iDreamPost

చాలా మందికి టికెట్లు రావచ్చు.. కొందరికి రాకపోవచ్చు.. సీఎం జగన్

చాలా మందికి టికెట్లు రావచ్చు.. కొందరికి రాకపోవచ్చు.. సీఎం జగన్

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే 175 కి 175 స్థానాలను గెలవడం అసాధ్యమేమీ కాదని స్పష్టం చేశారు. ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ సారి టికెట్లు కొందరికి రావచ్చు, మరికొందరికి రాకపోవచ్చు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. టికెట్ దక్కని వారు నా వాళ్లు కాకుండా పోరని వారికి ఏదో ఒక పదవి ఇస్తామని వెల్లడించారు. టికెట్ల విషయంలో అందరు తన నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు.

కాగా సీఎం జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలం మరో ఎత్తు అని తెలిపారు. వచ్చే 6 నెలలు ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని, మనం గేర్‌ మార్చాల్సిన సమయం వచ్చిందని పార్టీ నేతలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సీఎం జగన్ వైసీపీ పార్టీ నాయకులకు సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలవాలని కోరారు. నాయకులందరూ ఓ కుటుంబంలా కలిసి పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా పని చేయాలని కోరారు. ఇక టికెట్లు రాని వారు నిరాశ చెందకూడదని, వారికి మరో చోట పదవి ఇస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, పార్టీ రీజినల్‌ ఇంచార్జులు హాజరయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి