iDreamPost

అంచనాలకు అందని వైఎస్‌ జగన్‌..!

అంచనాలకు అందని వైఎస్‌ జగన్‌..!

ప్రభుత్వాన్ని నడపడంతో ఇప్పటికే సరికొత్త అధ్యాయాలను రచించిన సీఎం వైఎస్‌ జగన్‌.. పార్టీని నడపడంలోనూ తనదైన మార్క్‌ను వేస్తున్నారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత సాధారణంగానే పదవులు ఆశించిన వారిలో, వారి అనుచరుల్లో అసంతృప్తి ఉండడం సర్వసాధారణం. ఆయా అసంతృప్తులను చల్లార్చడంతోపాటు వారి సేవలను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవడంలో సీఎం జగన్‌ది అందవేసిన చేయిగా చెప్పవచ్చు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరిగిన వారం రోజులకే.. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లుగా సీనియర్‌ నేతలను, మంత్రి పదవులకు రాజీనామా చేసిన వారిని, కొత్తగా మంత్రి పదవి ఆశించిన వారిని నియమించారు. ఇంత తక్కువ వ్యవధిలో జగన్‌ వేగంగా నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాజకీయాల్లో చాణక్యులు అని ప్రచారంలో ఉన్న నేతలే.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు నెలల తరబడి సమయం తీసుకుంటారు. కానీ జగన్‌ కేవలం వారం రోజుల్లోనే పరిస్థితిని మళ్లీ యథాతథ స్థితికి తీసుకువచ్చారు.

మంత్రులుగా రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, కొడాలి నానిలకు రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాధ్యతలను సీఎం జగన్‌ అప్పగించారు. మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, శంకర నారాయణ, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్, పాముల పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్‌లకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. మంత్రుల సేవలను పార్టీ కోసం వినియోగించుకుంటామని చెప్పినట్లుగానే.. సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక మంత్రి పదవులు ఆశించిన వారికి, మంత్రి పదవి రేసులో ఉన్న వారికి కూడా సీఎం జగన్‌ పార్టీ బాధ్యతలను అప్పగించారు. వారందరికీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టారు. కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, వై. బాలనాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, బుర్రా మధుసూదన్‌ యాదవ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జక్కంపూడి రాజా, పొన్నాడ సతీష్‌కుమార్, కరణం ధర్మశ్రీ, కొట్టగుల్లి భాగ్యలక్ష్మీలను జిల్లా అధ్యక్షులుగా నియమించి వారిపై గురుతర బాధ్యతలను పెట్టారు. మరో రెండేళ్లలో జరగబోయే ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేలా వీరందరూ పని చేయాల్సి ఉంటుంది. పార్టీ అధికారంలోకి వస్తే.. వీరికి ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఈ ప్రకటన పార్టీ బాధ్యతలు చేపట్టిన వారు ఉత్సాహంగా పని చేసేందుకు ఉపయోగపడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి