iDreamPost

పాలనపై నమ్మకం.. ప్రజలపై విశ్వాసం.. మున్సిపల్‌ ఎన్నికలకు వైసీపీ కరపత్రం

పాలనపై నమ్మకం.. ప్రజలపై విశ్వాసం.. మున్సిపల్‌ ఎన్నికలకు వైసీపీ కరపత్రం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ సర్కార్‌ 21 నెలల పాలనే ప్రధాన అజెండాగా ఆ పార్టీ మున్సిపల్‌ ఎన్నికలకు వెళుతోంది. పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైసీపీ.. వైఎస్‌ జగన్‌ సంక్షేమ పాలనను ప్రజలకు చూపిస్తోంది. వైఎస్‌ జగన్‌ పాలనపై నమ్మకంతో ఉన్న వైసీపీ.. ప్రజల తమ వెంటే ఉన్నారనే ఆత్మవిశ్వాసంతో మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. అందుకే కొత్త హమీలు ఏమీ ఇవ్వకుండా.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హమీలు, వాటి అమలును ప్రజల ముందు ఉంచుతోంది. చెప్పుకునేందుకు వైసీపీకి ఎన్నో పథకాలు, పనులు ఉండడంతో ఆ పార్టీ కౌన్సిలర్, కార్పొరేటర్‌ అభ్యర్థులు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళుతున్నారు.

పార్టీ అభ్యర్థులు చేస్తున్న ప్రచారానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చేందుకు వైసీపీ మున్సిపల్‌ ఎన్నికల కోసం నాలుగు పేజీల కరపత్రాన్ని విడుదల చేసింది. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ 21 నెలల పాలనలో చేసిన పనులను ఆ కరపత్రంలో వివరించింది. 21 నెలల్లో ప్రతి కుటుంబం అవసరాలు తీర్చేలా పాలన చేశామని, మంచి చేస్తున్న ప్రభుత్వానికి మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మద్ధతు పలకాలని కోరుతూ వైసీపీ ఆ కరపత్రంలో విన్నవించింది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణ, నగర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ కరపత్రంలో ముఖ్యమైన అంశాలనే వైసీపీ పొందుపరిచింది.

ప్రభుత్వ సేవలు అందించడంలో అమలు చేసిన విప్లవాత్మక చర్యలు, అర్హతే ఆధారంగా ఇచ్చిన పథకాలు, చదువుల కోసం అమలు చేసిన అమ్మ ఒడి, మన బడి నాడు నేడు, ఫీజు రియంబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలు, వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకంలో చేసిన మార్పులు, వ్యవసాయం– రైతుల కోసం అమలు చేసిన పథకాలు, రైతు భరోసా కేంద్రాలు, మహిళల కోసం అమలు చేసిన వైఎస్సార్‌ ఆసరా, చేయూత పథకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి చేసిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు, చేతి వృత్తుల వారికి అండగా ఉండేందుకు అమలు చేసిన జగనన్న చేదోడు, చిరు వ్యాపారులకు అమలు చేసిన జగనన్న తోడు పథకాలు, చిన్న, మధ్యపరిశ్రమల వారికి కల్పించిన రాయతీలను నాలుగు పేజీ కరపత్రంలో వైసీపీ పేర్కొంది. ఈ కరపత్రాలను అభ్యర్థుల తమ ప్రచారంలో ప్రజలకు అందిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి