iDreamPost

దుష్ప్రచారం పటాపంచలు.. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పాదయాత్ర విజయవంతం

దుష్ప్రచారం పటాపంచలు.. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పాదయాత్ర విజయవంతం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం వైసీపీ నేత, ఎంపీ వి.విజయసాయి రెడ్డి చేసిన పాదయాత్ర విజయవంతమైంది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేస్తానని విజయసాయి రెడ్డి ప్రకటించినప్పటి నుంచీ ఆయనపై టీడీపీ నేతలు సాగించిన దుష్ప్రచారం సాగరతీరంలో కొట్టుకుపోయింది. ఈ రోజు ఉదయం గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర 25 కిలోమీటర్ల మేర సాగింది. విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు గాజువాక నియోజకవర్గంలో విజయసాయి రెడ్డి పాదయాత్ర సాగింది. వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజలు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు విజయసాయి అడుగుతో అడుగులు కలిపారు. వివిధ ప్రజా సంఘాల నేతలు పాదయాత్రలో పాల్గొని తమ మద్ధతుని తెలియజేశారు. సాయంత్రానికి విజయసాయి రెడ్డి పాదయాత్ర స్టీల్‌ప్లాంట్‌ వద్దకు చేరుకుంది.

స్టీల్‌ ప్లాంట్‌ వద్ద అశేష ప్రజలు, కార్మికులను ఉద్దేశించి విజయసాయి రెడ్డి ప్రసంగించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో ఉంచడమే తమ ప్రభుత్వం లక్ష్యమని పునరుద్ఘాటించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు తాము ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని తమ పార్టీ ఎంపీలు కేంద్ర పెద్దలను కలిసి విన్నవించామని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారని, విశాఖ వచ్చి కార్మికుల పోరాటంలో భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకై తమ పోరాటం ఇక ముందు కొనసాగుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమంలో కలసిరాని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ కూడా రాయలేదని ధ్వజమెత్తారు. ప్రజలు ఎప్పటికీ చంద్రబాబును క్షమించబోరని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల ఆంకాక్షను వైసీపీ నేరవేరుస్తుందనే నమ్మకంతోనే పాదయాత్రలో విరివిగా పాల్గొన్నారని విజయసాయిరెడ్డి అభివర్ణించారు. పాదయాత్రలోనూ, స్టీల్‌ ప్లాంట్‌ ఎదురుగా జరిగిన బహిరంగ సభలోనూ ప్రజలు, కార్మికులు ‘ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదాలు చేసి తమ ఆకాంక్షను బలంగా తెలియజేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి