iDreamPost

జనతా కర్ఫ్యూపై జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

జనతా కర్ఫ్యూపై జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

దేశంలో ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న పదం జనతా కర్ఫ్యూ. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు ఆయన చూపిన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని పిలుపునందుకుని రాష్ట్రాల సీఎంలు కూడా అదే ప్రకటన చేస్తున్నారు. జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ పాల్గొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పిలుపునివ్వగా.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం ప్రభుత్వం నుంచే ఆ పని ప్రారంభిస్తున్నారు.

రేపు ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూ కార్యక్రమం సాగనుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రధాని కోరారు. దుకాణాలు, మాల్స్‌తోపాటు అన్ని వ్యాపారాలు బంద్‌ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందు వేసి వ్యాపారులకు స్పష్టమైన సంకేతాలు పంపేందుకు సిద్ధమవుతోంది. ఏపీలో మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ దుకాణాలను జనతా కర్ఫ్యూలో భాగంగా రేపు ఆదివారం బంద్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా ఇతర వ్యాపార సంస్థలు, దుకాణాల యజమానులు కూడా ప్రభుత్వాన్ని అనుచరించే అవకాశం ఉంది.

కరోనా వైరస్‌ 12 గంటల పాటు బతికి ఉంటుందని, జనతా కర్ఫ్యూ 14 గంటలపాటు సాగుతుండడంతో ఆ వైరస్‌ అంతమవుతుందన్న సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ రాగి ఉపరితలంలో నాలుగు గంటల వరకు, అట్టపెట్టెలపై 24 గంటలు, ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వస్తువులపై రెండు నుంచి మూడు రోజులు, అల్యూమినియం, చెక్క, పేపర్‌పై ఐదు రోజులు వరకూ బతుకుతుందని వివరిస్తున్నారు. జనతా కర్ఫ్యూలో 14 గంటల పాటు ఇంట్లో ఉన్నంత మాత్రాన వైరస్‌ అంతమవదని, అది పూర్తిగా అంతమయ్యే వరకూ శుభ్రత, సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి