంధనలకు విరుద్దంగా జరిగిన పనులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చింది.

ఈ భేటిలోనే రాయలసీమలో న్యాయ పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన నిర్మాణ, విశాఖలో కార్యనిర్వాహఖ రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ప్రతిపక్ష టీడీపీ, రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. మరో వైపు మూడు రాజధానులే కావాలంటూ రాయలసీమ, ఉత్తరాంధ్రలో వైస్సార్‌సీపీ, ప్రజలు భారీగా ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తూ విరాళాలు సేకరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేయకూడదన్న చంద్రబాబు ఇప్పుడు ఉద్యమాలు, ఆందోళనలు చేయాలంటూ విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తూ ఆందోళనలన తీవ్ర తరం చేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.

అనంతపురం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు అక్కడి ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టీడీపీ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అమరావతికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తుండగా, అందుకు పోటాపోటీగా వైఎస్సార్‌సీపీ, ఇతర ప్రజా సంఘాలు తమ ప్రాంత అభివృద్ధికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని అంశంపై సందేహాలకు, చర్చలకు తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నెల 8న, ఈ రోజు(18వ తేదీ)న జరగాల్సిన మంత్రివర్గ సమావేశాలను వ్యూహాత్మకంగానే వాయిదా వేసినట్లు అర్థమవుతోంది. మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చ జరిగినా అది రాజధానిపైనే అన్నట్లుగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో వార్తలు ప్రసారం కావడం, వాటిపై మళ్లీ చర్చలు పెట్టడం తెలుగు టీవీ చానెళ్లలో సర్వసాధారణంగా జరుగుతోంది.

ఇలా జరిగితే ప్రజల్లో లేనిపోని సందేహాలు, అనుమానాలకు, శాంతిభద్రతలకు సమస్యకు తావిచ్చినట్లుగా ఉంటుందనే మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రెండూ ఒకే రోజు నిర్వహించాలనే ప్రణాళికతోనే ఈ రోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం సోమవారానికి వాయిదా పడినట్లు సమాచారం. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలపై హైపవర్‌ కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసి అనంతరం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభించనున్నారు. అసెంబ్లీలో చర్చ నిర్వహించి రాజధానిపై నిర్ణయం తీసుకుని, ఈ అంశానికి తెరదించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి